Share News

తల్లిదండ్రులపై దాడి చేసిన కుమారుడి అరెస్టు

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:01 PM

ఆస్తి పంపకం విషయంలో తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేసిన కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

తల్లిదండ్రులపై దాడి చేసిన కుమారుడి అరెస్టు
నిందితుడి అరెస్టు చూపుతున్న డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి

వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి

మదనపల్లె, మార్చి 4: ఆస్తి పంపకం విషయంలో తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేసిన కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. స్థానిక టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. బి.కొత్తకోట మండలం గుంతవారిపల్లెకు చెందిన పెద్దకాము లక్ష్మమ్మ, పెద్దకాము వెంకటరమణారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు ప్రస్తుతం మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె సమీపంలోని అయోధ్యనగర్‌లోని చిన్న కుమారుడు పి.శ్రీనివాసులురెడ్డి వద్ద ఉంటున్నారు. శ్రీనివాసులురెడ్డి స్థానికంగా చేనేత మగ్గం పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు సంపాదించిన అయిదు ఎకరాల భూమిని అన్నదమ్ములకు చెరో సగం రాసివ్వాలని నిందితుడు ఇబ్బంది పెడుతున్నాడు. సగం భూమి తన అధీనంలో ఉన్నా రికార్డుల పరంగా తన పేరున రాయించి ఇవ్వాలని కుమారుడు తల్లిదండ్రులపై ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటివద్ద ఉన్న తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మొదట కట్టెలతో తర్వాత చేతితో కొట్టి, కాళ్లతో తన్ని తీవ్రంగా గాయపరిచాడు. దీనిని గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు బాధితులను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం కర్నూలు రేంజ్‌ డీఐజీ, ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. ఇందులో టూటౌన్‌ సీఐ యువరాజ్‌, ఎస్సైలు ఇనయతుల్లా, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:01 PM