Share News

కోరలు చాచిన డెంగ్యూ..!

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:11 PM

ప్రస్తుత వేసవిలో ప్రజలను డెంగ్యూ వ్యాప్తి భయపెడుతోంది.

కోరలు చాచిన డెంగ్యూ..!
చికిత్స పొందుతున్న బాలుడు

సంబేపల్లె, ఏప్రిల్‌ 18: ప్రస్తుత వేసవిలో ప్రజలను డెంగ్యూ వ్యాప్తి భయపెడుతోంది. సంబేపల్లె మండల పరిధిలోని దుద్యాల, చిన్నకోడివాండ్లపల్లె, పెద్దజంగంపల్లెలో పలువురు డెంగ్యూ బారిన పడి రాయచోటిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసి చికిత్స తీసుకుంటున్నారు. అయినా వైద్యులు అటువైపు చూడడం లేదు. గ్రామాల్లో స్థితిగతులను పర్యవేక్షించాల్సిన సూపర్‌ వైజర్లు ఆరోగ్య కేంద్రం వదిలి బయటకు వెళ్లడం లేదు. సంబేపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు సూపర్‌వైజర్లు ఉన్నారు. ఒక్కో సూపర్‌వైజర్‌ ఒక్కో గ్రామంలో పర్యవేక్షించి జ్వరాలపై వైద్యసేవలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి. అయితే నలుగురూ ఒకే చోటకు వెళుతున్నారని అంటున్నారు. నామమాత్రంగా ఏడాదికి ఒకటి, రెండు సార్లు ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడే వారు గ్రామాల్లో కనిపి స్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో మురుగునీరు కలుషితమై దోమలు పెరిగే అవకాశం ఉంది. దోమలు కుట్టడం వల్ల వైరల్‌ జ్వరాలు వస్తాయి. గత నెల రోజుల ముందు కొట్రాళ్ల హరిజనవాడ, ఊరగాయ గుట్ట హరిజనవాడలో పలువురు డెంగ్యూ భారిన పడి రాయచోటి, తిరుపతి, బెంగుళూరు వంటి ప్రైవేటు ఆసుపత్రిలో వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి చికిత్స పొంది ఇడ్లకు వచ్చినట్లు సమాచారం. బయటపడని డెంగ్యూ కేసులు గ్రామాల్లో ఎక్కువ ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై సంబేపల్లి వైద్యాధికారిని వివరణ కోరగా డెంగ్యూ జ్వరాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. గృహావసరాలకు వాడుకునే నీటిలో లార్వా పెరుగుతోంది. అలాంటి నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు, వేసవి కావడంతో నీటి కొరత కారణంగా సమస్యసలు ఎదుర్కొంటున్నామన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:12 PM