Share News

రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Sep 03 , 2024 | 11:23 PM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్‌ శివశంకర్‌ పేర్కొన్నారు.

రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం
మాట్లాడుతున్న కలెక్టర్‌ శివశంకర్‌

కలెక్టర్‌ శివశంకర్‌

కడప(కలెక్టరేట్‌), సెప్టెంబరు 3: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్‌ శివశంకర్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ సదస్సుల ప్రణాళిక, కార్యాచరణపై జాయింట్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌తో కలసి కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం త్వరలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. నిర్ణయించిన తేదీల్లో నిర్దేశించిన గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. గ్రామ రెవెన్యూ సిబ్బంది ముందుగానే ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. రెవెన్యూ సదస్సుల్లో మ్యుటేషన్లు, భూ వివాదాలు, భూ ఆక్రమణలు, 22(ఏ) దుర్వినియోగం, ఫ్రీహోల్డ్‌ భూములు తదితర వాటిపై గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అర్జీలు స్వీకరించిన వెంటనే రశీదులు ఇస్తారని, అదే రోజు ఆన్‌లైన్‌లో నమోదు చేసి 40 రోజుల వ్యవధిలో విచారణ చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ సదస్సులో గతంలో పార్టీ లోగోలతో జారీ చేసిన భూ హక్కు పత్రాలను సేకరించి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేస్తామన్నారు. రీ సర్వే పూర్తి అయిన గ్రామాల్ల్లో ఆర్‌ఓఆర్‌, రిజిస్టర్‌ను చదివి అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే మండల సర్వేయర్‌ సంబంధిత విలేజ్‌ మ్యాపులను కచ్చితంగా తీసుకు రావాల్సి ఉంటుందన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో ఆర్డీవో స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫారెస్ట్‌, దేవదాయ, పోలీసు అధికారులతో పాటు రిజిస్ర్టేషన్‌ అధికారులు, బ్యాంకర్లు, సహకార బ్యాంకు అధ్యక్షులు, అనుబంధ శాఖల అధికారులు హాజరవుతారన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను, మండల, డివిజన్‌ స్థాయిలో పరిష్కరిస్తారన్నారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమీక్షిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జెడ్‌హెచ్‌డీసీ భూముల వివరాలను సేకరించి ఇప్పటివరకు ఆయా భూముల అనుభవదారులు ఏవైనా ప్రభుత్వ లబ్ధి పొంది ఉన్నారా? అనే అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆర్డ్డీవోలను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అర్డీవోలు శ్రీనివాసులు, వెంకటపతి, చంద్రమోహన్‌, వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 11:23 PM