31వ రోజుకు అంగన్వాడీల సమ్మె
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:37 AM
తమ డిమాండ్లు సాధించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని అంగన్‌వ్వాడీ వర్కర్లు, ఆయాలు నినదించారు.

తిరువూరు, జనవరి 11: తమ డిమాండ్లు సాధించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని అంగన్‌వ్వాడీ వర్కర్లు, ఆయాలు నినదించారు. అంగన్‌వ్వాడీల సమ్మె గురువారం 31వ రోజుకు చేరుకుంది. సీఐటీయూ ఆధ్వర్యంలో నెలరోజులుగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన దీక్షలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించి వార్డు, గ్రామ సచివాలయం సిబ్బందితో నడిపేందుకు చేసిన ప్రయత్నాలను సిబ్బంది సంఘటితంగా అడ్డుకున్నారు. వీరి సమ్మెను భగ్నం చేసేందుకు ఎస్మా ప్రయోగించినా సిబ్బంది మొక్కవోని దీక్షతో తమ నిరసన్న కొనసాగిస్తునే ఉన్నారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అంగన్వాడీలకు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. నాయకులు నాగమణి, సుజాత, బణావతు జ్యోతి, షాజబేగం, వెంకటేశ్వరమ్మ, శ్రీలక్ష్మి కస్తూరి, ఉష, రాణికుమారి, పద్మ, నిర్మల, ఆదిలక్ష్మి, కరుణ, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమం ఆపేది లేదు
మైలవరం: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆపేది లేదని సీపీఎం, సీఐటీయూ నాయకులు ఆర్.రమేష్, సీహెచ్ సుధాకర్ అన్నారు. మైలవరంలో అంగన్వాడీల సమ్మె గురువారంతో 31వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా నేతలు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిం చారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇచ్చే వరకు ఉద్యమం ఆగదన్నారు. కార్యక్రమంలో పుష్పకుమారి, సీహెచ్ శారద, బుల్లెమ్మ, రబ్బాని, మాణిక్యం, విజయలక్ష్మి, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.
ఒంటికాలిపై నిలబడి నిరసన
నందిగామ రూరల్: సమ్మె గురువారం 31వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించటం బాధాకరమన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరారు.