Share News

ఏకపక్ష అధికారులకు శృంగభంగం!

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:32 PM

గతంలో అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ సానుభూతి పరులపై తీవ్రమైన వేధింపులకు పాల్పడిన అధికారులకు తీవ్ర స్థాయిలో శృంగభంగం జరిగింది.

ఏకపక్ష అధికారులకు శృంగభంగం!
తమ భవిష్యత్తుపై కిశోర్‌కుమార్‌ రెడ్డికి విన్నవిస్తున్న పీలేరు వలంటీర్లు

కలికిరి, జూన 9: గతంలో అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ సానుభూతి పరులపై తీవ్రమైన వేధింపులకు పాల్పడిన అధికారులకు తీవ్ర స్థాయిలో శృంగభంగం జరిగింది. ఆది వారం ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ రెడ్డిని ఆయన స్వగ్రామంలో కలుసు కోవడానికి అత్యుత్సాహం ప్రదర్శించి మెహర్బానీ పొందడానికి ప్రయ త్నించిన అధికారులను పలువురు పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నాయకులతో అంటకాగుతూ ఎదుటి పార్టీ వారిని వేధించే వారి పరిస్థితి ఎలా వికటిస్తుందో ఆదివారం జరిగిన కొన్ని సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి.. వివరాలు.. నూతన ఎమ్మె ల్యే కిశోర్‌కుమార్‌ రెడ్డిని కలుసుకుని అభినందించడానికి ఆదివారం పెద్ద సంఖ్యలో వివిధ శాఖలకు చెందిన అధికారులు నగరిపల్లెలో బారులు తీరారు. లోపల అంతా సవ్యంగా జరుగతున్న సందర్భంలో కలికిరి డ్వామా కార్యాలయం ఏపీడీ నందకుమార్‌ రెడ్డి కూడా కిశోర్‌ కుమార్‌ రెడ్డిని కలుసుకోవడానికి ప్రయత్నించారు. ఈయన పీలేరు మండలంలోని తన సొంత పంచాయతీలో ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో ఓటర్లకు డబ్బు పంచారనే ఆరోపణలున్నాయి. ఆయన భార్య జాండ్ల పంచాయతీ వైసీపీ సర్పంచు కూడా. అంతేగాకుండా గత ఐదేళ్లుగా టీడీపీ సానుభూతిపరులైన ఉపాధి హామీ పథకంలో పని చేసే కింది స్థాయి ఉద్యోగులను బాగా వేధించారని ప్రచారంలో ఉంది. గతేడాది ఇక్కడి నుంచి బదిలీ మీద వెళ్లి తీరా ఎన్నికలకు రెండు నెలలు మందు తిరిగి కలికిరి వచ్చారు. నందకుమార్‌ రెడ్డి వచ్చిన సమ యంలో ఆయన తొలగించిన దాదాపు పది మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు అక్కడ తారసపడ్డారు. దీంతో ఆగ్రహోదగ్రులైన వారు నందకుమార్‌ రెడ్డిని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. నియోజకవర్గంలో దాదాపు 30 మంది కుటుంబాలను రోడ్డు పాలు చేసింది చాలక మళ్ళీ ఏ ముఖం పెట్టకుని ఇక్కడికొచ్చావంటూ నిలదీశారు. ఎమ్మెల్యేని కలుసుకోవడానికి వీలు లేదంటూ అడ్డుకున్నారు. గేటు బయట వరకూ తోసుకుంటూ వెళ్లారు. చివరకు ఆయన ఎమ్మెల్యేను కలవకుండానే వెళ్లిపోయారు. అదే విధంగా ప్రస్తుతం పనిష్మెంట్‌లో వున్న ఒక సీఐ కూడా భం గపడ్డారు. కిశోర్‌కుమార్‌ రెడ్డిని కలవడానికి వీలు లేదంటూ అడ్డుకుని తిప్పి పంపారు. టీడీపీ సానుభూతిపరులైన కొంత మంది వెలుగు సంఘమిత్రలకు వేఽధింపులతో అన్యాయం చేసి వైసీపీ నాయకురాలిగా వ్యవహరించిన ఒక సంఘమిత్ర లోనికి రాకుండా పలువురు అడ్డుకోగా ఆమె వెనుదిరిగారు. తమపై తప్పుడు కేసులు పెట్టి వేధించినందుకు నియోజకవర్గంలోని ఒక మారుమూల మండలానికి చెందిన ఎస్‌ఐని అక్కడి ప్రజాప్రతినిధులు నిలదీశారు. ఇంటికొచ్చి ప్రాధేయపడినా మహిళ అని కూడా చూడకుండా అక్రమంగా కేసులు పెట్టావని దుయ్యబట్టారు. తోటి పోలీసులు సర్దుబాటు చేసినా ఫోను వస్తోందన్న నెపంతో ఆయన బయటకు వెళ్లిపోయారు. ఇక పీలేరు పట్టణం కళాకారుల సంఘం అధ్యక్షుడు కత్తి రామలింగా రెడ్డి సభ్యులకు ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం అండ చూసుకుని భూ ఆక్రమణలు చేశాడని ఆరోపణలున్నాయి. ఆయన మంత్రి, ఎంపీలకు అత్యంత సన్నిహితు డుగా పేరుంది. కిశోర్‌కుమార్‌ రెడ్డిని సన్మానించడానికి ఆయన లోపలి కి వచ్చేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పీలేరు నాయకులు అడ్డుకుని బయటకు గెంటేశారు. అనేక శాఖలకు చెందిన అధికారులు గౌరవప్రదంగా వచ్చి పోతున్నా ఎదురవ్వని చేదు అనుభవాలు అతిగా ప్రవర్తించిన వారి విషయంలో మాత్రం తప్పలేదు. బయట ఇంత జరుగుతున్నా లోపలున్న కిశోర్‌కుమార్‌ రెడ్డికి తెలియకుండా నాయకు లు, కార్యకర్తలు తమ పని కానిచ్చారు. అయితే చివరగా విషయం తెలి సిన కిశోర్‌కుమార్‌ రెడ్డి అలా చేయడం సరికాదంటూ మందలించినట్లు తెలిసింది.

వలంటీర్ల వేడికోలు

పీలేరు పట్టణానికి చెందిన కొంత మంది వలంటీర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నాయకుల ఒత్తిడితో బలవంతంగా రాజీ నామాలు చేయించారని వాపోయారు. ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయానికి సంబంధించిందన్నారు. రాజీనామా చేయకుండా ఉండా ల్సిందని కిశోర్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. పీలేరు కార్పెంటర్స్‌ కాలనీకి చెందిన పలువురు తమ ఇళ్ల స్థలాల సమస్య గురించి చెప్పాలని వచ్చినా వీలు కాలేదు. తరువాత చూద్దామని చెపుతూ ఎల్లుండి జరుగనున్న టీడీఎల్పీ సమావేశానికి ఆయన బయలుదేరి వెళ్లిపోయారు.

Updated Date - Jun 09 , 2024 | 11:32 PM