Share News

జ్వరమని ఆస్పత్రికి వెళుతూ...

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:33 PM

కుమార్తెకు జ్వరం వస్తుండటంతో ఆస్పత్రికి వెళుతూ కుమార్తెతో పాటు తల్లి, ఆమె బావ కొడుకు అనంతలోకాలకు వెళ్లారు.

జ్వరమని ఆస్పత్రికి వెళుతూ...
చిన్నారి వినీత మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యం

లారీని ఢీకొన్న బైక్‌

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సరస్వతిపల్లెలో విషాదం

రామాపురం, ఫిబ్రవరి 26: కుమార్తెకు జ్వరం వస్తుండటంతో ఆస్పత్రికి వెళుతూ కుమార్తెతో పాటు తల్లి, ఆమె బావ కొడుకు అనంతలోకాలకు వెళ్లారు. కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిలోని అన్నమయ్య జిల్లా రామాపురం మండలం బండపల్లి పంచాయతీ ఐరిస్‌ గ్రాండ్‌ హోటల్‌ సమీపంలో సోమవారం ఉదయం లారీని వెనుకవైపు నుంచి బైక్‌ ఢీకొనడంతో డేగల లక్ష్మిభవానీ (25), ఆమె కుమార్తె డేగల వినీత (5), ఆమె బావ కుమారుడు డేగల కృష్ణబాబు (21) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామాపురం మండలం సరస్వతిపల్లెకు చెందిన డేగల లక్ష్మిభవానీ, తన కుమార్తె డేగల వినీతకు జ్వరం వస్తుండడంతో రాయచోటిలోని ఆస్పత్రికి వెళ్లేందుకు తమ బావ కుమారుడైన కృష్ణబాబుతో కలిసి బైక్‌లో రాయచోటికి బయలుదేరారు. మార్గమధ్యంలోని బండపల్లె పంచాయతీలోని ఐరిస్‌ గ్రాండ్‌ హోటల్‌ వద్దకు వెళ్లగానే వీరి ముందు వెళుతున్న లారీ ఒక్కసారిగా కుడివైపు నుంచి ఎడమపక్కకు రావడంతో బైక్‌ వేగంగా వెళ్లి లారీ వెనుకవైపున ఢీకొంది. ప్రమాదంలో బైక్‌ లారీ వెనుకవైపు లోపలికి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా లక్ష్మిభవాని భర్త ధనుంజయ వ్యవసాయం చేసుకుంటూ ఇంటి వద్దే ఉన్నాడు. వీరికి ముగ్గురు సంతానం కాగా భార్యతో పాటు రెండో కుమార్తె ప్రమాదంలో చనిపోయింది. పెద్దకూతురు మోక్షిత (6), కుమారుడు మోక్షిత్‌ (4) ఉన్నారు. వీరంతా స్థానికంగా ఉన్న పాఠశాలకు వెళుతున్నారు. కాగా తల్లి చనిపోయిందని తెలియని ఆ చిన్నారులు ఆడుకుంటూ ఉండటం చూపరులను కంటతడి పెట్టించింది. మరో మృతుడు కృష్ణబాబు తండ్రి చెన్నకేశవ కువైత్‌లో ఉన్నాడు. ఇతడు కూడా కువైత్‌లో ఉంటూ ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. ఇతడికి తమ్ముడు మహేశ్‌ ఉన్నాడు. అతడు బీటెక్‌ చదువుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో సరస్వతిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్కిరెడ్డిపల్లె సీఐ గంగాధరబాబు, రామాపురం ఎస్‌ఐ వీఎల్‌ ప్రసాద్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదంపై ఆరా తీశారు. మృతి చెందిన వారిని శవపరీక్ష కోసం 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Feb 26 , 2024 | 11:33 PM