ఇందిరానగర్‌లో వైసీపీ భూదందా
ABN , Publish Date - Jul 05 , 2024 | 10:59 PM
కడప కార్పొరేషన్‌లో విలీనమైన చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఇందిరానగర్‌లో వైసీపీ నేతల భూదందాకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. వైసీపీకి చెందిన కీలకనేతలు రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది పరస్ప ర సహకారంతో రూ. కోట్లల్లో దందా సాగించారు.

రూ. కోట్లల్లో ప్రభుత్వ స్థలాల అమ్మకాలు
పుట్టగొడుగుల్లా బోగ్‌సపట్టాలు
నేతలు, అధికారులు పరస్పర సహకారం
టీడీపీ పాలనలో బయటికి వస్తున్న బాగోతం
కడప(రూరల్) జూలై 5: కడప కార్పొరేషన్‌లో విలీనమైన చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఇందిరానగర్‌లో వైసీపీ నేతల భూదందాకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. వైసీపీకి చెందిన కీలకనేతలు రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది పరస్ప ర సహకారంతో రూ. కోట్లల్లో దందా సాగించారు. ఇందిరానగర్ సహా పరిసర ప్రాంతాల్లోని మామిళ్లపల్లె రెవెన్యూ పొలంలో వందల కోట్ల విలువైన ప్ర భుత్వ డీకేటీ, వివాదాస్పద భూములు మెండుగా ఉన్నాయి. సదరు స్థలాలను వైసీపీ నేతలు, అఽధికారులు పరస్పర సహకారంతో పథకం ప్రకారం బోగస్ పట్టాలను పుట్టించి అమ్మకాలు సాగించారు. ఒక్క ఇందిరానగర్‌లోనే వందకు పైగా ఇంటి స్థలాలను అమ్మినట్లు సమాచారం. ఇందిరానర్ ఎంట్రెన్స్‌లో ప్రభుత్వ అవసరాలకు ఉంచిన దాదాపు రూ. 3 కోట్లు విలువైన ఎకరా స్థలాన్ని కొందరు వైసీపీ నేతలు దక్కించుకుని వారి వాటా స్థలంలో ఒకటిముక్కాల్ సెంటు ప్లాట్ రూ. 3 నుంచి 4 లక్షలకు ఆశావహులకు అమ్మి సొమ్ముచేసుకున్నట్లు జోరు గా ప్రచారం సాగుతోంది. సదరు స్థలాలు వివాదాస్పదం కావడంతో గుట్టు రచ్చకెక్కింది.
ఫారెస్ట్ బఫర్ ల్యాండ్‌లో అక్రమకట్టడాలు
ఇందిరానగర్ యానాదుల కాలనీ, స్పోర్ట్స్ స్కూల్ మధ్య రింగ్‌రోడ్డుకు దాదాపు రెండెకరాల వరకు ఫారెస్టు బఫర్ ల్యాండ్ ఉంది. ఈ స్థలం రిమ్స్‌కు అతి సమీపంలో ఉండడంతో సెంటు స్థలం రూ. 2 లక్షల పైమాటగా ఉంది. ఇలా దాదాపు రూ. 4 కోట్ల విలువైన స్థలంలో వైసీపీ కీలకనేతలు, అధికారులు కలిసి అక్రమ కట్టడాలు వేయించారు. ఒక్కో అక్రమ కట్టడం నుంచి రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఒకవేళ వీరు డిమాండ్ చేసిన మొత్తంలో డబ్బు ఇవ్వకపోతే అక్రమ కట్టడం వేశావంటూ వీఆర్‌ఏను పంపించి సదరు నిర్మాణాలను కూల్చివేస్తుండేవా రు. దీంతో ఆశావహులు చేసేదిలేక డిమాండ్‌చేసిన మొత్తాన్ని చెల్లించక తప్పడంలేదు. ఈ తతంగం తరువాత వైసీపీ నేతలే కార్పొరేషన్ సిబ్బందిని రం గంలోకి దించి అక్రమ కట్టడాలకు ఇంటిపన్ను, కు ళాయి కనెక్షన్, కరెంట్ మీటర్లను ఏర్పాటు చేయిం చి మరో రూ. 50వేలను అదనంగా వసూలు చేసిన ట్లు సమాచారం. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వీరి లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
పుట్టగొడుగుల్లా బోగ్‌సపట్టాలు
ఇందిరానగర్‌లో బోగస్ ఇంటి పట్టాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొం దరు రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలతో కలిసి బోగస్ ఇంటిపట్టాల దందాను సాగిస్తున్నట్లు వినికిడి. వైసీపీ నేత మొదట తన ఆధీనంలోని ప్రభుత్వ డీకేటి స్థలాన్ని రేటు కుదుర్చుకుని ఆశావహునికి అమ్ముతాడు. ఆ తరువాత ఆశావహున్ని పలానా రెవెన్యూ అధికారి వద్దకు పొమ్మంటాడు. అక్కడికి వెళ్లగానే సదరు అధికారి తన కింద పనిచేసే సిబ్బందికి పనిని అప్పగిస్తాడు. వెనువెంటనే వైసీపీ నేత అమ్మిన డీకేటీ స్థలానికి ఎవరికీ అర్థం కాని అధికారుల సంతకాలు, రెవెన్యూ సీల్‌తో కూడిన ఇంటి పట్టా తీసుకొచ్చి ఆశావహునికి ఇస్తాడు. ఇం దుకు రూ. 30వేలను వసూలు చేస్తాడు. సమస్య వచ్చినప్పుడు సదరు ఇంటిపట్టాను పరిశీలిస్తే రెవె న్యూ రికార్డులతో సంబంధం ఉండదు. అనధికారికంగా బోగస్ పట్టాగా తేటతెల్లం అవుతుంది. ఇలాంటి బోగస్ పట్టాలు ఇందిరానర్‌లో కుప్పలు తెప్పలుగా ఆశావహుల చేతుల్లో ఉన్నాయి. ప్రస్తు తం టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆశావహులకు అడ్డదారుల్లో కట్టబెట్టిన ఇంటి స్థలాలకు ముప్పుఏర్పడింది. దీంతో వైసీపీ నేతలు, అధికారులు తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు.
టీడీపీ నేతలకు గాలం
వైసీపీ పాలనలో కొందరు రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలతో అంటకాగి ఇష్టానుసారంగా రెవె న్యూ రికార్డులతో సంబంధం లేకుండా ప్రభుత్వ స్థలాలను, భూములను ఇష్టం వచ్చినట్లు ధారాదత్తం చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటి చిట్టాను బయటికి తీస్తున్నారు. దీంతో బాధ్యులైన అధికారులు తమ బాగోతం ఎక్కడ భయటపడుతుందోనని గాబరాపడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. టీడీపీ నేతలకు లేనిపోని ఆశలు, భ్రమలు కల్పిస్తున్నారు. దీంతో కొందరు టీడీపీ నేతలు వారి మాయలో పడి వారిని కాపాడే పనిలో పడ్డారు. సదరు రెవెన్యూ అధికారులను ఆయా ఎమ్మెల్యేలు, నేతల వద్దకు తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు. దీంతో ఐదేళ్లపాటు వైసీపీతో అంటకాగి ఊడిగం చేసిన సదరు రెవెన్యూ అధికారులు టీడీపీ పాలనలో కూడా చక్రం తిప్పుతామనే భ్రమలో విహరిస్తున్నారు.