Share News

అమరావతికి రైలుకూత

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:02 AM

అర దశాబ్దం తర్వాత అమరావతికి రైల్వేకూత కూసింది. కొత్త రైల్వేలైన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపటంతో అంతటా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చేనెలలోనే శంకుస్థాపన జరిగే అవకాశాలుండటంతో ఇప్పటికే ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల పరిధిలో భూ సేకరణ పనులు ముమ్మరం చేశారు.

అమరావతికి రైలుకూత

ఐదేళ్ల తర్వాత పట్టాలెక్కనున్న నూతన రైల్వేలైన్‌

ఎర్రుపాలెం-నంబూరుకు కేంద్రం ఓకేపై హర్షం

నవంబరులో శంకుస్థాపన చేసే అవకాశం - పరిటాలకు మహర్దశ

అమరావతి నుంచి దేశంలోని కీలక ప్రాంతాలకు కనెక్టవిటీ

విజయవాడ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : అమరావతికి మొత్తం 57 కిలోమీటర్ల సింగిల్‌ లైన్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.2,245 కోట్లను కేటాయించింది. గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఈ రైల్వేలైన్‌ను ప్రతిపాదించారు. అప్పట్లో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. తర్వాత ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు, మరో రెండు లైన్లు కలిపి రూ.2,800 కోట్లతో డీపీఆర్‌ తయారు చేశారు. ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, తాడికొండ, కొప్పవరం, నంబూరు వరకు అమరావతి నూతన రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌కు రూపకల్పన చేశారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ రైల్వే ప్రాజెక్టుల జాబితాలో దీనికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావటంతో అమరావతి విధ్వంసం మాదిరిగానే రైల్వేలైన్‌ను కూడా పక్కన పెట్టేశారు. ప్రాధాన్యత కలిగిన రైలు ప్రాజెక్టుల జాబితాల నుంచి తొలగించారు. తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఈ రైల్వేలైన్‌కు కదలిక వచ్చింది. ఏపీ ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో మళ్లీ చేరింది. 57 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను రూ.2,245 కోట్లతో నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధానంగా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 37 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పెదకూరపాడు, సత్తెనపల్లి మార్గాలు కూడా కలిపితే 57 కిలోమీటర్లు అవుతుంది. ప్రస్తుతానికైతే సింగిల్‌ లైన్‌ నిర్మాణ పనులు చేపడతారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌గా విస్తరించే అవకాశం ఉంది. కొండపల్లి అభయారణ్యానికి ఇబ్బంది లేకుండా అమరావతి రైల్వేలైన్‌ను నిర్మించనున్నారు. పాత ప్రతిపాదన ప్రకారం ఈ లైన్‌ రిజర్వు ఫారెస్టులోకి కొంతమేర వచ్చింది. ప్రస్తుత అలైన్‌మెంట్‌లో ఎలాంటి వృక్షాలు, అటవీ ప్రాంతాలు దెబ్బతినకుండా రూపొందించారు.

జిల్లాలో 296 ఎకరాల సేకరణ

అమరావతి రైల్వేలైన్‌కు సంబంధించి జిల్లాలో 296 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియ చేపట్టారు. కంచికచర్ల, వీరులపాడు మండలాల పరిధిలో భూములను సేకరించాల్సి ఉంది. ఈ రెండు మండలాల పరిధిలో పరిటాల, గొట్టుముక్కల, నరసింహారావుపాలెం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, అల్లూరు, పెద్దాపురం, గూడెం మాధవరం గ్రామాల్లో భూములు సేకరించాలి.

పరిటాల వద్ద మల్టీ మోడల్‌ కార్గో టెర్మినల్‌

పరిటాల వద్ద మల్టీమోడల్‌ కార్గో టెర్మినల్‌ నిర్మించేందుకు ప్రతిపాదించారు. దీనిని ఎన్‌హెచ్‌-65 వెంబడి ఏర్పాటు చేస్తారు. మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ అనేది.. రైల్వే సరుకు రవాణాతో పాటు జల, రోడ్డు రవాణా సేవలకు కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల 17 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

కృష్ణానదిపై ఐకానిక్‌ రైల్వేబ్రిడ్జి

కృష్ణానదిపై ఐకానిక్‌ రైల్వేబ్రిడ్జికి రైల్వే అంగీకరించింది. నదిపై 3.2 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిని నిర్మిస్తారు. దీనిని ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తామని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులు ప్రకటించారు.

అమరావతి టూ...

అమరావతి రైల్వేలైన్‌ దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయితో పాటు అన్ని రాష్ర్టాల రాజధానులతో అనుసంధానించేలా అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అమరావతి నుంచి హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా నగరాలకు మరింత కనెక్టివిటీ ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా మరెన్నో ఉత్తర, దక్షిణాది రాష్ర్టాలకు అనుసంధానమవుతుంది.

మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం

అమరావతి రైల్వేలైన్‌ మచిలీపట్నం పోర్టుకు అనుసంధానమయ్యేలా అలైన్‌మెంట్‌ను రూపొందించారు. దీంతో రానున్న రోజుల్లో రాజధానిలో మచిలీపట్నం పోర్టు కీలకపాత్ర పోషించనుంది. ఒక్క మచిలీపట్నం పోర్టుతోనే కాకుండా కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కూడా అనుసంధానమవుతుంది.

పర్యాటకంగా ప్రాధాన్యం

అమరావతి రైల్వేలైన్‌ పర్యాటకంగా కూడా ప్రధానపాత్ర పోషించనుంది. పరిటాల ఆంజనేయస్వామి ఆలయంతో పాటు అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి, వెంకటేశ్వరస్వామి ఆలయాలు, ఇతర సందర్శనీయ ప్రాంతాలకు పెద్దసంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - Oct 25 , 2024 | 01:02 AM