Share News

మరో ఉద్ధానంలా ఎన్టీఆర్‌ జిల్లా మండలాలు

ABN , Publish Date - Aug 23 , 2024 | 01:42 AM

ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు, గంపలగూడెం, తిరువూరు, విసన్నపేట, మైలవరం తదితర మండలాల పరిధిలోని చాలా గ్రామాల్లో కిడ్నీ వ్యాధితో వందల మంది పిట్టల్లా రాలిపోతూ మరో ఉద్ధానంలా తయారైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు.

మరో ఉద్ధానంలా ఎన్టీఆర్‌ జిల్లా మండలాలు

గవర్నర్‌పేట, ఆగస్టు 22 : ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు, గంపలగూడెం, తిరువూరు, విసన్నపేట, మైలవరం తదితర మండలాల పరిధిలోని చాలా గ్రామాల్లో కిడ్నీ వ్యాధితో వందల మంది పిట్టల్లా రాలిపోతూ మరో ఉద్ధానంలా తయారైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి అఖిలపక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, సమగ్రంగా చర్చించి, శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గురువారం శ్రీశ్రీ భవన్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి డివీ కృష్ణ, ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శుద్ధి చేసిన కృష్ణా నీటిని కుళాయిల ద్వారా ఇంటింటికీ అందించాలని, కిడ్నీ బాధితులకు ప్రతి నెలా రూ. 5 వేలు పెన్షన్‌ ఇవ్వాలని, కిడ్నీ ఆసుపత్రిని వెంటనే నిర్మించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 24న మండల కేంద్రమైన ఎ.కొండూరులో ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎ.కొండూరు, గంపలగూడెం మండల పరిధిలోని అనేక గ్రామాల్లో ప్రజారోగ్యం క్షీణిస్తున్నదని అందోళన వ్యక్తం చేశారు. ఉద్ధానం తరువాత అత్యధిక మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందిన వారు ఎ.కొండూరు మండలంలోనే ఉన్నారని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ మాట్లాడుతూ, తమ బృందాలు ఆయా ప్రాంతాల్లో గత వారంరోజుల పాటు పర్యటించి తాజా పరిస్థితులపై అధ్యయనం చేయడం జరిగిందని తెలిపారు. కిడ్నీ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Aug 23 , 2024 | 01:42 AM