Share News

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:50 AM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారిణి సాకా నాగమణెమ్మ హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
దుకాణంలో రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారిణి నాగమణెమ్మ

కంచికచర్ల, జూన్‌ 7: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారిణి సాకా నాగమణెమ్మ హెచ్చరించారు. ఒక రకం పత్తి విత్తనాలు ఎంఆర్‌పీకి మించి అమ్ముతున్నారని ఫిర్యాదులు రావటంతో శుక్రవారం ఆమె విత్తన దుకాణాలను, గిడ్డంగులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీరులపాడు మండలం జుజ్జూరులో ఒక దుకాణంలో విత్తనాలను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని రైతులకు సూచించారు. తనిఖీల్లో సహాయ వ్యవసాయ సంచాలకులు ఏఎన్‌వీ అనితా భాను, డాక్టర్‌ ఐ.కె.శ్రీనివాస్‌, వీరులపాడు ఏవో బి. జోగేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

మొక్కజొన్న విత్తనాల కొరత...

రైతులకు కావల్సిన ఒక కంపెనీ మొక్కజొన్న విత్తనాలకు కొరత ఏర్పడింది. ఎక్కువ ధర తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. విత్తనాలు చల్లేందుకు రైతులు పంట భూములను సిద్ధం చేశారు. ఈ ఏడాది పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గుతుందని, ఆమేరకు మొక్కజొన్న విస్తీర్ణం బాగా పెరుగుతుందంటు న్నారు. వాతావరణం చల్లబడటం, ఈ వారంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ అధికారులు చెపుతుండటంతో రెండు రోజుల నుంచి రైతులు మొక్కజొన్న విత్తనాలు చల్లుతున్నారు. ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోల విత్తనాలు చల్లుతున్నారు. నాలుగు కిలోల సంచిని రెండు రోజుల క్రితం వరకు రూ.16 వందలకు విక్రయించారు. మార్కెట్లో గిరాకీ పెరగటంతో కొందరు డీలర్లు రూ. 18 వందలు తీసుకుంటున్నారు. కంపెనీ కూడా ఇండెంట్‌ ప్రకారం కాకుండ డీలర్లకు అరకొరగా విత్తనాలు పంపిస్తున్నదన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆ కంపెనీ విత్తనాలు దొరకటం లేదు. దీంతో కొందరు డీలర్లు, రైతుల నుంచి ముందుగానే డబ్బు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jun 08 , 2024 | 12:50 AM