Share News

బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:51 PM

ఆంధ్రా అయోధ్య ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
పుట్ట నుంచి మన్ను సేకరిస్తున్న అర్చకులు

నేడు ధ్వజారోహణం

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ

విద్యుద్దీపకాంతుల్లో మెరిసిపోతున్న ఆలయం

ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 16 : ఆంధ్రా అయోధ్య ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవరులకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేపట్టారు. సాయంత్రం అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ చేశారు. అనంతరం అర్చకులు రామాలయంలోని పుట్ట నుంచి పుట్టమన్ను శాస్ర్తీయంగా సేకరించి రామాలయ ప్రాంగణంలోని హోమగుండంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో కేరళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయం విద్యుద్దీపాల కాంతిలో మెరిసిపోతోంది. విద్యుత్‌ కాంతుల్లో ఏర్పాటు చేసిన దేవతల కటౌట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలోని రంగమండపాన్ని వివిఽధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.

నేడు ధ్వజారోహణం

కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య మిధున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేషవాహనంపై స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు నటే్‌షబాబు, ప్రశాంతి, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:51 PM