Share News

‘అమ్మఒడి పేరుతో పన్నుల బాదుడు’

ABN , Publish Date - Jan 21 , 2024 | 11:14 PM

అమ్మఒడి పేరుతో వైసీపీ ప్రభుత్వం పన్నుల రూపంలో అన్ని వర్గాల ప్రజల నడ్డి విరుస్తోందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దృఢం రెడ్డిబాబు ధ్వజమెత్తారు.

‘అమ్మఒడి పేరుతో  పన్నుల బాదుడు’
సంఘీభావం తెలుపుతున్న బీసీ నాయకులు

కడప (మారుతీనగర్‌), జనవరి 21: అమ్మఒడి పేరుతో వైసీపీ ప్రభుత్వం పన్నుల రూపంలో అన్ని వర్గాల ప్రజల నడ్డి విరుస్తోందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దృఢం రెడ్డిబాబు ధ్వజమెత్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికల్లో బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతికొద్ది మంది జనాభా గల అగ్రవర్ణాల చేతుల్లో రాజ్యాధికారం బందీ అయిందన్నారు. నేటికీ ఎక్కువ జనాభా గలిగిన వర్గాలు పల్లకీలు మోసే బోయీలుగా అగ్రవర్ణాల అహంకార మదానికి బలవుతున్నారన్నారు. జనాభా దామాషాప్రకారం చట్టసభల్లో 54 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, దేశ వ్యాప్తంగా కుల జన గణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక కళాక్షేత్రంలో నిర్వహించిన బీసీ గర్జన కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు జి.లక్ష్మిరెడ్డి, అమీర్‌బాబు, కడప టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాధవీరెడ్డి, నాయకుడు కత్తి రవీంద్ర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణయాదవ్‌ మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్‌ పన్ను, కరెంటు పన్ను, చెత్త పన్ను, ఆటోలపై రిజిస్ట్రేషన్‌ బాదుడు, పెట్రోఽ,డీజలు, గ్యాస్‌ ధరల పెంపుతో ప్రజలు తీవ్ర నరకయాతన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క చాన్స్‌ పేరుతో ప్రజలను బురిడీ కొట్టించి, అధికారం చేపట్టగానే పన్నుల బాదుడుతో ప్రజలకు ప్రత్యక్షంగా నరకం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక వలస పోతున్నారని, వీరితో పాటు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో సరైన విద్యాబోధన లేక ప్రైవేటు పాఠశలల్లో చదివిద్దామంటే ఫీజులు కట్టలేక పేదలు ఇబ్బందులుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం, అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులేమో లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడమే పనిగా పెట్టుకుని వారి ఆదాయ వనరులను పెంచుకుంటున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీసీ-ఏలో ఉన్న కులాలకు ఎస్టీ హోదా కల్పించాలన్నారు. అలాగే బీసీ-డిలో ఉన్న కులాలను బీసీఏలోకి చేర్చాలన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌ కల్పించాలని, క్రిమిలేయరు ఎత్తివేయాలని, చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో రుచి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ టీడీపీ కార్యదర్శి సుంకర నాగేశ్వర్‌రావు, ఏపీ బీసీ మహాసభ జాతీయ కన్వీనరు అవ్వారు మల్లికార్జున, శ్రీనివాసులు, బీజేపీ నాయకులు బాలకృష్ణయాదవ్‌, సంఘం సేవకులు సలావుద్దీన్‌, దళిత నాయకులు సంగటి మనోహర్‌తో పాటు పలువురు ఏపీ బీసీ సంక్షేమసంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 11:14 PM