నిరంతరాయంగా విద్యుత్ సరఫరా : ఎస్‌ఈ
ABN , Publish Date - Mar 06 , 2024 | 10:57 PM
అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ క్రిష్ణారెడ్డి సిబ్బందిని ఆదేశించారు.

తంబళ్లపల్లె, మార్చి 6: అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ క్రిష్ణారెడ్డి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన గుర్రంకొండ 132 కేవీ, తంబళ్లపల్లె మండలంలోని కుక్కరాజుపల్లె, కన్నెమడుగు 33/11 కేవి, ములకలచెరువు, పీటీఎం మండలాల్లోని విద్యుత్ ఉప కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలతో పాటు రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. కుక్కరాజుపల్లె విద్యుత్ ఉప కేంద్రంలో అదనంగా 5 ఎంవీఏ ట్రాన్స్‌పార్మర్, కన్నెమడుగు ఉపకేంద్రంలో 3.5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఏఈ శేషుకుమార్‌ను ఆదేశించారు. ములకలచెరువు మండలంలో 2, బి.కొత్తకోటలో 2, పీటీఎంలో రెండు 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్రాలు నూతనంగా మంజూరయ్యాయని, వీటి పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు సౌర విద్యుత్ వినియోగించుకునేందుకు వీలుగా రాయితీతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ప్రవేశ పెట్టినట్లు ఎస్‌ఈ తెలిపారు. పక్కా ఇల్లు కలిగి ఉండి ఒకటి, రెండు అంతస్తులు కలిగిన వారు రాయితీతో ఇంటి పైకప్పుపై సోలార్ ప్లేట్లను అమర్చుకోవచ్చన్నారు. ఈ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ రూప్ టాప్‌ను ఏర్పాటు చేసి ఇచ్చి నె లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ గరిష్టంగా రూ.78 వేలు రాయితీ పొందే అవకాశం ఉంటుందన్నారు. పథకానికి దరఖాస్తు చేసుకోదలచిన వారు ప్రస్తుత విద్యుత్ బిల్లు, ఇంటి పైకప్పు ఫొటోతో దగ్గరలోని పోస్టాఫీసు, విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. అనంతరం తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండ మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయన వెంట డీఈ యుగంధర్, ఏడీఈ రుక్మాంగదబాబు, ఏఈ శేషుకుమార్, ఎల్‌ఐ భాస్కర్, లైన్‌మెన్‌లు శంకర, చంద్రశేఖర్‌నాయుడు తదితరులు ఉన్నారు.