Share News

ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకం

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:25 PM

అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. స్మగ్లింగ్‌ను అడ్డుకోబోయిన ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలంలో జరిగింది.

ఎర్రచందనం స్మగ్లర్ల ఘాతుకం
ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో హతమైన ఏఆర్‌ కానిస్టేబుల్‌ గణేశ్‌

కారుతో ఢీకొట్టి ఏఆర్‌ కానిస్టేబుల్‌ హత్య

అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలంలో ఘటన

మృతుడిది శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం

మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు

నివ్వెరపోయిన పోలీసు, ఫారెస్టు సిబ్బంది

రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

పీలేరు, ఫిబ్రవరి 6: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. స్మగ్లింగ్‌ను అడ్డుకోబోయిన ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..

అన్నమయ్య జిల్లా సుండుపల్లె, సానిపాయ అటవీ ప్రాంతాల నుంచి తమిళనాడుకు పెద్దఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుండడంతో ఇటీవల ఫారెస్టు, టాస్క్‌ఫోర్సు పోలీసులు ఆ ప్రాంతాల్లో గస్తీ పెంచారు. అందులో భాగంగా సుండుపల్లె-పీలేరు మార్గంలో తరచూ వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఈ క్రమంలో సానిపాయ అడవుల నుంచి చెన్నైకి ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందన్న సమాచారంతో సోమవారం రాత్రి ఆర్‌ఎ్‌సఐ విశ్వనాథం నేతృత్వంలో ఏఆర్‌ పోలీసు సిబ్బంది కేవీపల్లె మండలం గుండ్రేవారిపల్లె సమీపంలోని గొల్లపల్లె చెరువు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము 2.30 గంటల ప్రాంతంలో సుండుపల్లె వైపు నుంచి వేగంగా వస్తున్న కేఏ02 ఎంజీ 2842 నెంబరు మారుతీ స్విఫ్ట్‌ కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను చూసిన కారులోని స్మగ్లర్లు కారును ఆపినట్టే ఆపి మళ్లీ వేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో ఆపేందుకు ప్రయత్నించిన గణేశ్‌ (30) అనే కానిస్టేబుల్‌ను ఢీకొట్టారు. దీంతో గణేశ్‌ కింద పడిపోయినా అతడి పైనుంచే కారును పోనిచ్చారు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన మిగిలిన సిబ్బంది ఓవైపు గణేశ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తూనే మరోవైపు కారును అడ్డుకున్నారు. పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో స్మగ్లర్లు కారును వదిలేసి పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు అప్రమత్తమై ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పారిపోయారు. గాయపడిన గణేశ్‌ను వైద్యం కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అతను మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు.

ఈ సంఘటన మంగళవారం ఉదయానికల్లా అన్నమయ్య జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దావానలంలా పాకింది. పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌, ఫారెస్టు సిబ్బంది ఎద్దఎత్తున పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు, తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ శ్రీనివాస్‌ మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేవీపల్లె పోలీసుస్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్లను సుదీర్ఘంగా విచారించారు. అనంతరం పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టాలన్న లక్ష్యంతో తాము కట్టడి చర్యలు చేపట్టామన్నారు. దీంతో స్మగ్లర్లలో నెలకొన్న అసహనం కారణంగా గణేశ్‌ ఉదంతం జరిగిందన్నారు. ఈ ఘటనలో ఉన్న స్మగ్లర్లు ఎంతటి వారైనా వదలిపెట్టమని, ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. స్మగ్లర్ల కారణంగా మృతి చెందిన గణేశ్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. గణేశ్‌ మృతదేహానికి అనంతపురం ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌ డీఐజీ సీహెచ్‌ వెంకటేశ్వర్లు, ఎస్పీలు కృష్ణారావు, శ్రీనివాస్‌, డీఎ్‌ఫవో వివేక్‌, రాయచోటి డీఎస్పీ మహబూబ్‌ బాషా నివాళులర్పించారు.

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గుట్టకిందపల్లెకు చెందిన గణేశ్‌ 11 ఏళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అనంతపురంలోని ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌కు చెందిన ఇతను ప్రస్తుతం తిరుపతిలోని టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ నివారణ యూనిట్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య అనూష, ఇద్దరు కుమారులు (రాజ్‌కిశోర్‌, వేదాన్ష్‌) ఉన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:25 PM