హామీలు అమలు చేయకుంటే సమ్మె : సీఐటీయూ
ABN , Publish Date - Feb 06 , 2024 | 10:52 PM
మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లకు సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామాంజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాయచోటిటౌన్, ఫిబ్రవరి 6: మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లకు సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామాంజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పట్టణ కమిటీ అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలపై వెంటనే జీవోలు విడుదల చేయాలన్నారు. డ్రైవర్లకు రూ.24,500లు, పారిశుధ్య కార్మికులకు రూ.21 వేలు, క్లాప్ ఆటో డ్రైవర్లకు రూ.18,500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్-19 కార్మికులను అపోస్‌లో చేర్చడం, ఇంజనీరింగ్ సెక్షన్‌లో వారికి జీవో ప్రకారం వేతనాలు, టెక్నికల్, నాన్‌టెక్నికల్, స్కీల్డ్, సెమీ స్కిల్డ్ ప్రకారం వేతనాలు వంటి హామీలు ఇచ్చి సమ్మెను విరమింపజేసిందన్నారు. ఇప్పటికి నెల రోజులకు పైగా కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి జీవోలు విడుదల కాలేదన్నారు. దీనిని బట్టి చూస్తే కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మనకు స్పష్టంగా కనపడుతోందన్నారు. జీవోలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్దమని ఆయన హెచ్చరించారు. సోమవారం లోగా జీవోలు విడుదల చేయకపోతే సమ్మెలోకి వెళ్లేందుకు కార్మికులంతా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అగ్గిరామయ్య, వెంకట్రామయ్య, తిరుపతమ్మ, కేశమ్మ, సుహాషిని, రమణమ్మ, సీఐటీయూ నాయకులు మాదవ్, సిద్దమల్లు, సిద్దయ్య, హర్ష, నాగరాజ, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.