ఈ-ఏడాది
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:46 AM
2024 ఈ-ఏడాదిగా మారింది. సైబర్ నేరాలు ఈసారి టాప్‌గేర్‌లోకి వెళ్లాయి. సాధారణ నేరాల కంటే ఈ నేరాలే బాగా పెరిగాయి. గడిచిన ఏడాది కంటే ఈ ఏడాది 41 శాతం సైబర్ నేరాలు పెరిగాయి. ఆ తర్వాత స్థానంలో రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి. ఈ ఏడాది రోడ్డు ప్రమాద మరణాలు 20 శాతం పెరిగాయి. 2024 వార్షిక నేర గణాంకాలను బందరు రోడ్డులోని ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీలు గౌతమీషాలి, తిరుమలేశ్వరరెడ్డి, మహేశ్వరరాజు, ఏడీసీపీలు ప్రసన్నకుమార్, జి.రామకృష్ణ, ఎం.రాజారావు వెల్లడించారు. ఆ వివరాలు.. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

2024లో పెరిగిన సైబర్ నేరాలు
రూ.15 కోట్లు స్వాహా చేసిన నేరగాళ్లు
ఎన్నడూలేనట్టు 41 శాతం పెరుగుదల
రోడ్డు ప్రమాదాల్లో 20 శాతం పెంపు
కొట్లాట కేసులు కూడా ఎక్కువే..
వార్షిక గణాంకాలు విడుదల చేసిన సీపీ
2024 ఏడాదిని సైబర్ నేరాలు కమ్మేశాయి. 2023లో 3,329 సైబర్ నేరాలు జరిగితే, ఈ ఏడాది ఆ సంఖ్య 4,702కు చేరింది. గడిచిన ఏడాది కంటే ఈ ఏడాది సైబర్ నేరాలు 41 శాతం పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలో సైబర్ నేరగాళ్లు రూ.15 కోట్ల వరకు ప్రజల సొమ్మును కొల్లగొట్టారు. గత ఏడాది ఈ సొమ్ము రూ.10 కోట్లుగా ఉంది. డిజిటల్ అరెస్టు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వంటి నేరాల్లో ఈ డబ్బులు కాజేశారు. కేసుల నమోదులో గత ఏడాది కంటే ఈ ఏడాది 3.20 శాతం పెరుగుదల కనిపించింది. గత ఏడాది సైబర్ పోలీసులు 3,329 రశీదులు జారీ చేయగా, 63 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ఏడాది 4,702 రశీదులు జారీ చేయగా, వాటిలో 155 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన పెంచడంతో ఒక నెలలో 69 మందిని డిజిటల్ అరెస్టు కాకుండా కాపాడారు.
రోడ్డు ప్రమాదాల్లో ఈ ఏడాది 20 శాతం పెరుగుదల కనిపించింది. 2023లో మొత్తం 356 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 375 మంది ప్రాణాలు కోల్పోయి, 148 మంది క్షతగాత్రులయ్యారు. 2024లో 394 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 421 మంది ప్రాణాలు కోల్పోయి, 133 మంది గాయపడ్డారు.
ఎన్నికల ఏడాది కావడంతో తీవ్రమైన కొట్లాటల కేసులు నమోదయ్యాయి. గడిచిన ఏడాది ఈ కేసులు 25 జరగ్గా, ఈ ఏడాది ఆ సంఖ్య అదేవిధంగా ఉంది.
మహిళలు, అమ్మాయిలపై ఈ ఏడాది అత్యాచారాలు తగ్గాయి. గడిచిన ఏడాది 16 అత్యాచార కేసులు నమోదు కాగా, ఈసారి 14 కేసులు నమోదయ్యాయి.
ఈ ఏడాది 1,350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 267 మంది రవాణాదారులను అరెస్టు చేశారు.
116 మందిపై ఎన్‌డీపీఎస్ సస్పెక్ట్ షీట్లు తెరిచారు.
నగరంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా 635 కేసులను పోలీసులు ఛేదించారు.
వివిధ నేరాల్లో బాధితులు కోల్పోయిన సొత్తులో రూ.56,86,100 రికవరీ చేశారు.
‘కొత్త’గా పనిచేస్తాం : ఎస్వీ రాజశేఖరబాబు, పోలీసు కమిషనర్
ఈ ఏడాది విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించాం. ట్రాఫిక్ నియంత్రణకు అస్త్రం అనే ఏఐ సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తీసుకొచ్చాం. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ నిలుపుదల బాగా తగ్గింది. నగరంలో 112 కిలోమీటర్లు ఆగిపోయే ట్రాఫిక్‌ను 73 కిలోమీటర్లకు తగ్గించాం. ఐటీఎంఎస్ పనులు పూర్తికావచ్చాయి. కొత్త సంవత్సరంలో వీఎంఎస్ (వెరియబుల్ మెసేజింగ్ సిస్టం) బోర్డులను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వం 1,904 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇవికాకుండా మరో 121 సీసీ కెమెరాలు ఉన్నాయి. రాబోయే ఏడాదిలో 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించాం. జనవరిలో మొదటి దశలో 1,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ఫేసియల్ రికగ్నైజ్డ్ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రణాళికలు తయారు చేశాం. త్వరలో ప్రజల భాగస్వామ్యంతో నగర సురక్ష సమితిని ఏర్పాటుచేసే ఆలోచనలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో క్లౌడ్ పెట్రోలింగ్‌కు మరిన్ని మెరుగులు దిద్దుతాం. ఇప్పటికే మా వద్ద 27 డ్రోన్లు ఉన్నాయి. వాటిని ఎగరవేయడానికి మహిళా పోలీసులకు డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇచ్చాం.