Share News

దారులన్నీ బొప్పూడి వైపే!

ABN , Publish Date - Mar 18 , 2024 | 01:12 AM

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ప్రజాగళం సభ ఎన్నికల ఉత్సాహాన్ని నింపింది. ఆదివారం మధ్యాహ్నం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద జరిగిన ఈ సభకు ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల నుంచి పెద్దఎత్తున మూడు పార్టీల శ్రేణులు తరలివెళ్లాయి.

దారులన్నీ బొప్పూడి వైపే!

భారీగా తరలిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు

కూటమిలో ఎన్నికల జోష్‌ నింపిన ప్రజాగళం

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ప్రజాగళం సభ ఎన్నికల ఉత్సాహాన్ని నింపింది. ఆదివారం మధ్యాహ్నం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద జరిగిన ఈ సభకు ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల నుంచి పెద్దఎత్తున మూడు పార్టీల శ్రేణులు తరలివెళ్లాయి. విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న కేశినేని చిన్ని ఆధ్వర్యంలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేశారు. కేశినేని చిన్ని స్వయంగా మైలవరం నియోజకవర్గ నేతలతో కలిసి ఇబ్రహీంపట్నం వద్ద ప్రజాగళం సభకు ఆటోలు, కార్లు, బస్సుల్లో బయలుదేరిన శ్రేణులను జెండా ఊపి ఉత్సాహపరిచారు. ఆయనతోపాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి ప్రముఖ న్యాయవాది, సీనియర్‌ టీడీపీ నాయకుడు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున జనసమీకరణ చేశారు. సుమారు 20 బస్సులు, 100 కార్లలో నియోజకవర్గం నుంచి మూడు పార్టీల శ్రేణులు ప్రజాగళం సభకు తరలివెళ్లాయి. వీరిని గొట్టిపాటి రామకృష్ణ జెండా ఊపి సాగనంపారు. గుడివాడ నుంచి 50 బస్సులు, 150 కార్లలో ప్రజాగళం సభకు భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలి వెళ్లారు. గుడివాడ టీడీపీ కార్యాలయం వద్ద మూడు పార్టీల నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ర్యాలీని ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో పెద్దఎత్తున మూడు పార్టీల కార్యకర్తలు ప్రజాగళానికి తరలివెళ్లారు. విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు నియోజకవర్గంతోపాటు మచిలీపట్నం, పెడన, తదితర నియోజకవర్గాల నుంచి కూడా పెద్దఎత్తున తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ అభిమానులు ప్రజాగళానికి తరలివెళ్లారు.

Updated Date - Mar 18 , 2024 | 01:12 AM