Share News

హరివిల్లు.. విరిజల్లు..

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:45 AM

‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహించిన కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు, రియల్‌ పార్టనర్స్‌ స్వర్గసీమ సుకేతన’’ ఫైనల్స్‌ గురువారం నగరంలో అంగ‘రంగుల’ వైభవంగా జరిగాయి.

హరివిల్లు.. విరిజల్లు..
రంగులమయమైన నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని టెన్నిస్‌ కోర్టు

ప్రథమ బహుమతి గెలుచుకున్న విజయనగరం జిల్లా మహిళ

గుంటూరు, అనంతపురం, తమిళనాడు మహిళలకు ద్వితీయ బహుమతులు

11 మందికి కన్సొలేషన్‌ బహుమతులు

బహుమతులు ప్రదానం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

ఆంధ్రజ్యోతి, విజయవాడ : ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహించిన కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు, రియల్‌ పార్టనర్స్‌ స్వర్గసీమ సుకేతన’’ ఫైనల్స్‌ గురువారం నగరంలో అంగ‘రంగుల’ వైభవంగా జరిగాయి. బెంజిసర్కిల్‌ సమీపంలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీ టెన్నిస్‌ కోర్టులో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల స్థాయిలో విజేతలుగా నిలిచిన మహిళలతో పాటు తమిళనాడు, కర్ణాటక విజేతలు కూడా పాల్గొన్నారు. తమ సృజనతో ముత్యాల ముగ్గుల్లో రంగుల దృశ్యాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేయగా, ఉమ్మడి కృష్ణా జిల్లాపరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కెనరా బ్యాంక్‌ విజయవాడ సర్కిల్‌ ఏజీఎం జీవీ నరసింహారావు, కెనరా బ్యాంక్‌ మార్కెటింగ్‌ సర్కిల్‌ సీనియర్‌ మేనేజర్‌ శిరీష, ‘ఆంధ్రజ్యోతి’ న్యూస్‌ ఎడిటర్‌ నాగసుధాకర్‌, ‘ఆంధ్రజ్యోతి’ విజయవాడ యూనిట్‌ మేనేజర్‌ వి.మురళీ, ఏబీఎన్‌ ఏపీ బ్యూరో బి.రామారావు, యాడ్స్‌ ఏజీఎం టి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా అబ్బూరి రత్నలక్ష్మి, మల్లెల శుభప్రద వ్యవహరించారు.

ఐదేళ్లుగా ముగ్గులు వేస్తున్నా

మాది సత్తెనపల్లి వద్ద ఉన్న ధూళిపాళ్ల గ్రామం. ఐదేళ్లుగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నాను. జిల్లాస్థాయి పోటీల్లో రెండుసార్లు ప్రథమ బహుమతి సాధించాను. 2020లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ మొదటి స్థానం నాదే. - ఏ.సునీత, గుంటూరు జిల్లా

పదేళ్లుగా పోటీల్లో ఉంటున్నా..

కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో ఏటా నేను పాల్గొంటా. పదేళ్లుగా నేను ముగ్గులు వేస్తున్నా. తొలిసారిగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. ఈ పోటీల్లో ద్వితీయ బహుమతి రావడం చాలా ఆనందంగా ఉంది.

- రాధ, తమిళనాడు

రెండుసార్లు రాష్ట్రస్థాయి బహుమతి పొందా..

నేను టైలరింగ్‌ చేస్తాను. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నప్పటి నుంచీ పాల్గొంటున్నా. హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించాను. తర్వాత 2023లో నిర్వహించిన పోటీల్లో రెండోసారి ప్రథమ బహుమతిని పొందాను. మళ్లీ ఇప్పుడు ద్వితీయ బహుమతి పొందా. - కె.ఉమాదేవి, అనంతపురం జిల్లా

Updated Date - Jan 12 , 2024 | 12:45 AM