కదిలిన యంత్రాంగం
ABN , Publish Date - Oct 27 , 2024 | 01:06 AM
అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఇసుక దందాపై ఆంధ్రజ్యోతిలో శనివారం ప్రచురితమైన ‘ఉచితం మాటున అనుచితం‘ కథనానికి అధి కార యంత్రాంగం కదిలింది.
ఉచితం మాటున అనుచితం కథనానికి స్పందన
మూడు టాస్క్‌ఫోర్స్ టీమ్‌ల ఏర్పాటు
మునేరు, కృష్ణా రీచ్‌లలో డ్రోన్లతో తనిఖీలు
(ఆంధ్రజ్యోతి-నందిగామ, కంచికచర్ల, పెనుగంచిప్రోలు)
అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఇసుక దందాపై ఆంధ్రజ్యోతిలో శనివారం ప్రచురితమైన ‘ఉచితం మాటున అనుచితం‘ కథనానికి అధి కార యంత్రాంగం కదిలింది. కృష్ణా, మునేరు నదుల నుంచి నిత్యం వంద లారీలకు పైగా ఇసుకను టీడీపీ నాయకులు తరలిస్తున్నారని, రెవెన్యూ, పోలీస్ అధికారులపై అధికార దర్పం ప్రదర్శిస్తూ అనధికార రవాణా చేస్తు న్నారని ఆధారాలతో ప్రచురించడంతో సీపీ ఎస్వీ రాజశేఖరబాబు విజయ వాడలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మూడు టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు ఏర్పాటుచేశారు. నందిగామ, కంచికచర్ల, పెనుగంచిప్రోలు మండలాల్లోని మునేరు, కృష్ణా నదులపై డ్రోన్ల సహకారంతో తనిఖీలు చేశారు. ఇసుక తవ్వకాలు జరిపిన ఆనవాళ్లున ప్రాంతాలు, డంప్‌లను గాలించారు.
డ్రోన్ల విహారంతో అక్రమార్కుల్లో కలవరం
ఇసుక రీచ్‌ల వద్ద శనివారం డ్రోన్ల ఆకస్మిక విహారం కలకలరం రేపిం ది. టాస్క్‌ఫోర్స్ సీఐ ఎంవీఎస్‌ఎస్‌ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఎనిమిది మంది సభ్యుల బృందం మునేటిపై నందిగామ, కంచల, పెండ్యాల, వేము లపల్లి, కృష్ణానదిపై మోగులూరు, మున్నలూరు గ్రామాల్లో డ్రోన్‌తో తని ఖీలు చేశారు. ఎస్‌బీ సీఐ సతీష్ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ బృందం పెను గంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు గ్రామాల్లో తనిఖీలు చేశారు. టాస్క్‌ఫోర్స్ సీఐ రమణ ఆధ్వర్యంలోని మరో బృందం లింగాల వద్ద మునేటి పరివాహక ప్రాంతంతో పాటు కృష్ణానదిపై ముక్య్తాల తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఒక్కసారిగా డ్రోన్లు, పోలీ సుల హడావుడితో అక్రమార్కుల్లో కలవరం మొదలైంది. అప్రమత్తమైన అక్రమార్కులు తమ అనుయాయులను డ్రోన్ సర్వే జరుగుతున్న ప్రాం తాలకు పంపి, అక్కడి సమాచారం తమ వద్దకు తెప్పించుకున్నారని తెలిసింది.
దందా తీరిది..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి నందిగామ, జగ్గయ్య పేట నియోజకవర్గాల టీడీపీ నాయకులు అనధికార మైనింగ్‌కు తెరలే పారు. మునేరు, కృష్ణానదులతో పాటు గత ప్రభుత్వ హయాంలోని డంప్‌లను కూడా దోచేశారు. కీసర, మోగలూరు డంప్‌ల నుంచి కోట్లాది రూపాయల విలువైన ఇసుకను దోచారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం దోపిడీ జరిగినట్లు నిర్ధారించి కొద్దిరోజుల క్రితం ఆరెండు డంప్‌లను సీజ్ చేశారు. అయినా అధికారం చేతుల్లో ఉండగా అధికారులు తమనేమి చేస్తారని షాడో నేత దోపిడీని కొనసాగించారు. రాత్రివేళల్లో నిత్యం వం దలాది లారీల ద్వారా ఇసుకను తరలించారు. సీజ్ చేసిన ఇసుకను కూడా ఊడ్చేశారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా స్పందించలేని స్థితి లో అధికారులు ఉండిపోయారు. షాడో ఎమ్మెల్యేకు ఎదురు చెప్పే ధైర్యం లేక చేష్టలుడిగి చూస్తుండిపోయారు.
సీఎం హెచ్చరించినా ఆగలేదు
ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఎమ్మె ల్యేలతో నిర్వహించిన సమీక్షలో ఇసుక దందాలు సహించబోనని ఎమ్మె ల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. సీఎం హెచ్చరించినా కంచికచర్ల మండ లంలో ఒక్క రోజు కూడా ఇసుక అనధికార రవాణా ఆగలేదు. పెండ్యాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికలనే లెక్కచేయని అక్రమార్కులు టాస్క్‌ఫోర్స్‌లను, డ్రోన్లను లెక్క చేస్తారా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
200 లారీల లోడింగ్‌కు సన్నాహాలు
శుక్రవారం రాత్రి రెండు వందల లారీలకు ఎస్కవేటర్ల సాయంతో ఇసుకను లోడింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కో లారీకి సైజు మేరకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ధర నిర్ణయిం చారు. ఇసుక లోడింగ్ జరుగుతున్న సమయంలో కంచికచర్ల స్టేషన్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లారు. వారు అక్కడ ఉండ గానే ముప్పై వాహనాలకు లోడింగ్ చేసి బయటకు పంపినట్లు తెలి సింది. అక్రమార్కులు అధికార పార్టీ నాయకులు కావడంతో పోలీసులు మిన్నకుండి పోవాల్సి వచ్చింది. ఈతరుణంలో విజయవాడ నుంచి టాస్క్ ఫోర్స్ టీమ్‌లు బయలుదేరినట్లు సమాచారం రావడంతో అక్కడి నుంచి జారుకున్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలోనూ..
శనగపాడు, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, ముక్య్తాల రీచ్‌ల నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. తెలంగాణ సరిహద్దున ఉన్న అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు గ్రామాల నుంచి మధిర, ఖమ్మం ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. పెద్దల కనుసన్నలలో జరిగే ఈ ఇసుక దందాను టాస్క్‌ఫోర్స్ ఏమేరకు కట్టడి చేయగలదో వేచిచూడాలి.