Share News

ఏసీబీలో అంతర్గత విచారణ

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:54 AM

ఏసీబీ అధికారులు వేసిన ట్రాప్‌ మిస్‌ అయ్యిందంటే దాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తారు. అధికారులు పక్కాగా వేసిన స్కెచ్‌ ట్రాక్‌ తప్పిందంటే ఎక్కడో సమాచారం లీక్‌ అయినట్టే.

ఏసీబీలో అంతర్గత విచారణ

ఐదుగురు అధికారులపై వేటుకు అదే కారణమా..

కొద్దిరోజుల క్రితమే పోలీసు శాఖకు సరెండర్‌

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఏసీబీ అధికారులు వేసిన ట్రాప్‌ మిస్‌ అయ్యిందంటే దాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తారు. అధికారులు పక్కాగా వేసిన స్కెచ్‌ ట్రాక్‌ తప్పిందంటే ఎక్కడో సమాచారం లీక్‌ అయినట్టే. ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ లాలా బాలనాగ ధర్మసింగ్‌ వ్యవహారంలో ఇదే జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మసింగ్‌ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ సీఐయూ అధికారులు సోదాలు చేసి మూడు నెలలు దాటింది. దాడుల రోజున అజ్ఞాతంలోకి వెళ్లిన సింగ్‌ ఇప్పటి వరకు ఏసీబీకి చిక్కలేదు. అతడు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఏసీబీ జిల్లా అధికారులు కొంతమంది ధర్మసింగ్‌ విషయంలో సానుకూల ధోరణితో వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒకపక్క ఆయనపై ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వరుస ఫిర్యాదులు వెళ్తే జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికలు గోడ మీద పిల్లి వాటంలా ఉన్నాయని తెలుస్తోంది.

ఏం జరిగింది?

ఏదైనా ఒక అధికారిపై ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదులు అందినప్పుడు వాటిని సంబంధిత జిల్లా యూనిట్‌ అధికారులకు పంపుతారు. అధికారుల బృందం ఆ అధికారి పనిచేస్తున్న కార్యాలయంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తుంది. ఆయనకు ఎవరెవరు కలెక్షన్‌ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు.. పనులపై వచ్చే వారి నుంచి కలెక్షన్లు ఎలా చేస్తున్నారు.. వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. అనంతరం ఒక నివేదికను రూపొందించి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పంపాలి. ఆ తర్వాత ఎప్పుడు, ఏ సమయంలో ట్రాప్‌కు వెళ్లాలో అధికారులు నిర్ణయిస్తారు. జిల్లా ఏసీబీ యూనిట్‌లో డీఎస్పీలు శరత్‌, శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్లు కృపానందం, శివకుమార్‌, కానిస్టేబుల్‌ సురేష్‌ సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్‌ ధర్మసింగ్‌పై ప్రధాన కార్యాలయానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. అక్కడి నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసిన ఈ అధికారులు రూపొందించిన నివేదిక లోపభూయిష్టంగా ఉన్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. ధర్మసింగ్‌ వసూళ్లకు సంబంధించి ఆధారాల సహా ఫిర్యాదులు వెళ్లాయి. జిల్లా యూనిట్‌ అధికారులు ఇచ్చిన నివేదికను చాలా తటస్థంగా రూపొందించినట్టు తెలిసింది. జిల్లా నుంచి వెళ్లిన ప్రతి నివేదిక ఈ మాదిరిగానే ఉండటంతో సీఐయూ అధికారులకు అనుమానాలు వచ్చాయి. నేరుగా ఆ విభాగానికి చెందిన బృందాలే రంగంలోకి దిగాయి. అప్పటి వరకు ఇంట్లో ఉన్న ధర్మసింగ్‌ వెనుక వైపు నుంచి పారిపోయాడు. దీంతో జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. కొద్దిరోజుల క్రితమే ఈ ఐదుగురిని ఏసీబీ నుంచి పోలీసు శాఖకు సరెండర్‌ చేశారు. ఈ అధికారులు నాడు పంపిన నివేదికలను దగ్గర పెట్టుకుని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులు అంతర్గతంగా విచారణ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ బదిలీలు జరిగాయని అధికారులు బయటకు చెబుతున్నారు. అసలు విషయం బయటకు వస్తే ఏసీబీపై చెడుముద్ర పడుతుందని విచారణ అంశాన్ని బయటకు పొక్కనీయడం లేదని తెలుస్తోంది.

Updated Date - Mar 12 , 2024 | 12:54 AM