Share News

దిక్కూమొక్కు లేని జగనన్న కాలనీలు

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:24 PM

నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోవడం, ప్రభుత్వం అందజేసే సాయం భనవ నిర్మాణానికి ఏ మూలకు సరిపోక పోవడంతో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అ క్కడే అన్న చందంగా మారాయి.

దిక్కూమొక్కు లేని జగనన్న కాలనీలు
అరవీడులో మౌలిక సదుపాయాలకు నోచుకోని జగనన్న కాలనీ

నిర్మాణాలకు ఆసక్తి చూపని లబ్ధిదారులు

గాలివీడు, ఫిబ్రవరి25: నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోవడం, ప్రభుత్వం అందజేసే సాయం భనవ నిర్మాణానికి ఏ మూలకు సరిపోక పోవడంతో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అ క్కడే అన్న చందంగా మారాయి. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో 20 జగనన్న కాలనీలున్నాయి. అరవీడు పంచాయతీ మలసానివాండ్ల పల్లెలో 71, ఎగువగొట్టివీడులో 3, గాలివీడుపంచాయతీ ప్రాజెక్టు సమీపంలో 84, బలిజపల్లె 24 , అరవీటివాండ్లపల్లెలో 48, గాలివీడులో 87, గరుగుపల్లె పంచాయతీలోని కస్పాలో 6, గుండ్లచెరువు పంచాయతీలో 4, కొర్లకుంట పంచాయతీ చావిడిపల్లెలో 29, నూలివీడులో 2, ఆవులవాండలపల్లెలో 27, వడ్లపల్లెకు సమీపంలో 22, పందికుంటలో 7, పూలుకుంటలో 13, తలముడిపిలో 3, తూముకుంటలో 6 , వెలిగల్లులో 3 జగనన్న కాలనీల్లో 124 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 126 గృహాలు ఇంతవరకు నిర్మాణానికి నోచుకోలేదు. 242 ఇండ్లు పునాదులకే పరిమితం కాగా 46 ఇండ్లు గోడల వరకు, 49 ఇండ్లు మౌల్డింగ్‌ వరకు పూర్తయ్యాయి. మండల వ్యాప్తంగా 558 ఇండ్లు మంజూరు కాగా , కేవలం 52 ఇండ్లు మాత్రమే పూర్తి అయ్యాయి.

అరకొర వసతులు

జగనన్న కాలనీలను రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి కొరత సమస్యలు వేధిస్తున్నాయి. పలు కాలనీల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ఇంటి నిర్మాణానికి ఖర్చులు పెరిగిపోవడంతో ప్రభుత్వం ఇచ్చే సహాయం ఏ మూలకు సరిపోవడం లేదని లబ్ధిదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం లక్షా 70 వేల రూపాయలు ఇస్తోందని, కానీ నాలుగు లక్షలు ఖర్చు అవుతున్నదని చెబుతున్నారు. ఇంటి నిర్మాణాలు చేపితే అప్పుల పాలు అయిపోక తప్పదని వారు అంటున్నారు.

Updated Date - Feb 25 , 2024 | 11:24 PM