Share News

కళాశాల భూమి ఆక్రమణ

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:08 PM

స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించిన భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కళాశాల విద్యార్థినులు ధైర్యంగా ముందుకొచ్చి భూమి చదును చేస్తున్న ఎక్స్‌కవేటర్‌కు అడ్డుపడటంతో వైసీపీ ముఖ్య నాయకుల ప్రోద్భలంతో ఆక్రమణకు ప్రయత్నించిన ఆక్రమణదారులు వెనుదిరిగారు.

కళాశాల భూమి ఆక్రమణ
ఎక్స్‌కవేటర్‌ను అడ్డుకుంటున్న విద్యార్థినులు

ధైర్యంగా అడ్డుకున్న విద్యార్థినులు

ఎక్స్‌కవేటర్‌తో సహా వెనుదిరిగిన ఆక్రమణదారులు

సమాచారంతో ఘటనా స్థలానికి కిశోర్‌కుమార్‌ రెడ్డి

రెండెకరాల భూమి విలువ రూ.8 కోట్లు

కలికిరి, మార్చి 4: స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించిన భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కళాశాల విద్యార్థినులు ధైర్యంగా ముందుకొచ్చి భూమి చదును చేస్తున్న ఎక్స్‌కవేటర్‌కు అడ్డుపడటంతో వైసీపీ ముఖ్య నాయకుల ప్రోద్భలంతో ఆక్రమణకు ప్రయత్నించిన ఆక్రమణదారులు వెనుదిరిగారు. సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద కృష్ణా జిల్లాలోని కంచికచెర్ల, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కలికిరిలో రెండు ప్రభుత్వ మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలు 2013లో మంజూరయ్యాయి. భవనాలకు అవసరమైన భూమి, భవనాలు లేకపోవడంతో దాదాపు నాలుగేళ్లు చిత్తూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ రెసిడెన్షియల్‌ కళాశాల తరగతులను నిర్వహించారు. అనంతరం టీడీపీ అధికారంలో ఉండగా 2018 శాశ్వత భవన నిర్మాణాలు పూర్తయి ఇక్కడికే కళాశాలను తరలించారు. ఈ కళాశాలకు సర్వే నెంబరు 1149లో 8.83 ఎకరాలు, 621లో 7 ఎకరాలు మొత్తం 15.83 ఎకరాలు కేటాయించారు. ఇందులో కళాశాల భవనాలకు 8.33 ఎకరాలు పోనూ ఇంకా 7 ఎకరాలు మిగిలింది. ఇందులో కొంత స్థలం ఆంజనేయస్వామి ఆలయానికి వదిలేశారు. మిగిలిన భూమిలో ఆట స్థలం, ఆడిటోరియం తదితర తదితర నిర్మాణాల ప్రతిపాదనలు నిధుల కొరత కారణంగా ఐదేళ్లుగా ముందుకు సాగలేదు. ఈలోగా నాలుగ లేన్ల జాతీయ రహదారి విస్తరణ పనులు డిగ్రీ కళాశాలకు ఆనుకునే జరగడంతో భూమి విలువ అమాంతం రూ.కోట్లకు చేరుకుంది. ఎకరా ధర కనీసం రూ.4 కోట్లగా చెబుతున్నారు. భూమి విలువ అమాంతం పెరగడంతో సమీపంలోని నర్రావాండ్లపల్లె గ్రామస్థులు ఇందులో రెండెకరాలు తమకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని ఎమ్మెల్యేని కోరుతూ వచ్చారు. విషయం తెలుసుకున్న అప్పటి జిల్లా కలెక్టరు గిరీషా ఆరు నెలల క్రితం కళాశాలను సందర్శించి కళాశాలకు ఈ భూమి అవసరమని తేల్చి వెంటనే భూమి చుట్టూ కంచె వేయించేందుకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఇక్కడా నిధులు విడుదల కాకపోవడంతో కంచె వేసే పని కంచికి చేరింది. ఇక ఎన్నికలు రానున్న నేపథ్యంలో నర్రావాండ్లపల్లె గ్రామస్థులు వైసీపీ ముఖ్య నాయకులపై ఇళ్ల స్థలాల కోసం ఒత్తిడి పెంచారు. దీంతో ముందు కళాశాల స్థలంలో ఇళ్లు కట్టుకుంటే అనంతరం తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పట్టాలు జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు సోమవారం ఎక్స్‌కవేటర్‌తో చదును చేసే కార్యక్రమం చేపట్టారు. దీనిని నిలువరించడానికి కళాశాల ప్రిన్సిపాల్‌ తదితరులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నియోజకవర్గ నేత ప్రోద్బలం, హామీతోనే తాము భూమి స్వాధీనం చేసుకుంటున్నట్లు గ్రామస్థులు వాదనకు దిగడంతో వెనుదిరిగారు. విషయం తెలుసుకుని ఆగ్రహించిన కళాశాల విద్యార్థినులు మూకుమ్మడిగా ఆక్రమిత స్థలం వద్దకు వచ్చి అడ్డుకున్నారు. విద్యార్థినులు పట్టుబట్టి భీష్మించుకోవడంతో చేసేది లేక ఆక్రమణదారులు వెనుదిరిగారు. సమాచారం అందుకున్న వాల్మీకిపురం, కలికిరి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విద్యార్థినులకు అండగా నిలిచి ఆక్రమణదారులు తిరిగి రాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో తరగతులకు వెళ్లిపోయారు. ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.

రాబోయే తరాల వారి కోసం భూమిని కాపాడతాం

మా కోసమే కాదు.. రానున్న తరాల విద్యార్థినుల కోసం ఈ భూమిని కాపాడుకుంటామని, ఎవరినీ ఇందులో అడుగుపెట్టనీయమని పలువురు విద్యార్థినులు స్పష్టం చేశారు. సంఘటన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాకూ, మా తల్లిదండ్రులకు కూడా ఓట్లున్నాయనే విషయాన్ని గుర్తెరగాలని వారు స్పష్టం చేశారు. ఓట్ల రాజకీయం కోసం విలువైన కళాశాల భూమిని పణంగా పెట్టేందుకు తాము అంగీకరించబోమని, ఎంత వరకైనా వెళతామని కూడా ధీమా వ్యక్తం చేశారు. వాళ్లు 30 మంది ఉంటే మేము 300 మంది ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

వైసీపీ నాయకుల ఆగడాలకు హద్దు లేదు

కాగా ఈ గొడవకు సంబంధించిన సమాచారంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే తహసీల్దారు, ఆర్డీవోలతో మాట్లాడారు. కళాశాల భూమిలో ఒక ఇంచి ఆక్రమణకు గురైనా అధికారులదే బాధ్యతని స్పష్టం చేశారు. వైసీపీ నాయకుల ఆక్రమణలకు హద్దు లేకుండా పోతోందని, పీలేరు సంస్కృతిని కలికిరిలోకి పాకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కళాశాల భూమి కోసం, భవనాల నిర్మాణాల కోసం తాము ఎంతగా కష్టపడిందీ చెప్పుకొచ్చారు. ఓట్ల కోసం చదువుకుంటున్న ఆడబిడ్డల భూమిని ఆక్రమించడం ఎంతవరకు సమంజసమని ఆయన అధికారులను నిలదీశారు. ఓట్లు కావాలంటే స్వంత భూములు పంచి పెట్టాలని సూచించారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రజల భూములను కూడా వదలరనీ తాను ముందు నుంచీ చెబుతున్నానని, ఇప్పుడు అదే నిజమని తేలిపోతోందని కిశోర్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ధైర్యంగా ముందుకొచ్చి తమ భూమిని కాపాడుకున్న కళాశాల ఆడబిడ్డల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. వీరి ధైర్య సాహసాలు అందరికీ స్పూర్తినివ్వాలని కోరారు.

Updated Date - Mar 04 , 2024 | 11:08 PM