Share News

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:04 PM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు
సదస్సులో మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాశ్‌రెడ్డి

అవగాహన సదస్సులో డీఈవో శివప్రకాశ్‌రెడ్డి

రాయచోటి టౌన్‌, మార్చి 4: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాయచోటి పట్టణంలోని సాయిశుభ కల్యాణ మండలంలో పదవ తరగతి పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో డీఈవోతో పాటు తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి ఆనంద్‌రెడ్డి, మదనపల్లె ఉప విద్యాశాఖ అధికారి శ్రీరామ్‌పురుషోత్తం, ఏడీ ప్రసాద్‌బాబు, డీసీఈబీ సెక్రటరీ నాగమునిరెడ్డి, ఏఎంవో సుంకర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో చీఫ్‌ సూపరిండెంట్స్‌, డిపార్టుమెంట్‌ల ఆఫీసర్స్‌, మండల విద్యాశాఖ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని, ఈ సంవత్సరం ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఫిజికల్‌ సైన్స్‌, బయోలాజికల్‌ సైన్స్‌ ఒక్కొక్కటికి 50 మార్కులకు ఉంటాయని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా విద్యార్థులందరూ స్వేచ్ఛగా పరీక్షలు రాయాలని సూచించారు. తిరుపతి ఉపవిద్యశాఖ అధికారి ఆనందరెడ్డి మాట్లాడుతూ ఈసారి పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు సీరియల్‌ నెంబర్‌ కలిగి ఉంటాయని, ఏ విద్యార్థికి ఏ సీరియల్‌ నెంబరు వచ్చింది తెలుస్తుందన్నారు. కావున ఏ పేపర్‌ అయినా బయటికి వస్తే ఆ పేపరు ఏ విద్యార్థికి చెందినదనే విషయం సులభంగా తెలుసుకోవచ్చునన్నారు. కావున పిల్లలు ప్రశ్నా పత్రాలు బయటకు పంపకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మదనపల్లె ఉప విద్యాశాఖాధికారి శ్రీరామ్‌పురుషోత్తం మాట్లాడుతూ ప్రశ్నా పత్రాలు ట్రాన్స్‌పోర్ట్‌ సమయంలో జాగ్రత్త వహించాలని, జవాబుపత్రాల ప్యాకింగ్‌ సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనంతరం డీసీఈబీ సెక్రటరీ నాగమునిరెడ్డి మాట్లాడుతూ చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్‌ ఆఫీసర్స్‌ సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ ఆదేశానుసారం విద్యార్థులకు సమయానికి ప్రశ్నాపత్రాలు చేరే విధంగా చూడాలని తెలిపారు. అనంతరం ఏఎంవో రామకృష్ణ, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పరీక్ష విధానంపై అందరికీ అవగాహన కలిగించారు.

Updated Date - Mar 04 , 2024 | 11:04 PM