ఆర్-5 జోన్‌కు గృహయోగం
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:53 AM
రాజధాని అమరావతి ఆర్-5 జోన్‌లో నగరానికి చెందిన పేదలకు గత ప్రభుత్వం కేటాయించిన నివేశనా స్థలాల స్థానంలో టిడ్కో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 25 వేల మంది పేదలకు టిడ్కో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు 265 ఎకరాల భూములను సేకరించాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నిర్దేశించింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అధికారులు విజయవాడ రూరల్ మండలంలో భూ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
లబ్ధిదారులకు విజయవాడ రూరల్ మండలంలో టిడ్కో ఇళ్లు
రాజధానిలో ఆర్-5 జోన్ రద్దు
ఆ 25 వేల మందికి మంజూరు చేయాలని నిర్ణయం
265 ఎకరాల సేకరణకు ప్రభుత్వం ఆదేశాలు
విజయవాడ రూరల్, జి.కొండూరు మండలాల్లో అన్వేషణ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ రూరల్ మండలాలైన కొత్తూరు తాడేపల్లితో పాటు వెలగలేరులో భూములు సేకరించేందుకు రె వెన్యూ యంత్రాంగం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొత్తూరు తాడేపల్లిలో రైతులే స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తొలుత పోలవరం కాల్వ దగ్గర భూములను అధికారులు పరిశీలించారు. బుడమేరు వరద ముంపునకు గురైన ప్రాంతం కాబట్టి.. అక్కడ టిడ్కో ఇళ్లు నిర్మిస్తే సమస్యలు వస్తాయన్న వాదనలు వచ్చాయి. అలాగే, పోలవరం అవతల ఎగువ ప్రాంత రైతులు కూడా తాము తక్కువ ధరకే భూములిస్తామని, మెరక కూడా చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వంపై ఖర్చు తగ్గుతుందని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. రైతుల మధ్య నెలకొన్న పోటీ కారణంగా స్థానిక రెవెన్యూ యంత్రాంగం గందరగోళంలో పడింది. పేదల కోసం నిర్మించే టిడ్కో ఇళ్లు వరద ప్రభావిత ప్రాంతంలో కట్టించకూడదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇటీవల డీఆర్‌సీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మెరకగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేయాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగం భావిస్తోంది. ఈ అంశంపై విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య దృష్టిపెట్టారు. రూరల్ మండల తహసీల్దార్ సుగుణ కూడా అవసరమైన భూముల కోసం రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
గతంలో.. టీడీపీ హయాంలో..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జక్కంపూడిలో జెట్‌సిటీ నిర్మాణం మొదలైంది. ఇందులో భాగంగా టిడ్కో ఇళ్ల పనులు పనులు చేపట్టారు. దాదాపు 6 వేల ఇళ్ల నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. జెట్‌సిటీని విస్తరించి ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి వీలుగా గతంలో షాబాదలో భూములు సేకరించాలని నిర్ణయించారు. జక్కంపూడి, వేమవరం, షాబాదలో 100 ఎకరాలు సేకరించాలనుకున్నారు. ఎకరాకు రూ.కోటి పరిహారం చొప్పున ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ భూములను తీసుకోలేదు. జక్కంపూడి, షాబాద, వేమవరానికి దగ్గరగా ఉండేలా కొత్తూరు తాడేపల్లిలో వీలైనంత ఎక్కువగా భూములు సేకరించాలని ప్రస్తుతం విజయవాడ రూరల్ మండల రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.
ప్రధాన మార్గం అవసరం
టిడ్కో ఇళ్లకు చేరుకోవటానికి వీలుగా గ్రాండ్ రోడ్డుగా పోలవరం కట్టరోడ్డును అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం నుంచి నున్న వరకు పోలవరం కాల్వకట్ట వెంబడి రోడ్డును అభివృద్ధి చేశారు. అయితే, ఈ రోడ్డు మధ్యలో కల్వర్టులను నిర్మించకపోవటం వల్ల పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. కల్వర్టులను ఏర్పాటు చేయటంతో పాటు గన్నవరం నుంచి ఏలూరు జిల్లాకు అనుసంధానం చేస్తే.. టిడ్కో ఇళ్లకు గ్రాండ్ ఎంట్రన్స్ రోడ్డు ఏర్పడుతుంది. ఇదే కనుక చేస్తే జక్కంపూడిలోని జెట్‌సిటీకి, కొత్తూరు తాడేపల్లిలో నిర్మించే టిడ్కో ఇళ్లకు ప్రధాన రోడ్డుగా మారుతుంది. ఇక్కడివారు తాము పనులు చేసుకునే ప్రాంతాలకు సులువుగా వెళ్లేలా రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఈ రోడ్డును అభివృద్ధి చేస్తే నున్న, అంబాపురం, నైనవరం, పాత పాడు, జక్కంపూడి, షాబాద, వేమవరం తదితర అనేక గ్రామాలకు ప్రధాన రాజమార్గం అవుతుంది. పోలవరం కాల్వకట్ట రోడ్డును కూడా దృష్టిలో ఉంచుకుని ఈ కాల్వకు ఎగువన భూములపై దృష్టి సారించాలని రెవెన్యూ యంత్రాంగం భావిస్తోంది.