Share News

వసతుల్లేని బస్టాండ్‌

ABN , Publish Date - Aug 11 , 2024 | 01:24 AM

గుడివాడ బస్టాండ్‌లో వసతులు లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గత పాలకులు చేసిన తప్పదాలు ప్రయాణికుల పాలిట శాపాలుగా మారాయి. ఆర్టీసీ బస్టాండ్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని మాజీ మంత్రి నాని బీరాలు పలికి తుస్సుమనిపించారు. గ్యారేజీ వరకు నిర్మాణం చేపట్టి, బస్టాండ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం వేసి మరిచారు. ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది.

వసతుల్లేని బస్టాండ్‌

గుడివాడ బస్టాండ్‌ ఆవరణలో వర్షపు నీరు నిల్వ

సమయానికి బస్సులుండవు

బస్‌ పాస్‌ కౌంటర్‌ ఎప్పుడూ మూసివేతలోనే..

గుడివాడ బస్టాండ్‌లో వసతులు లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గత పాలకులు చేసిన తప్పదాలు ప్రయాణికుల పాలిట శాపాలుగా మారాయి. ఆర్టీసీ బస్టాండ్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని మాజీ మంత్రి నాని బీరాలు పలికి తుస్సుమనిపించారు. గ్యారేజీ వరకు నిర్మాణం చేపట్టి, బస్టాండ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం వేసి మరిచారు. ఆర్టీసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది.

గుడివాడ : గుడివాడ డిపో గ్యారేజీని పూర్తి చేసి గత పాలకులు ప్రారంభించారు. బస్టాండును నూరు శాతం అభివృద్ధి చేసేసినట్టు మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు బిల్డప్‌ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అవగతమవుతుంది.

విజయవాడలో గుడివాడ బస్సుల కరువు

రోజుకు 20 పల్లె వెలుగు, 16 నాన్‌స్టాప్‌ బస్సులు విజయవాడకు తిరుగుతున్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవంగా అవి సరిపోవడం లేదు. సరిపడా బస్సులు నడపడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. ప్రతిరోజూ వివిధ పనుల నిమిత్తం గుడివాడ నుంచి విజయవాడకు సుమారు 7000 మంది ప్రయాణిస్తారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు తిరుగు ప్రయాణంలో నరకాన్ని చూస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 7 గంటలకు విజయవాడ నుంచి గుడివాడ వచ్చే బస్సులు నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బెంజ్‌ సర్కిల్‌, ఆటోనగర్‌ల వద్ద నిలబడి బస్సుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గత్యంతరం లేక ఆటోలు, ట్యాక్సీలను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. గంటల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. బస్సులు లేవంటూ ఎవరైన గుడివాడ డిపోకు ఫోన్‌ చేస్తే సమాధానం సరిగ్గా రాదు. పాసులున్న విద్యార్థులు ఉద్యోగస్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది.

చిన్నపాటి వర్షంతో మునక

దశాబ్దాలుగా ఉన్న బస్టాండ్‌ మునక సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ అధికారులు విపలమయ్యారు. డిపో గ్యారేజీని ఏడు అడుగుల మేర మెరక చేశామని ఆర్టీసీ అధికారుల తెలుపుతున్నారు. గ్యారేజీలో అంతర్గత డ్రైనేజీలను నిర్మించడం మరిచారు. దీంతో గ్యారేజీలో ఉన్న బస్సులను కడిగిన నీరూ, ఇతర అవసరాలకు వాడే నీరూ బస్టాండ్‌లోకి చేరుతోంది

ప్రయాణికుల ఇక్కట్లు తీరనివి

బస్టాండ్‌లో నూజివీడు, ఏలూరు వైపు వెళ్లే ప్లాట్‌పారంలు అవుట్‌గేట్‌కు దగ్గరలోనే ఉండగా, మరోవైపు ఉన్న విజయవాడ, భీమవరం, మచిలీపట్నం వైపు వెళ్లే ప్లాట్‌ఫారంలకు మురుగు నీటిలో వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మోకాల్లోతు నీటిలో నిలబడి బస్సుల కోసం వేచి చూస్తున్నారు. వర్షాకాలం వస్తే ప్రయాణికులు బస్టాండ్‌ అంటేనే భయపడిపోతున్నారు.

తెరుచుకోని బస్‌పాస్‌ కౌంటర్‌

బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బస్‌పాస్‌ కౌంటర్‌ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియని పరిస్థితి. ప్రైవేట్‌ సంస్థలకు బస్‌పాసుల జారీ అనుమతినిచ్చారు. దీంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఫోన్‌ చేస్తేనే వచ్చి పాసులను జారీ చేస్తున్నారు.

ఎప్పటికి పనులు ప్రారంభిస్తారో

రూ.9.85 కోట్లతో డిపో గ్యారేజీని నిర్మించారు. కానీ అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను మరిచారు. దీనికోసం ఏడాదిన్నర పాటు సమయం పట్టింది. రూ.13 కోట్లతో రెండు ఫేజ్‌లలో బస్టాండ్‌ అభివృద్ధికి చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మొదటి ఫేజ్‌లో భాగంగా రూ.7 కోట్లతో టెండర్లు పలిచారు. వారం రోజుల్లో పనులను ప్రారంభిస్తామని చెప్పి ఏడాది గడిచింది. ఈ ఫేజ్‌లో చేపట్టే పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

ఎమ్మెల్యే వెనిగండ్ల దృష్టి సారించరూ..

బస్టాండ్‌లో వసతులు లేమి, అధికారుల నిర్లక్ష్య ధోరణి, సరిపడా బస్సులను నడపకపోవడం, విజయవాడ నుంచి మధ్యాహ్నం తరువాత బస్సు సర్వీసు లేకపో వడం, ఈ విషయమై ప్రశ్నిస్తే కనీసం సమాధానం చేప్పే వారే లేకపోవడం వంటి సమస్యలు గుడివాడ బస్టాండ్‌ను వేధిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మొదటి ఫేజ్‌లో బస్టాండ్‌ అభివృద్ధికి కేటాయించిన నిధులు ఉన్నాయా లేక మురిగిపోయాయా అనే అంశాన్ని పరిశీలించాలి. బస్టాండ్‌ అభివృద్ధికి ఎమ్మెల్యే వెనిగండ్ల దృష్టిసారించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 11 , 2024 | 01:24 AM