Share News

ఒక్కసారిగా గాలివాన

ABN , Publish Date - May 08 , 2024 | 12:56 AM

వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం ఉదయం నుంచి మబ్బులతో కూడిన వాతావరణం కనిపించగా, మధ్యాహ్నం నుంచి మాత్రం కొద్దిసేపు ఎండ, సాయంత్రం 4 గంటల తర్వాత ఈదురుగాలులు, వర్షం కురిశాయి.

ఒక్కసారిగా గాలివాన

రెండు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం

నగరంలో చిన్నపాటి జల్లులు, ఈదురుగాలులు

మచిలీపట్నం సహా ప్రధాన పట్టణాల్లో భారీగా..

మామిడి పంటకు తీవ్ర నష్టం

9, 10, 11 తేదీల్లో కూడా.. : వాతావరణ శాఖ

విజయవాడ/మచిలీపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి) : వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం ఉదయం నుంచి మబ్బులతో కూడిన వాతావరణం కనిపించగా, మధ్యాహ్నం నుంచి మాత్రం కొద్దిసేపు ఎండ, సాయంత్రం 4 గంటల తర్వాత ఈదురుగాలులు, వర్షం కురిశాయి. ఉరుములు, మెరుపులతో పాటు సుడిగుండాలూ కనిపించాయి. విజయవాడలో చిన్నపాటి జల్లులే కురవగా, నందిగామ, తిరువూరులో భారీ వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మచిలీపట్నం, గుడివాడ, పామర్రు, పెడన ప్రాంతాల్లో రెండు సెంటీమీటర్ల కన్నా అధికంగా వర్షం కురిసింది. అవనిగడ్డ, చల్లపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులకు తోడు మోస్తరు వర్షం కురిసింది. మచిలీపట్నంలో భారీగా కురవటంతో రహదారులపై నీరు నిలిచిపోయింది. ఈదురుగాలుల ప్రభావంతో అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లోని మామిడి చెట్లకు కాయలు రాలిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాగా, థండర్‌ స్ట్రాం యాక్టివిటీలో భాగంగానే వాతావరణం ఇలా చల్లబడిందని నిపుణులు తెలిపారు. ఈ వర్షాలను మ్యాంగోషవర్స్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ పరిస్థితి మరో రెండు, మూడు రోజులు ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని అంటున్నారు.

11వ తేదీ వరకూ వర్షాలు

ఈనెల 11వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. కోస్తాతీరం వెంబడి బుధవారం భారీవర్షాలు కురుస్తాయని, ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఒకమోస్తరుగా కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

Updated Date - May 08 , 2024 | 12:56 AM