Share News

అడ్డుకట్టేయలేని ఇసుక అక్రమ రవాణా

ABN , Publish Date - May 23 , 2024 | 11:20 PM

నియోజకవర్గంలోని పెన్నానది పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాకు అధికారులుసైతం అడ్డుకట్టేయలేకున్నారని విమర్శలున్నాయి.

అడ్డుకట్టేయలేని ఇసుక అక్రమ రవాణా
పెన్నానదిలోకి వెళుతున్న ట్రాక్టరు

యథేచ్ఛగా అక్రమ దందా

పెన్నానదిలో ఇసుక గుంతలు

జమ్మలమడుగు, మే 23: నియోజకవర్గంలోని పెన్నానది పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాకు అధికారులుసైతం అడ్డుకట్టేయలేకున్నారని విమర్శలున్నాయి. మండలంలోని ప్రతి గ్రామంలో అక్రమ ఇసుక రవాణాదారుల దందా అధికమైంది. పెన్నానది వంతెన పక్కన ముద్దనూరు రోడ్డులో అక్రమ ఇసుక రవాణాదారులు పెన్నానదిలో దారులు ఏర్పాటు చేసుకున్నారు. చీకటి పడగానే ఇసుక ట్రాక్టర్లు పెన్నానదిలో వాలుతున్నాయి. అక్కడ ఎక్స్‌కవేటర్లతో ఇసుక ట్రాక్టర్లను నింపుతున్నా అడిగేవారు లేరని స్థానికులు వాపోతున్నారు. కొందరు బహిరంగంగా పగలే ఇసుక అక్రమ రవాణా జోరుగా తరలిస్తున్నారు. అందులో పొన్నతోట దారి గూడుమస్తాన్‌వలి దర్గా సమీపాన, మోరగుడిలోని టీచర్స్‌ కాలనీ, భాగ్యనగర్‌ కాలనీ, అంబవరం, గూడెం చెరువు, కన్నెలూరు, గొరిగెనూరు, పి.సుగుమంచిపల్లె, మైలవరం మండలం దొమ్మరనంద్యాల ఇసుక అక్రమ రవాణాకు నిలయంగా మారింది. అక్రమ రవాణాదారులకు పెన్నానదిలోని ఇసుక కాసులు కురిపిస్తోంది. ఐదేళ్లగా అక్రమ ఇసుక రవాణా చేసినవారంతా ఆర్థికంగా బాగా బలపడినట్లు కొందరు వారే ఆయా ప్రాంతాల్లో రాజకీయ నేతలుగా ఉన్నారని తెలుస్తోంది. మరికొందరు ఏకంగా అక్రమ ఇసుక రవాణాకు అడ్డుపడకుండా వారిదారి వారు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా జమ్మలమడుగులో ప్రభుత్వ కార్యాలయాల ఎదురుగా రవాణా అవుతున్నా అధికారులు అడిగే దిక్కులేదని, దీంతో అక్రమ ఇసుక రవాణాదారుల ఆట జోరుగా సాగుతోందని ప్రజలు వాపోతున్నారు.

రెండు నెలల నుంచి వర్షాభావ పరిస్థితులతో పెన్నానదిలో మంచినీటి బోర్లకు నీరు అడుగంటి ఎక్కక సరఫరాలో తేడాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అక్రమ రవాణాదారులపై ఒక్క అధికారి చర్యలు తీసుకోవడంలేదంటే దాని అర్థం ఏమిటో ఇట్టే తెలిసిపోతోందని ప్రజలు బహిరంగంగా చెబుతున్నారు. ఇలాంటి దుస్థితి ఎప్పుడు లేదని పెన్నానదిలో ఇసుక గుంతలు ఏర్పడి ఇసుక ఖాళీ అయిన అక్రమ రవాణా దారులు ఇంకా ఆశతో అధికంగా రవాణా చేస్తున్నారని విమర్శలున్నాయి. ఇప్పటికైనా జమ్మలమడుగు ముద్దనూరు దారిలో పెన్నానది పక్కన ఇసుక తవ్వకాలు జరుగుతున్నా, వంతెన కింది నుంచి జోరుగా తరలిపోతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. పెన్నానది వంతెన పిల్లర్స్‌ ఇప్పటికే దెబ్బతిన్నాయని, ఈసారి భారీగా వర్షాలు కురిసి పెన్నానదికి వరదనీరు వస్తే మళ్లీ పిల్లర్స్‌ కుంగి దారి సమస్య ఏర్పడుతోందని అధికారులు ఇప్పటికైనా మత్తునిద్ర మేల్కొని చర్యలకు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - May 23 , 2024 | 11:20 PM