Share News

పసిడిపురిలో అమాత్యులేరీ..?

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:13 PM

వ్యాపారానికి, కవులకు, కళాకారులకు కొదవలేని పసిడిపురిని ఇంతవరకూ ఒక్క మంత్రి పదవీ వరించలేదు. ఇప్పటికి 16 పర్యాయాలు ఎన్నికలు జరిగితే ఒక్క పర్యాయం ఆర్యవైశ్యులకు, 15 పర్యాయాలు రెడ్ల సామాజిక వర్గీయులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇంత ఘనత వహించిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్క పర్యాయం కూడా మంత్రి పదవి దక్కక పోవడం గమనార్హం. 1952లోప్రొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడింది. 62 ఏళ్ళుగా ఈ నియోజకవర్గం నుంచి 16 దఫాలుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు.

పసిడిపురిలో అమాత్యులేరీ..?
25 ఏళ్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన వరదరాజుల రెడ్డి

16 దఫాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు

మంత్రి పదవికి నోచుకోని నియోజకవర్గం

పాతికేళ్ళపాటు సాగిన వరదరాజులరెడ్డి హవా

మూడోసారి ముచ్చటగా బరిలో రాచమల్లు

వ్యాపారానికి, కవులకు, కళాకారులకు కొదవలేని పసిడిపురిని ఇంతవరకూ ఒక్క మంత్రి పదవీ వరించలేదు. ఇప్పటికి 16 పర్యాయాలు ఎన్నికలు జరిగితే ఒక్క పర్యాయం ఆర్యవైశ్యులకు, 15 పర్యాయాలు రెడ్ల సామాజిక వర్గీయులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇంత ఘనత వహించిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్క పర్యాయం కూడా మంత్రి పదవి దక్కక పోవడం గమనార్హం. 1952లోప్రొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడింది. 62 ఏళ్ళుగా ఈ నియోజకవర్గం నుంచి 16 దఫాలుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు.

ప్రొద్దుటూరు, ఏప్రిల్‌ 18: ప్రొద్దుటూరుకు 16 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 1957లో ఒక్కసారి మాత్రం ఉప ఎన్నిక జరిగింది. ఇందులో కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ (ఐ) తరపున తొమ్మిది సార్లు, టీడీపీ తరపున మూడుసార్లు, ఇండిపెండెంటు రెండు సార్లు, వైసీపీ అభ్యర్థులు రెండు సార్లు గెలిచారు. 1952 మొదటిసారి ప్రొద్దుటూరు నియోజకవర్గంకు జరిగిన ఎన్నికల్లో మొత్తం ఓట్లు 68,162 ఓట్లు వుండగా అందులో పోలైనవి 45,535 ఓట్లు. కందుల బాలనారాయణరెడ్డి కాంగ్రెస్‌ నుంచి 15,054 ఓట్లతో పాణ్యం ఎర్రమునిరెడ్డి (కేఎంపీపీ)పై గెలిచారు. ఆ తర్వాత రెండో సారి 1955లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 64,618 ఓట్లకు 42,648 ఓట్లు పోలవగా సీపీఐ అభ్యర్థి రామిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి (చంద్రన్న)పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా కందుల బాలనా రాయణరెడ్డి 23,563 ఓట్లతో గెలిచారు. చంద్ర ఓబులరెడ్డికి 19,085 ఓట్లు వచ్చాయి. 1957లో ప్రొ ద్దుటూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. నాడు మొత్తం ఓట్లు 67,465 ఓట్లలో 46,281 పోలైతే చెల్లుబాటు అయినవి 46,121. ఇండిపెండెంట్‌గా రామిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి పాణ్యం ఎర్రమునిరెడ్డిపై 28,088 ఓట్లతో గెలిచారు. పాణ్యం ఎర్రమునిరెడ్డికి 16,419 ఓట్లు వచ్చాయి. 1962లో జరిగిన ఎన్నికల్లో పాణ్యం ఎర్రమునిరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్ర ఓబుళరెడ్డిపై గెలిచారు. 1967లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌ రామసుబ్బారెడ్డి ఇండిపెండెంట్‌ అభ్యర్థి పాణ్యం ఎర్రమునిరెడ్డిపై గెలిచారు. 1972లో ఆర్యవైశ్యకులానికి చెందిన కొప్పరపు సుబ్బారావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీపీఐ అభ్యర్థి ఐ సుబ్బారెడ్డిపై విజయం సాధించారు.

1978లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా చంద్ర ఓబులరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి జి.పుల్లారెడ్డిపై గెలుపొందారు. ఇప్పటి వరకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, సీపీఐ, జనతా పార్టీలు, ఇండిపెండెంట్‌గా పోటీచేస్తూ వచ్చినా 1982లో దివంగత ఎన్టీరామారావు తొలిసారి ప్రాంతీయ పార్టీ (తెలుగుదేశం)ను స్థాపించి 1983 ఎన్నికల్లోఆ పార్టీ తరపున డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి పోటీ చేసి ఇండిపెండెంట్‌ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డిపై గెలుపొందారు. 1985 ఎన్నికల్లో ఎంవీ రమణారెడ్డి రాయలసీమ విమోచన సమితి పార్టీ నడుపుతూ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరదరాజులరెడ్డి వరుసగా 1989, 1994, 1999, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు డాక్టర్‌ జి.వి.క్రిష్ణారెడ్డి, కొవ్వూరు రామసుబ్బారెడ్డి, మల్లెల లింగారెడ్డిపై విజయం సాధిస్తూ వచ్చారు. దాదాపు ఒకతరం పాటు పాతికేళ్ళు ఆయన హవా సాగింది.

కాంగ్రెస్‌ హవాలో జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డి

2009లో టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి చేతిలో కాంగ్రెస్‌ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి మొదటి సారి ఓటమి చెందారు. అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా, కాంగ్రెస్‌ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చింది. జిల్లాలో ప్రొద్దుటూరు మినహా అన్ని స్థానాలు కైవశం చేసుకున్నా జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా లింగారెడ్డి విజయదుందుభి మోగించారు.

2014, 2019లో గెలుపొందిన వైసీపీ

వైసీపీ ఏర్పడినప్పటి నుంచీ ప్రొద్దుటూరులో రెండుసార్లు ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి గెలుపొందారు. వైసీపీ 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి పోటీ చేసి శిష్యుడైన రాచమల్లు ప్రసాద్‌రెడ్డి చేతిలో రెండోసారి ఓటమిచెందాడు. ఆతరువాత జరిగిన 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మల్లెల లింగారెడ్డి వైసీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాద్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. మూడో సారి వైసీపీ హాట్రిక్‌ కోసం ముమ్మరయత్నాలు చేస్తోంది. ఈ పర్యాయం టీడీపీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి బరిలో నిలవగా శిశ్యుడైన రాచమల్లు ప్రసాద్‌రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో వున్నాడు. పదేళ్ళ రాచమల్లు పాలనలో పట్టణంలో ఎంతో వ్యతిరేకతను కూడకట్టుకున్న రాచమల్లు హాట్రిక్‌ యత్నాలు ఫలిస్తాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫలితంగా ఈ ఎన్నికలు ప్రొద్దుటూరులో ఉత్కంఠత రేకెత్తిస్తున్నాయి. ఒక వైపున వైసీపీ వైఫల్యాలు, మరో వైపున రాచమల్లుపై ప్రజావ్యతిరేకత టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డిని గెలిపిస్తుందా లేదా మే 13న ప్రొద్దుటూరు ఓటర్లు నిర్ణయించనున్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ బీసీలకు దక్కని టిక్కెట్లు

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటర్లు బీసీలున్నారు. ఆ తరువాత ఆర్యవైశ్యు లు, ముస్లింలు. కేవలం 20 శాతం మాత్రమే రెడ్ల సామాజిక వర్గం. కానీ నియోజకవర్గం పుట్టినప్పుటి నుంచీ వారిదే ఆధిపత్యం కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి బీసీలు టీడీపీ టిక్కెట్టు ఆశించారు. అందుకోసం పెద్ద ఎత్తున బీసీ సంఘాలు సభలు సమావేశాలు జరిపి గళం విప్పారు. బీసీల పార్టీఅయిన టీడీపీ సీటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చంద్రబాబును కలిశారు. కానీ మళ్లీ సామాజిక వర్గాల కూర్పులో రెడ్లకే సీటు దక్కింది. 2024లో వైసీపీ సామాజిక బస్సు యాత్ర జరిపి బీసీలకు ప్రాధన్యత ఇస్తానని చెప్పడంతో ప్రొద్దుటూరు నుంచీ బీసీలైన న్యాయవాది చెన్నా సరళాదేవి వైసీపీ టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేసింది. ఆమేర కు పట్టణంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కరపత్రాలు పంపిణీ చేసి సమావేశాలు నిర్వహించారు. మరో వైపు బీసీలకు జనాభా దామాషా ప్రకారం టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాలు పెద్దఎత్తున సభలు జరిపారు. ప్రొద్దుటూరులో వైనాట్‌ బీసీ అని నినాదం తో డిమాండ్‌ వచ్చినా టీడీపీ వైసీపీ రెండు పార్టీలు కూడా మళ్ళీ రెడ్లకే ప్రాధన్యత నిచ్చాయి.

సం// గెలుపొందిన అభ్యర్థి పార్టీ మొత్తం ఓట్లు పొందిన ఓట్లు

1952 కె.బాల నారాయణరెడి (కాంగ్రెస్‌) 68, 162 15,054

1955 కె.బాల నారాయణరెడ్డి (కాంగ్రెస్‌) 64,618 23,563

1957 ఆర్‌ చంద్ర ఓబులరెడి (ఇండి) 67,465 28,088

1962 పాణ ్యం ఎర్రమునిరెడ్డి (ఇండి) 77,924 30.695

1967 ఆర్‌ రామసుబ్బారెడ్డి (కాంగ్రెస్‌) 72,924 27,354

1972 కొప్పరపు సుబ్బారావు (కాంగ్రెస్‌) 93 289 30,502

1978 ఆర్‌ చంద్ర ఓబులరెడ్డి (కాంగ్రెస్‌ ఐ) 1,10,010 34,160

1983 ఎంవీ రమణారెడ్డి (టీడీపీ) 1,34,068 56,970

1985 ఎన్‌ వరదరాజులరెడ్డి (టీడీపీ) 1,44,929 47,283

1989 ఎన్‌ వరదరాజులరెడ్డి (కాంగ్రెస్‌) 1,73 ,661 77,386

1994 ఎన్‌ వరదరాజులరెడ్డి (కాంగ్రెస్‌) 1,84,612 45,738

1999 ఎన్‌ వరదరాజులరెడ్డి (కాంగ్రెస్‌) 1,96,850 46,740

2004 ఎన్‌ వరద రాజులరెడ్డి (కాంగ్రెస్‌) 1,96,263 54,429

2009 మల్లెల లింగారెడ్డి (టీడీపీ) 2,04,221 73,023

2014 ఆర్‌ శివప్రసాద్‌రెడ్డి (వైసీపీ) 2,32,284 93,866

2019 ఆర్‌ శివ ప్రసాద్‌ రెడ్డి (వైసీపీ) 2,36,730 1,07,941

Updated Date - Apr 18 , 2024 | 11:13 PM