Share News

మరో డ్రామా

ABN , Publish Date - May 12 , 2024 | 01:23 AM

కనుచూపు మేరలో ఓటమి కనిపిస్తుంటే గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ. కాపు సామాజికవర్గంలో పట్టున్న వైసీపీ నేత డాక్టర్‌ దుట్టా రామచంద్రరావును ప్రసన్నం చేసుకునేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

మరో డ్రామా

ఇంకోసారి దుట్టాను కలిసిన వల్లభనేని వంశీ

ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆసుపత్రికి..

రోగులను పరీక్షిస్తున్న సమయంలో వంశీ రాక

అయిష్టంగా ఆహ్వానించిన డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు

వంశీతో చేయి కలిపేందుకు విముఖత

బలవంతంగా లాక్కుని కరచాలనం చేసిన వంశీ

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : కనుచూపు మేరలో ఓటమి కనిపిస్తుంటే గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ. కాపు సామాజికవర్గంలో పట్టున్న వైసీపీ నేత డాక్టర్‌ దుట్టా రామచంద్రరావును ప్రసన్నం చేసుకునేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా శనివారం హనుమాన్‌ జంక్షన్‌లోని దుట్టా ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో దుట్టా ఓపీలో రోగులను పరీక్షిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన అల్లుడు శివభరత్‌రెడ్డితో కలిసి వచ్చిన వంశీని చూసి షాకైన దుట్టా అయిష్టంగానే ఆహ్వానించారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరిన వంశీకి దుట్టా నుంచి ఎలాంటి హామీ లభించలేదు. వెనుదిరిగే సమయంలో దుట్టాతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా, విముఖత చూపారు. దీంతో వంశీ బలవంతంగా దుట్టా చేయిని తీసుకుని కరచాలనం చేసి వెనుదిరిగారు.

సఫలమా..? విఫలమా..?

గన్నవరం నియోజకవర్గంలో డాక్టర్‌ దుట్టా రామచంద్రరావుకు మంచి పేరుంది. కాపు సామాజికవర్గంలో పట్టు ఉంది. దివంగత నేత వైఎస్సార్‌కు సన్నిహితుడు. దుట్టా.. తొలుత కాంగ్రెస్‌లో, ఆ తర్వాత వైసీపీలో కొనసాగుతున్నారు. 2014లో వంశీ టీడీపీ అభ్యర్థిగా, దుట్టా వైసీపీ అభ్యర్థిగా పోటీపడ్డారు. ఆ సమయంలో దుట్టా రామచంద్రరావును వంశీ నానా దుర్భాషలాడారు. అప్పటి నుంచి ఇద్దరి నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ తర్వాత వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. అప్పటి నుంచి దుట్టా వైసీపీలో సైలెంట్‌గా ఉండిపోయారు. 2021లో స్థానిక సంస్థల ఎన్నికల్లో దుట్టా కుమార్తె సీతారామలక్ష్మి ఉంగుటూరు నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై జెడ్పీ చైర్మన్‌ రేసులో నిలిచారు. అయితే, వంశీ కారణంగా ఆమెకు ఆ పదవి దక్కకుండాపోయింది. ఇన్ని పరిణామాల తర్వాత వంశీ మళ్లీ దుట్టా కుటుంబ ఆశీస్సుల కోసం పాకులాడటం గమనార్హం. అయితే, వంశీతో చేతులు కలిపేందుకు దుట్టా ససేమిరా.. అంటున్నారు. దీంతో వంశీ తెలివిగా ఆయన కుమార్తె, అల్లుడిని తనవైపు తిప్పుకొని వారితో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆఖరి ప్రయత్నంగా శనివారం దుట్టాను కలిసేందుకు వంశీ వెళ్లారు. కానీ, వంశీ ప్రయత్నాలు ఫలించినట్లు కనిపించలేదు. వంశీకి తన తండ్రి మద్దతు తెలిపారని దుట్టా కుమార్తె సీతారామలక్ష్మితో ప్రకటన చేయించారు. కొద్దిసేపటికే దుట్టా రామచంద్రరావు అన్న కుమారుడు దుట్టా శివనారాయణ మరో ప్రకటన చేస్తూ వంశీ డ్రామాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

వంశీ డ్రామాలను నమ్మొద్దు : దుట్టా శివనారాయణ

‘ఎన్నికల్లో గెలుపు కోసం వల్లభనేని వంశీ కొత్త డ్రామాలకు తెరతీశారు. కాపు సోదరులెవరూ వంశీ డ్రామాలను విశ్వసించొద్దు. డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు రోగులను చూస్తున్న సమయంలో వంశీ ముందస్తు సమాచారం లేకుండా వచ్చారు. గతంలో పలుమార్లు దుర్భాషలాడి, వ్యక్తిగతంగా రాజకీయంగా ఎన్నో అవమానాలకు గురిచేసిన వంశీ ఇప్పుడు గెలుపు కోసం కొత్త నాటకానికి తెరలేపారు. మద్దతు తెలపమని వంశీ కోరినప్పటికీ రామచంద్రరావు ఒప్పుకోలేదు. వంశీని ఎన్నికల్లో ఘోరంగా ఓడించడమే లక్ష్యంగా కాపు సోదరులు, దుట్టా అభిమానులు పనిచేయాలని కోరుతున్నా.’ అని దుట్టా రామచంద్రరావు కుటుంబ సభ్యుడు దుట్టా శివనారాయణ అన్నారు.

Updated Date - May 12 , 2024 | 01:23 AM