Share News

అనుమతుల కోసం సువిధ పోర్టల్‌ యాప్‌

ABN , Publish Date - Mar 22 , 2024 | 01:01 AM

రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి అవసరమయ్యే వాహనాలు, ఇతర అనుమతుల మంజూరుకు సువిధ పోర్టల్‌ యాప్‌ ద్వారా లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనుమతుల కోసం సువిధ పోర్టల్‌ యాప్‌

వన్‌టౌన్‌, మార్చి 21 : రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి అవసరమయ్యే వాహనాలు, ఇతర అనుమతుల మంజూరుకు సువిధ పోర్టల్‌ యాప్‌ ద్వారా లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారికి లేదా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం వారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాహనాల అనుమతికి సంబంధించి దరఖాస్తుతో పాటు వాహన రిజిస్ట్రేషన్‌ వివరాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన యాజమాని పేరు, డ్రైవర్‌ పేరు, చిరునామా, ఫోన్‌ నెంబర్‌ తదితర వివరాలు జతచేయాలని తెలిపారు. వాహనం సంచరించే ప్రదేశాల వివరాలు, రూట్‌ మ్యాప్‌ తెలియజేయాలి. వాహన తనిఖీ అధికారి( మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌) నుంచి వాహనాన్ని తనిఖీ చేయించుకుని సర్టిఫికేట్‌ తీసుకోవాలి. తాత్కాలిక ఎన్నికల కార్యాలయం ఏర్పాటుకు భవన యాజమాని అనుమతి, లేదా అద్దె వివరాలు ఇతర అంచనాల వ్యయం, తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ర్యాలీలు, రోడ్డు షోలు, ఇతర కార్యక్రమాల అనుమతికి ప్రదేశం, రూట్‌ మ్యాప్‌ ర్యాలీలో పాల్గొనే వారి సంఖ్య, తేదీ, సమయం ఇతర వివరాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి తెలియజేసి అనుమతి తీసుకోవాలి. బహిరంగ సభ నిర్వహణ సమయంలో వీఐపీ, వీవీఐపీల సందర్శన సమయంలో హెలీప్యాడ్‌ అనుమతి కోసం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనుమతి కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అనుమతులకు కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా.. వాహనాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించినా ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించినట్టు పరిగణించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ దిల్లీరావు పేర్కొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 01:02 AM