Share News

పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:24 PM

ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం, మరుగుదొడ్డి, ఫర్నీచర్‌ వంటి కనీస సౌకర్యాలు విధిగా కల్పించాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, జేసీ, తదితరులు

పీలేరు, మార్చి 18: ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం, మరుగుదొడ్డి, ఫర్నీచర్‌ వంటి కనీస సౌకర్యాలు విధిగా కల్పించాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పీలేరు నియోజకవర్గ స్ట్రాంగ్‌ రూము కోసం ఎంపిక చేసిన సంజయ్‌గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీలేరు ఏఎంసీ ప్రాంగణంలోని పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ కృష్ణారావు, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌లతో కలిసి కలెక్టర్‌ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక అధికారులతో మాట్లాడుతూ ఓటర్ల సౌకర్యం కోసం ప్రతి పోలింగ్‌ కేంద్రంలో మౌలిక వసతులతోపాటు ర్యాంపును నిర్మించాలన్నారు. ప్రతి అధికారీ తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను కల్పించాలన్నారు. సౌకర్యాల కల్పనలోగానీ, ఎన్నికల విధుల్లోగానీ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూములను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఎంసీ ప్రాంగణంలోని పోలింగ్‌ కేంద్రాలలో స్వల్ప మార్పులు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని ఓటర్ల సంఖ్య, ఏరియాల గురించి అక్కడున్న బీఎల్‌వోలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఆర్‌వో రమా, తహసీల్దారు మహబూబ్‌ బాషా, పీలేరు అర్బన్‌ సీఐ మోహన్‌ రెడ్డి, ఎస్‌ఐ నరసింహుడు, కళాశాల ప్రిన్సిపాల్‌ డా.సుధాకర్‌ రెడ్డి, ఏవో కరుణాకర్‌ రెడ్డి, డీటీలు సుబ్రహ్మణ్యం, కిరణ్‌, ఆర్‌ఐ చాణక్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:24 PM