Share News

కొత్తపల్లి అగ్రహారం రోడ్డు పూర్తయ్యేదెన్నడో..

ABN , Publish Date - May 27 , 2024 | 09:42 PM

మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరం లోనే ఉన్నా తమ గ్రామంలో సమస్యలు ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదని కొత్తపల్లి అగ్రహారం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్తపల్లి అగ్రహారం రోడ్డు పూర్తయ్యేదెన్నడో..
అర్ధాంతరంగా ఆగిపోయినకొత్తపల్లి అగ్రహారం రోడ్డు పనులు

పుల్లంపేట, మే 27 : మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరం లోనే ఉన్నా తమ గ్రామంలో సమస్యలు ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదని కొత్తపల్లి అగ్రహారం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సుమారు 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. అంతా వ్యవసాయంపై ఆధారపడిన వారే.. అరటి, బొప్పాయి, వరి, పూలతోటలు సాగు చేస్తుంటారు. స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తైనా ఈ గ్రామం కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. ప్రధానంగా గ్రామంలోకి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చినపుడు ఈ మార్గంలో రాకపోకలు సాధ్యం కావు. దీంతో ఈ గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్లాలంటే చెప్పులు చేతపట్టుకొని వెళ్లాల్సిందే.. నాలుగేళ్ల క్రితం గ్రామానికి తారు రోడ్డు మంజూరైంది. అయితే వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. రోడ్డుకిరువైపులా మట్టిని తవ్వి రోడ్డుపై వేశారు. కల్వర్టుల పని ప్రారంభించారు. అంత కాంట్రాక్టరు పనులు ఆపేశాడు. బిల్లులు ఆలస్యం కావడంతో నష్టం వస్తుందని పని చేపట్టలేదు. దీంతో కొత్తపల్లి వాసులు కష్టాలు పదింతలయ్యాయి. అధికారులకు మొరపెట్టుకోవడంతో రాజంపేట సబ్‌ కలెక్టర్‌ ఉన్న ఫర్మాన అహమ్మద్‌ గ్రామాన్ని సంచరించి గ్రామస్తులు కష్టాలు స్వయంగా తెలుసుకొని రోడ్డు పని పూర్తి చేయాలని ఆదేశించారు. వెంటనే పనులు ప్రారంభమయ్యాయి. కొంతకాలం నత్తనడక నడిచి. రోడ్డుపై కంకరపరిచేదాకా సాగా, ఆపై ఆగిపోయాయి. ఇక తారు ఎప్పుడు పడుతుందో కొత్తపల్లి వాసుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియని పరిస్థితి. కల్వర్టుల వద్ద పనులు అసంపూర్తిగా ఉండటంతో వాహనాల్లో వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్డు పూర్తి చేయకపోతే, ఇసుక ట్రాక్టర్ల కారణంగా కంకర పూర్తిగా తేలిపోయే అవకాశం ఉంది. అధికారులు స్పందించి రోడ్డు పనిని పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - May 27 , 2024 | 09:42 PM