Share News

భజనచంద్రపై వేటు

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:50 AM

ఒక ప్రభుత్వ అధికారై ఉండి.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా అధికార పార్టీకి వీరభజన చేస్తున్న ఎన్టీఆర్‌ జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) జయచంద్ర గాంధీపై వేటు పడింది. ఎన్నికల కోడ్‌ నిబంధనలను ఉల్లంఘించి అధికార పార్టీకి ప్రచారం చేస్తున్న జయచంద్ర గాంధీని డీపీవోగా బాధ్యతల నుంచి తప్పించాలని జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు నిర్ణయించారు.

భజనచంద్రపై వేటు

ఇన్‌చార్జి డీపీవోగా యాదవ్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఒక ప్రభుత్వ అధికారై ఉండి.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా అధికార పార్టీకి వీరభజన చేస్తున్న ఎన్టీఆర్‌ జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) జయచంద్ర గాంధీపై వేటు పడింది. ఎన్నికల కోడ్‌ నిబంధనలను ఉల్లంఘించి అధికార పార్టీకి ప్రచారం చేస్తున్న జయచంద్ర గాంధీని డీపీవోగా బాధ్యతల నుంచి తప్పించాలని జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు నిర్ణయించారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జి డీపీవోగా డ్వామా ఏపీడీ యాదవ్‌ను నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చేందుకు డీఆర్‌వోకు కలెక్టర్‌ దిల్లీరావు శుక్రవారం నోట్‌ఫైల్‌ పంపారు. డీఆర్‌వో నుంచి తదుపరి ప్రక్రియ పూర్తి కాగానే, డీపీవో జయచంద్ర గాంధీకి ఆదేశాలు అందుతాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా, డీపీవో జయచంద్ర గాంధీ తన ప్రవర్తన మార్చుకోకపోవటంతో ఎంసీసీ ఉల్లంఘనల కింద కలెక్టర్‌ దిల్లీరావు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

వైసీపీకి వీరవిధేయుడిగా.

జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా బాధ్యతలు స్వీకరించింది మొదలు జయచంద్ర గాంధీ అధికార పార్టీకి తన స్వామిభక్తిని చాటారు. జిల్లాకు డీపీవోగా రావటానికి కారణమైన జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు రుణపడి ఉంటానని ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీల గ్రూపులలో పోస్టులు చేయటం కలకలం సృష్టించింది. ఆ తర్వాత పలు వాట్సాప్‌ గ్రూపుల్లో అధికార పార్టీకి అనుకూల ప్రచారం చేశారు. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలపై, ఆయా పార్టీల అధినేతలపై బురదజల్లేలా పోస్టులు కూడా చేస్తూ వస్తున్నారు. కోడ్‌ అమల్లో ఉన్నా అధికార పార్టీ స్వామిభక్తిని చూపిస్తూ వస్తున్నారు. వాట్సాప్‌ డీపీలలో ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మలను పెట్టుకుంటున్నారు. డీపీవో జయచంద్ర గాంధీ వ్యవహారాలు జిల్లా యంత్రాంగానికి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో కూడా కలెక్టర్‌ దిల్లీరావు డీపీవో పోస్టులపై సున్నితంగా తలంటారు. అయినా కలెక్టర్‌ ఆదేశాలను కూడా ఆయన బేఖాతరు చేస్తూ రాజకీయ పలుకుబడిని ప్రదర్శిస్తున్నారు. తన పద్ధతి మాత్రం మార్చుకోవటం లేదు. తనకున్న అధికార పార్టీ మద్దతుతో రానురానూ జిల్లా యంత్రాంగాన్ని కూడా ఖాతరు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహ రిస్తున్న దిల్లీరావు వెంటనే అతనిని విధుల నుంచి తప్పించాలని నిర్ణయించి నోట్‌ఫైల్‌ పంపారు.

Updated Date - Apr 06 , 2024 | 12:50 AM