Share News

బరి తెగించారు...!

ABN , Publish Date - Jan 21 , 2024 | 11:35 PM

పుల్లంపేటలో ప్రభుత్వ భూమి కనిపించిందంటే చాలు కబ్జారాయుళ్ల కబంధ హస్తాల్లో చిక్కుకోవాల్సిందే. మండల కేంద్రానికి చుట్టుపక్కల ఎక్కడా ప్రభుత్వ భూమి అనేదే లేకుండా అక్రమార్కులు కబ్జా చేసేశారు.

బరి తెగించారు...!
సర్వే నెంబరు 100లో ప్రభుత్వ భూమి ఆక్రమించి సాగు చేస్తున్న మామిడి తోట, చుట్టూ ఏర్పాటు చేసిన కంచె

పుల్లంపేటలో 50 ఎకరాలు భూకబ్జా

కబ్జా భూమిలో మామిడి, అరటి తోటల సాగు

కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి స్వాహా

ట్రాన్స్‌ఫార్మర్లు, ఫెన్సింగ్‌ ఏర్పాటు

అసైన్‌మెంట్‌ కమిటీలో చేర్చేందుకు చేతులు మారిన లక్షలాది రూపాయలు

పుల్లంపేటలో ప్రభుత్వ భూమి కనిపించిందంటే చాలు కబ్జారాయుళ్ల కబంధ హస్తాల్లో చిక్కుకోవాల్సిందే. మండల కేంద్రానికి చుట్టుపక్కల ఎక్కడా ప్రభుత్వ భూమి అనేదే లేకుండా అక్రమార్కులు కబ్జా చేసేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు భూమి అనేదే లేకుండా చేశారు. మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలో దాదాపు 50 ఎకరాలకు పైగా కొందరు కబ్జా చేసి మామిడి, అరటి తోటలు సాగు చేశారు. ఈ భూమి విలువ కోట్లాది రూపాయలు ఉంటుంది. ఆక్రమిత భూమికి ఫెన్సింగ్‌ కూడా ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌కో అధికారులు ఆ భూమిలో ట్రాన్స్‌ఫార్మర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం కొసమెరుపు.

పుల్లంపేట, జనవరి 21 : మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలో ప్రభుత్వ భూమిని కొందరు దర్జాగా కబ్జా చేసి ఆ భూమిలో మొక్కలు నాటి డ్రిప్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా సొంత భూమి అయినట్లు చుట్టూ ఫెన్సింగ్‌ బలంగా తీస్తున్నారు. దీనికి తోడు ట్రాన్స్‌కో అధికారులు కూడా ఆ భూమిలో ట్రాన్స్‌ఫార్మర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా తెలిసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో వారిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ సెంటు భూమి లక్ష రూపాయలకు పైగా పలుకుతుండటంతో కబ్జాదారులు రోజురోజుకు పేట్రేగిపోతూ ఏకంగా చెరువుల్లోకే ఫెన్సింగ్‌ తీసేశారు. వీటికి పకడ్బందీగా రికార్డులు తయారు చేసుకునేందుకు ఈ భూములను అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా హక్కులు పొందేందుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మండలంలోని కొమ్మనవారిపల్లె రెవెన్యూ గ్రామంలో పుల్లంపేట మండల కేంద్రానికి కిలోమీటరు దూరం కూడా లేని సర్వే నెంబరు-100లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ సర్పంచ్‌తో పాటు అతడి అనుచరుడు కబ్జా చేశారు. ఇందులో టెంకాయ చెట్లు, మామిడి చెట్లు వేశారు. డ్రిప్‌ కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల బోరు వేసి ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సెంట్లు లక్ష రూపాయలకు పైగా పలుకుతుంది. అంటే ఈ భూమి విలువ సుమారు రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. ఈ స్థలానికి ఆనుకుని సుమారు నాలుగు కాలనీలు ఉండటంతో ఈ స్థలంపై కన్నేసి కబ్జా చేసేశారు. అసైన్‌మెంట్‌ కమిటీలో పెట్టి సర్వహక్కులు పొందేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని కబ్జాదారులు బహిరంగంగా చెప్పుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సర్వే నెంబరు-107లో సుమారు 5 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. గతంలో పనిచేసిన ఓ తహసీల్దారు ఈ భూమిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. గతంలో ఈ భూమిని కబ్జా చేసిన వ్యక్తి అడ్డుపడటంతో ఆ తహసీల్దారు అప్పట్లో హెచ్చరించారు. అయితే లక్షలాది రూపాయలు కాసులకు, బంగారు బిస్కెట్లు ఎరవేయడంతో ఒకటిన్నర ఎకరా అతడి పేరుతో ఆన్‌లైన్‌ చేసేశారు. ఒకటిన్నర ఎకరా ఆన్‌లైన్‌ చేయడంతో అంతా నాదేనని సుమారు 5 ఎకరాల వరకు ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్‌ తీసి డ్రిప్‌ ఏర్పాటు చేశారు. సుమారు 300 మీటర్ల దూరంలో బోరు వేసి అక్కడి నుంచి నీటిని పంపింగ్‌ చేసుకుంటూ అరటి పంటను సాగు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఇవి ఏమాత్రం పడటం లేదు. ఈ భూములకు విలువ ఉండటంతో కబ్జారాయుళ్లు రెవెన్యూ అధికారులకు లక్షలాది రూపాయలు ఎరవేస్తుండటంతో మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి అని తహసీల్దారు గుర్తించి అందులో పట్టాలు పంపిణీ చేసి కబ్జారాయుళ్లని హెచ్చరించిన ఆ తహసీల్దార్‌ ఆ తరువాత నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్‌ చేయడాన్ని బట్టి చేస్తూ కబ్జారాయుళ్లకు రెవెన్యూ అధికారులు ఏవిధంగా సహకరిస్తున్నారో తెలుస్తోంది.

అలాగే కొత్తపల్లె అగ్రహారం వెళ్లే దారిలో కూడా ప్రభుత్వ భూమి అధికంగా ఉంది. ఇది కూడా పుల్లంపేటకు అతి సమీపంలో ఉంది. ఇక్కడైతే ఒక్కొక్కరూ ఏకంగా ఐదు నుంచి 15 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు కబ్జా చేసి వీటిని మరొకరికి అమ్ముకున్నారు. ఆ తరువాత లక్షలాది రూపాయలు పెట్టి ఈ భూములను ఏకంగా ఆన్‌లైన్‌ చేసుకున్నారు. ఆ తరువాత వీటిని బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకున్నారు. అసైన్‌మెంట్‌ కమిటీ రిజిష్టర్‌లో ఈ భూములకు సంబంధించి ఎటువంటి రికార్డులు లేవు. అయితే తహసీల్దార్లు మాత్రం లక్షలాది రూపాయలు తీసుకుని ఏకంగా ఆన్‌లైన్‌ చేసేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆన్‌లైన్‌ అయితే సర్వహక్కులు తమకే ఉన్నాయని వీటిని బేరసారాలు పెడుతున్నారు. ఇక్కడ ఉన్న సుమారు 50 నుంచి 70 ఎకరాలు అంతా కోనమ్మచెరువు, దాని చుట్టుపక్కల ఉన్న భూమే.. అధికారబలం, అర్ధబలం అధికంగా ఉన్న వారు ఇక్కడ భూములు కబ్జా చేసి ఏకంగా రెండు నుంచి ఐదు బోర్ల వరకు వేసేశారు. చుట్టూ లక్షలాది రూపాయలు పెట్టి ఫెన్సింగ్‌ తీసేశారు. ప్రభుత్వ భూములు అయినా వీటికి ఆన్‌లైన్‌ చేయడంతో విద్యుత్‌ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లు కూడా పెట్టేశారు. ఓ పేదవాడు బోరు వేసుకోవాలన్నా.. ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టుకోవాలన్నా రెవెన్యూ అధికారులు, ట్రాన్స్‌కో అధికారులు సవాలక్ష నిబంధనలు చెబుతారు. అయితే ఈ భూములకు మాత్రం భారీగా డబ్బులు ముట్టజెప్పడంతో కళ్లు మూసుకుపోయి అధికారులందరూ తమకు జేబులు నిండితే చాలనుకుని ప్రభుత్వ భూములు కబ్జా చేసేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు. మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఎక్కడా అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా పట్టాలిచ్చేందుకు నిబంధనలు లేవు. అయితే కిలోమీటరు దూరంలోనే కబ్జా జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కబ్జారాయుళ్లు వీటిని అసైన్‌మెంట్‌ కమిటీలో పెట్టి సర్వహక్కులు పొందేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో కబ్జారాయుళ్లకు సహకరించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులే కబ్జారాయుళ్లకు సహకరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. పుల్లంపేటకు సమీపంలో ప్రభుత్వ స్థలం లేదన్న సాకుతో గతంలో ఆదర్శ పాఠశాల, కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో మరోచోట ఏర్పాటు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో నూతన ప్రభుత్వ కార్యాలయాలకు గానీ, విద్యాలయాలకు గానీ పుల్లంపేట సమీపంలో ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఉన్నదంతా కోనమ్మ చెరువు సమీపంలో ఉన్న భూమే.. ఈ భూమంతా కబ్జారాయుళ్ల చేతికి వెళ్లిపోవడంతో భవిష్యత్తులో మండలంలో ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాల ఏర్పాటు చేసే అవకాశమే లేదు. గత కొన్నేళ్లుగా విద్యుత్‌ కార్యాలయానికి అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మాణానికి స్థలం లేక ఆగిపోయాయి. ఉన్నతాధికారులు ఈ ప్రభుత్వ భూమిపై పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి స్వాధీనం చేసుకుంటే భావితరాలకు ఈ భూమి ఎంతో ఉపయోగపడనుంది. లేదంటే ప్రభుత్వ భూమి లేక కార్యాలయాలు వెనక్కి మళ్లే అవకాశం కూడా ఉంది. పుల్లంపేటకు అతి సమీపంలో ఉండటంతో ఇక్కడ భూములకు కూడా భారీగా రెక్కలు వచ్చాయి. చుట్టుపక్కల సుమారు సెంటు లక్షకు పైగా పలుకుతుంది. అంటే ఎకరా కోటి రూపాయలు అన్నమాట.. ఇక్కడ ఉన్న భూమంతా కబ్జారాయుళ్ల చేతిలో ఉండటంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం ఏకంగా కబ్జారాయుళ్లు చెరువులో రోడ్డును ఆనుకుని కబ్జా చేసి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. అధికారులకు ఫిర్యాదు అందినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కబ్జారాయుళ్లు భారీ స్థాయిలో చేతులు తడపడంతో రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుంటే కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మౌనంగా ఉన్నారంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ భూములు కాపాడలేదని రెవెన్యూ అధికారులు పరోక్షంగా కబ్జారాయుళ్లకు సహకరిస్తుండటం మండలంలో చర్చనీయాంశమైంది.

ఆక్రమణదారులకు నోటీసులు ఇస్తాం

- నరసింహకుమార్‌, తహసీల్దార్‌, పుల్లంపేట

ఆక్రమణలను గుర్తించాము. భూఆక్రమణ 1905 చట్టం ప్రకారం ఆక్రమణదారులందరికీ ఏడు నోటీసులు జారీ చేస్తాం. తక్షణమే వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇది వరకే గ్రామాల్లో విలేజ్‌ రెవెన్యూ అధికారులకు ఎక్కడా ఎలాంటి భూఆక్రమణలకు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చాం. అయినా ఆక్రమణలు జరగడంతో వెంటనే చర్యలు చేపడతాం.

Updated Date - Jan 21 , 2024 | 11:36 PM