Share News

నామినేషన్ల పర్వం.. ప్రజలకు కష్టాలు ఆరంభం

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:52 PM

సాధారణ ఎన్నికల ఘట్టంలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ మొ దలుతో పట్టణ వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు మొదలయ్యాయి.

నామినేషన్ల పర్వం.. ప్రజలకు కష్టాలు ఆరంభం
చిత్తూరుబస్టాండు సర్కిల్‌లో రహదారికి అడ్డంగా నిలిపిన పోలీసుల వాహనం

మదనపల్లె, ఏప్రిల్‌ 18: సాధారణ ఎన్నికల ఘట్టంలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ మొ దలుతో పట్టణ వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు మొదలయ్యాయి. ఈనెల 25వ తేదీ వరకూ జరిగే ఈ క్రతువులో మొదటి రోజు గురువా రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం నుంచి వంద మీటర్ల వరకూ ప్రజలనే కాదు..వాహనాలను అనుమతించలేదు. ఇటు చిత్తూరు బస్టాండు సర్కిల్‌ నుంచి అటు పుంగనూరురోడ్డులోని మిషనకాంపౌండ్‌ వరకూ రోడ్డును బంద్‌ చేశారు. ఈ మధ్యలోని ఈస్టుకొత్తపేట, బర్మావీధి, తర్వా తవీఽధులే కాదు..ఆ ప్రాంతంలోని ప్రజలను అటు, ఇటు వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో గాంధీ రోడ్డు గుండా వెళాల్సిన ప్రజలు, వాహనదారులు పైప్రాంతాల గుండా తిరుక్కోని వెళ్లాల్సివచ్చింది. ఇక్కడే కాదు..అగ్నిమాపక కేంద్రం సమీపంలోని కూడా రోడ్డును బంద్‌ చేశారు. దీంతో పాఠశా లలు, ఆసుపత్రులు, వ్యాపారకేంద్రాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొదటి రోజు కావడంతో చాలా మందికి తెలియడం లేదు. ఇలా వారంరోజులపాటు పట్టణ వాసులకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. అలాగే గాంధీరోడ్డు మీదుగా వెళ్లాల్సిన ప్రైవేటు, ఆర్టీసీ బస్సులను కూడా బైపాస్‌మీదుగా దారి మళ్లించారు. వాహనాలను అను మతించక పోయినా కనీసం కాలినడక వెళ్లే వారిని, అందులోనూ ఆ ఏరియా వారిని అనుమతిం చాలని స్థానికులు కోరుతున్నారు. గురువారం మొదటిరోజు కావడంతో పెద్దగా ట్రాఫిక్‌ అనిపించ లేదు. అయితే..ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్య్ర అభ్యర్థుల నామినేషన్లను శుక్రవారం నుంచి ముమ్మరం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బలప్రదర్శనగా వచ్చే జనాలతో రద్దీ ఏర్పడి ట్రాఫిక్‌కు మరింత ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. ఇదిలావుండగా, ఎక్కడిక్కడ ప్రజలను, వాహనాలను అడ్డుకోవడంతో జనసంచారం లేక రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. మరోవైపు ఎండలు మండటంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి.

Updated Date - Apr 18 , 2024 | 11:52 PM