Share News

అట్టహాసంగా కూటమి అభ్యర్థుల నామినేషన్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:11 AM

బందరు నగరం జన సంద్రాన్ని తలపించింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమానికి పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర బుధవారం తమ నామినేషన్‌లను దాఖలు చేశారు.

అట్టహాసంగా కూటమి అభ్యర్థుల నామినేషన్లు
ర్యాలీలో వల్లభనేని బాలశౌరి, కొల్లురవీంద్రలను కూరగాయల భారీ గజమాలతో సత్కరిస్తున్న అభిమానులు

మచిలీపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : బందరు నగరం జన సంద్రాన్ని తలపించింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమానికి పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర బుధవారం తమ నామినేషన్‌లను దాఖలు చేశారు. ముందుగా సుల్తానగరం అభయాంజనేయస్వామి ఆలయంలో ఇరువురూ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 10.30 గంటలకు నుంచి ర్యాలీగా బయలుదేరారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, జనసేన నేత బండిరామకృష్ణ పెడన టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌, అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌, రావి వెంకటేశ్వరరావు, బూరగడ్డ వేదవ్యా్‌సలు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ మూడు స్తంభాలసెంటరు, కోనేరుసెంటరు, రేవతీసెంటరు, బస్టాండ్‌, లక్ష్మీటాకీస్‌ సెంటర్‌మీదుగా కలెక్టరేట్‌ వరకు సాగింది. తొలుత కొల్లు రవీంద్ర గృహంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

జనంతో పోటెత్తిన వీధులు..

వల్లభనేనిబాలశౌరి, కొల్లురవీంద్ర నామినేషన్ల కార్యక్రమానికి పెద్దఎత్తున మహిళలు, కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో బందరు వీధులన్నీ జనంతో నిండిపోయాయి. కార్యకర్తల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. డప్పు కళాకారుల విన్యాసాలు, యువత కేరింతల నడుమ ర్యాలీ ఆద్యంతం ఉత్సాహవాతావరణంలో సాగింది. మూడుస్థంబాలసెంటరులో క్రేన్‌ద్వారా పార్టీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. ఆంజనేయస్వామి ఆలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీనాలుగు గంటల సమయం పట్టగా.. దారిపొడవునా మహిళలు హరతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అభిమానులకు శీతల పానీయాలు, మజ్జిగ ప్యాకెట్లు భోజన వసతిని కల్పించారు. ఉదయం 11 గంటలకు కొల్లు రవీంద్ర తరఫున నామినేషన్‌ పత్రాలను ఆయన భార్య నీలిమ ఒక్కోసెట్‌, వల్లభనేని బాలశౌరి రెండుసెట్‌ల నామినేషన్‌లను కలెక్టర్‌ డీకే బాలాజీకి అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు.

యార్లగడ్డ నామినేషన్‌..

రామవరప్పాడు నుంచి గన్నవరం వరకు భారీ ప్రదర్శన

గన్నవరం : బీజేపీ, జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గన్నవరంలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఆర్వో, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మకు బుధవారం తన రెండో సెట్‌ నామినేషన్‌ పత్రాలను అందజేశారు. తొలుత అట్టహాసంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి నాలుగు మండలాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. విజయవాడ గాయత్రినగర్‌లోని తన నివాసంలో ప్రత్యేక పూజల అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రూరల్‌ మండలం రామవరప్పాడు రింగ్‌ నుంచి గన్నవరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ-కోల్‌కతా జాతీయ రహదారిపై రెండు వైపులా భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. రామవరప్పాడు నుంచి గన్నవరం వరకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. యార్లగడ్డకు అడుగడుగునా ప్రజలు భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికారు.

హైవేపై స్తంభించిన ట్రాఫిక్‌

టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్‌ ర్యాలీలో పోలీసులు అతిగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. రామవరప్పాడు నుంచి గన్నవరం వరకు జాతీయ రహదారిపై వెంకట్రావు ఎడమవైపున ర్యాలీ నిర్వహించగా, గన్నవరం-విజయవాడ మార్గంలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలుపుదల చేయడం విమర్శలకు తావిస్తోంది. పోలీసుల అతి కారణంగా జాతీయ రహదారిపై అంబులెన్స్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. మరోవైపు విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న భారీ వాహనాలను ముందస్తు సమాచారం లేకుండానే పోలీసులు చిన ఆవుటపల్లి వద్ద నుంచి వెనక్కి మళ్లించి తిరిగి హనుమాన్‌జంక్షన్‌ వైపు పంపించారు. దీంతో వాహనాదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. యార్లగడ్డ నామినేషన్‌ ర్యాలీకి జనం తరలిరావడంతో పోలీసులు తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లేమార్గాన్ని బారికేడ్‌లతో మూసేశారు. దీనికితోడు జాతీయ రహదారిపై గాంధీ బొమ్మ సెంటర్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ముళ్ల కంచెను ఏర్పాటు చేయడం గమనార్హం..

ప్రజలు క్షమించాలి.. : ట్రాఫిక్‌ ఇబ్బందులపై యార్లగడ్డ

విజయవాడ-గన్నవరం మార్గంలో బుధవారం ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నా.. అని యార్లగడ్డ వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. తన నామినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయరహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయి మండుటెండలో ప్రజల ఇబ్బంది తెలుసుకుని బాధపడ్డానని, అనివార్యంగా తలెత్తిన ఈ పరిస్థితికి చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మున్ముందు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

పోలీసు ఆంక్షల మధ్య

వర్లకుమార్‌రాజా నామినేషన్‌

పామర్రు : ఎస్సీ రిజర్వుడు పామర్రు అసెంబ్లీ స్థానానికి ఎన్టీయే బలపరచిన టీడీపీ అభ్యర్థిగా వర్ల కుమార్‌రాజా బుధవారం నామినేషన్‌ వేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.శ్రీదేవికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా తరలిరాగా.. కూమార్‌రాజా సతీమణి విశ్రమ కుటుంబసభ్యులతో ఇంటి నుంచి బయలుదేరి యేసు మందిరంలో ప్రార్థనలు చేసి అనంతరం పెద్దల ఆశీస్సులు తీసుకుని అంకమ్మతల్లి దేవస్థానం సమీపంలోకి చేరుకోగా పోలీసులు అంక్షలు విధించడంతో బస్టాండ్‌ వెనుక నుంచి కోటిరెడ్డిపేటమీదగా నాలుగురోడ్ల కూడలికి వచ్చారు. అక్కడ పోలిసులు అడ్డగించడంతో కుమార్‌రాజా, జనసేన ఇన్‌చార్జి తాడిశెట్టి నరేష్‌, టీడీపీ రైతు ప్రధాన కార్యదర్శి వల్లూరిపల్లి గణే్‌షలతో నడుచుకుంటూ తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని గోట్టిపాటి రామకృష్ణతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సామాన్య కుటుంబనుంచి వచ్చిన తనకు టిక్కెట్‌ ఇచ్చిన చంద్రబాబుకు విజయం బహూమతిగా ఇస్తానన్నారు. అఖండ మెజారిటీతో గెలుపొంది ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా డీవై దాస్‌ నామినేషన్‌

పామర్రు నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డీవై దాసు బుధవారం నామినేషన్‌ పత్రాన్ని ఆర్వో శ్రీదేవికి అందజేశారు. తొలుత ఆయన ఇంటి నుంచి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలతో నేతలతోకలిసి ర్యాలీగా తరలివచ్చారు. జై భీమ్‌రావ్‌ భారత్‌పార్టీ అభ్యర్థిగా కొడాలి సునీల, వైసీపీ నుంచి కైలే జ్జానమణి రెండోసెట్‌ నామినేషన్లు అంద జేసినట్టు ఆర్వో తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 01:11 AM