Share News

రూ.45 లక్షల విలువైన 390 సెల్‌ఫోన్లు స్వాధీనం

ABN , Publish Date - Aug 18 , 2024 | 01:07 AM

ఇటీవలకాలంలో చోరీ అయిన, పోగొట్టుకున్న రూ.45 లక్షల విలువైన 390 సెల్‌ఫోన్లను కృష్ణాజిల్లా సీసీఎస్‌ విభాగం పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ ఆర్‌.గంగాధర రావు తెలిపారు.

రూ.45 లక్షల విలువైన 390 సెల్‌ఫోన్లు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను మీడియాకు చూపుతున్న కృష్ణా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు, పోలీస్‌ అధికారులు

మచిలీపట్నం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఇటీవలకాలంలో చోరీ అయిన, పోగొట్టుకున్న రూ.45 లక్షల విలువైన 390 సెల్‌ఫోన్లను కృష్ణాజిల్లా సీసీఎస్‌ విభాగం పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ ఆర్‌.గంగాధర రావు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నం సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌ ద్వారా 92, గుడి వాడ సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌ ద్వారా 202, పెనమలూరు సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌ ద్వారా 96 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని యజమానుల వివరాలు సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. మచిలీపట్నం సీసీఎస్‌ డీఎస్పీ సుభాష్‌, సీఐలు రమణమ్మ, మోజెస్‌ సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవడంలో కృషి చేశారని, వారికి త్వరలో రివార్డులు అందజేస్తామని ఎస్పీ తెలిపారు. యజమానులకు ఎస్పీ పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను అందజేశారు. సెల్‌ఫోన్లు చోరీ అయితే 94906 17573నెంబరుకు హాయ్‌, లేదా హెల్ప్‌ అని సందేశం పంపితే పోలీస్‌శాఖనుంచి ఎంఎంటీ ఎస్‌ ద్వారా ఒక లింక్‌ వస్తుందన్నారు. ఈలింక్‌లో సెల్‌ఫోన్‌ వివరాలు పంపితే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రికవరీ చేస్తారని ఆయన తెలిపారు. ఎవరికైనా సెల్‌ఫోన్లు దొరికితే తాము చోరీ చేయలేదని వాటిని వాడినా నేరమే అవుతుందన్నారు. దొరికిన ఫోన్లను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలనిసూచించారు.

Updated Date - Aug 18 , 2024 | 01:07 AM