Share News

అమరావతి రాజధాని కోసం.. అవమానాలెదుర్కొన్నా

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:52 AM

వైసీపీలో ఉండగా అమరావతి రాజధాని కోసం అడిగి అనేక అవమానాలు ఎదుర్కొన్నానని.. తనతో పాటు ఉన్న ఎమ్మెల్యేల్లో మల్లాది విష్ణు ఒక్కరే అమరావతి కోసం తనతో కలిసి ప్రశ్నించారని మైలవరం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ గుర్తు చేశారు.

అమరావతి రాజధాని కోసం..   అవమానాలెదుర్కొన్నా
టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌

ఇబ్రహీంపట్నం, మార్చి 27 : వైసీపీలో ఉండగా అమరావతి రాజధాని కోసం అడిగి అనేక అవమానాలు ఎదుర్కొన్నానని.. తనతో పాటు ఉన్న ఎమ్మెల్యేల్లో మల్లాది విష్ణు ఒక్కరే అమరావతి కోసం తనతో కలిసి ప్రశ్నించారని మైలవరం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ గుర్తు చేశారు. విజయవాడ పార్లమెంట్‌ ఉమ్మడి అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని)తో కలిసి ఆయన గుంటుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రజలకు అభివృద్ధితో కూడిన సంక్షేమం అవసరమని, అది చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని, ఆయన్ను సీఎం చేసుకోవడం చారిత్రాత్మక అవసరమన్నారు. ధర్నా అంటూ మైలవరం నియోజకవర్గ ప్రజల్ని పిలిచి చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లారన్నారు. కక్షలు, కార్పణ్యాలు, వ్యక్తిగత దూషణలు, దాడులు ఇలా ఎంతకాలం పరిపాలన సాగిస్తారన్నారు. బూడిద, మట్టి, గ్రావెల్‌, ఇసుక మాఫియా చేసేవారు వేరొకరైతే.. ఆ నిందలు మొత్తం తనపై మోపి మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. వ్యాపారాలు పక్కన బెట్టి మైలవరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు వస్తే.. ఒక్కపైసా కూడా అభివృద్ధికి నిధులివ్వకుండా మొండిచేయి చూపి వేధించారన్నారు. గోదావరి జలాలను చింతలపూడి ద్వారా ఎన్‌ఎస్సీ కాలువల్లో పారించేందుకుగాను గత ప్రభుత్వంలో రూ.3 వేలకోట్లు ఖర్చుచేస్తే, వైసీపీ ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కేవలం 5శాతం నిధులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో పేదలకు సేవచేస్తున్న ఎన్నారైపై వైసీపీ ప్రవర్తించిన తీరు దారుణమన్నారు. దేవినేని ఉమాకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. టీడీపీలో ఉన్నత స్థానం ఆయనకు లభిస్తుందన్నారు. వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డిలు గత ప్రభుత్వాలు చేసిన పనుల్ని కొనసాగిస్తే జగన్‌ మాత్రం తిరోగమనంలో వెళ్లారన్నారు. విద్యుత్‌, బస్సు చార్జీలు విపరీతంగా పెంచారన్నారు. ఇసుక దోపిడీపై ఎవ్వరూ మాట్లాడవద్దని హుకుం జారీ చేశారని ఆవేదన చెందారు. వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ఒంటెత్తు పోకడ నచ్చక పార్టీని వీడి టీడీపీలో చేరినట్టు చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లాలో అన్నిస్థానాల్లో టీడీపీ కైవసం చేసుకోవాలని, దీనికి ప్రజలంతా సంపూర్ణ మద్దతివ్వాలని కోరారు. తనవల్ల గుంటుపల్లి గ్రామంలో ఇబ్బందులు పడిన ప్రతిఒక్కరికీ ఆయన పేరు పేరునా క్షమాపణలు చెప్పారు. ఏదేమైనా ప్రతి ఒక్కరిని కలుపుకొని టీడీపీ విజయానికి కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:52 AM