Share News

తంబళ్లపల్లెలో కూటమి అభ్యర్థి ఓటమికి కారణాలెన్నో..?

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:43 PM

తంబళ్లపల్లె కూటమి అభ్యర్ఝి దాసరిపల్లె జయచంద్రారెడ్డి ఓటమికి కారణాలు ఎన్నో..?

తంబళ్లపల్లెలో కూటమి అభ్యర్థి ఓటమికి కారణాలెన్నో..?

మదనపల్లె, జూన 4: తంబళ్లపల్లె కూటమి అభ్యర్ఝి దాసరిపల్లె జయచంద్రారెడ్డి ఓటమికి కారణాలు ఎన్నో..? రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన దాసరిపల్లె జయచంద్రారెడ్డి . రాష్ట్రవ్యాప్తంగా కూటమి సునామీ సృష్టించగా, తంబళ్లపల్లెలో మాత్రం విజయం సాధించ లేకపోయారు. తాలిబన రాజ్యంగా పేరుగాంచిన తంబళ్లపల్లెలో వైసీపీకి, ముఖ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వైసీపీ అరాచకాలను ఎదురించిన ప్రతిపక్షంపై డాడులు, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, నిలదీసిన వారిపై అక్రమ కేసులు బనాయించారు. ప్రాజెక్టుల పరిశీలన నిమిత్తం జిల్లాకు వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనే గతేడాది ఆగస్టు 4వతేదీన దాడులు చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో పెద్దఎత్తున భూకబ్జాలు, ప్రకృతి సంపద దోపిడీతో ప్రజలు విసిగిపోయారు. అయితే వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి అభ్యర్థి వైఫల్యం చెందారు. కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన జయచంద్రారెడ్డి..ఆస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. పైగా చివరి వరకూ టికెట్‌ మారుస్తారనే ప్రచారం, టికెట్‌ కేటాయింపులో గందరగోళం, బీ-ఫారం ఆలస్యంగా చేతికందడం, పార్టీ నాయకులు, కార్య కర్తలను పూర్తి స్థాయిలో కలవలేక పోవడమే కాదు..అసంతృప్తి నేతలను కలుపుకుని ముందుకెళ్లలేకపోయినట్లు చెబుతున్నారు. అలాగే టీడీపీ నేతలు, శ్రేణులు గ్రూపులుగా విడిపోవడం, టికెట్‌ దక్కక దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌, మాజీ ఎమ్మెల్యే ఎ.వి.లక్ష్మిదేవమ్మలు కూడా సహకరించలేదనే అపవాదు లేకపోలేదు. వీరితోపాటు కూట మి టికెట్‌కు విశ్వప్రయత్నాలు చేసిన కొండా నరేంద్ర లాంటి బలమైన నేతలను జయచం ద్రారెడ్డి కనీసం కలసి పనిచేద్దామని అడగలేదని పార్టీశ్రేణులు చెబుతున్నారు. కర్ణుడి చావునకు సవాలక్ష కారణాలు అన్నట్లు..తంబళ్లపల్లె కూటమి అభ్యర్థి ఓటమికి కూడా దాదాపు అవే కారణాలుగా చెబుతున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, కూటమికి ఉన్న సానుకూలతను ఆయన ఓట్ల రూపంలో మలుచుకోలేక పోయారు. పోలింగ్‌ రోజున చాలా కేంద్రాల్లో ఏజెంట్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు జయచంద్రారెడ్డికి అనుకూలంగా ఉన్న కొందరు పార్టీనేతలు కూడా ఓటర్లకు సకాలంలో డబ్బులు చేర్చేలేదని, అది కూడా ఓటమికి కారణంగా చెబుతున్నారు.

Updated Date - Jun 04 , 2024 | 11:43 PM