Share News

జగన్‌ హామీలన్నీ గాల్లోనే...

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:55 PM

మదనపల్లె ప్రజలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ గాల్లో కొట్టుకుపోయాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. న్యాయ్‌ యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం మదనపల్లెకు విచ్చేశారు.

జగన్‌ హామీలన్నీ గాల్లోనే...
మదనపల్లెలో జరిగిన న్యాయ్‌యాత్రలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల

10 శాతం హంద్రీ-నీవా పనులు కూడా చేయలేదు

చేనేత ఉత్పత్తులకు బ్రాండ్‌ ఇమేజ్‌ ఏమైంది

టమోటా కోల్డ్‌ స్టోరేజ్‌లు ఎక్కడన్నా...

రబ్బరు స్టాంపులా పీలేరు ఎమ్మెల్యే చింతల

పీలేరును తమ రాజ్యంలా మార్చుకున్న పెద్దిరెడ్డి కుటుంబం

న్యాయ్‌యాత్రలో ఏపీసీపీ అధ్యక్షురాలు షర్మిల

మదనపల్లె అర్బన్‌/ పీలేరు, ఏప్రిల్‌ 16 : మదనపల్లె ప్రజలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ గాల్లో కొట్టుకుపోయాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. న్యాయ్‌ యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం మదనపల్లెకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక బెంగళూరు బస్టాండులోని బహిరంగ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ చేపట్టిన పాదయాత్రలో, ఎన్నికల సందర్భంగా ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. జగన్‌ ఇచ్చిన హామీలన్నీ గాల్లో కొట్టుకుపోయాయంటూ విమర్శించారు. హంద్రీ-నీవాను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికున్నప్పుడు 90 శాతం పూర్తి చేయగా, మిగిలిన పదిశాతాన్ని ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో చేనేతలు ఎక్కువగా ఉన్నారని, వీరి చేనేత ఉత్పత్తులకు గిట్టుబాటు ధరతో పాటు ఇక్కడ తయారయ్యే చీరలకు కల్పిస్తానన్న బ్రాండ్‌ ఇమేజ్‌ ఏమైందని జగన్‌ను ప్రశ్నించారు. మదనపల్లె చుట్టూ ఏర్పాటు చేస్తానన్న ఔటర్‌ రింగురోడ్డు ఏమైందని, అది కూడా ఫ్యాన్‌ గాలికి కొట్టుకుపోయిందా? అంటూ నిలదీశారు. పడమటి మండలాల్లో ఎక్కువగా పండించే టమోటా రైతును ఆదుకునేందుకు టమోటాకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ధరలు హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు టమోటాను నిల్వ చేసి ధరలు వచ్చాక అమ్ముకునేందుకు వీలుగా కోల్డ్‌స్టోరేజీలు నిర్మాస్తామని, టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న జగన్‌ వీటిలో ఒకటైనా నెరవేర్చారా? అంటూ ప్రశ్నించారు. మదనపల్లె తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఉద్దేశించిన సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులు, వాటి మొరవలు కూడా పూర్తిచేయలేదన్నారు. మదనపల్లె కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లెల పవన్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఎస్‌.రెడ్డిసాహెబ్‌, సీపీఎం నాయకుడు పి.శ్రీనివాసులు, ఆమ్‌ఆద్మీపార్టీ నాయకుడు రహీమ్‌ మాట్లాడారు. షర్మిల సాయంత్రం 6:45 గంటలకు చేరుకుని 7:30 గంటల వరకూ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు భారీగా చేరుకున్న ప్రజలు ఆమెకు జేజేలు పలికారు. ఇక్కడి సమావేశం అనంతరం రోడ్‌షోగా బి.కొత్తకోటకు వెళ్లారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌కే బాషా, సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళి, నియోజకవర్గంలోని మూడు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

రబ్బరుస్టాంపులా చింతల

పెత్తనమంతా పెద్దిరెడ్డి కుటుంబానిదే

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు పీలేరును తమ రాజ్యంగా మలుచుకుని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని రబ్బరు స్టాంపుగా మార్చి వేశారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. న్యాయ్‌యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆమె పీలేరుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండు కూడలిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మంత్రి, ఎంపీలు చేసే అవినీతి పనులకు ఎమ్మెల్యే చింతల గంగిరెద్దులా తలూపాల్సిందేనని, లేకపోతే వారు చింతలను బతకనివ్వరని ఆరోపించారు. వైసీపీ హయాంలో పీలేరు నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. గత ఎన్నికల సందర్భంగా వారు హామీ ఇచ్చిన విధంగా టమోటా రైతులకు ఎటువంటి సాయం అందించలేదన్నారు. టమోటా పల్ప్‌ పరిశ్రమ, ప్రాసెసింగ్‌ యూనిట్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ వంటి హామీలను నెరవేర్చలేదన్నారు.

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్‌

సొంత బాబాయిని హత్య చేసిన వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి మళ్లీ కడప ఎంపీ టిక్కెట్టు ఇచ్చి హత్యా రాజకీయాలు, హంతకులను జగన్‌ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ కారణంగా రాష్ట్రంలో ల్యాండ్‌, శ్యాండ్‌, మైన్‌, వైన్‌ మాఫియా నడుస్తోందని, రాజకీయాలను ఆ నాలుగు మాఫియాలు శాసించే దుస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్‌ సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని షర్మిల పేర్కొన్నారు. పీలేరు అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న బాలినేని సోమశేఖర రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటిస్తామని, ఆయనను కూడా ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అల్లాబకష్‌, నజీర్‌ అహ్మద్‌, అమృతతేజ, దుబ్బా శ్రీకాంత్‌, సంపత్‌, శ్రీవర్దన్‌ చౌదరి, ఫయాజ్‌, రహంతుల్లా, యూసుఫ్‌ అలీ, ఇమ్రాన్‌ బాషా, తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల్లో టెన్షన్‌...టెన్షన్‌

వైఎస్‌ షర్మిల పర్యటన సందర్భంగా పీలేరు పోలీసుల్లో టెన్షన్‌ నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా షర్మిల సభ జరిగిన బస్టాండు ఎదుట ఉన్న వేర్‌హౌస్‌ గోడౌన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయచోటి డీఎస్పీ మహబూబ్‌బాషా నేతృత్వంలో పీలేరు అర్బన్‌ సీఐ మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో పీలేరు, కలకడ, వాల్మీకిపురం సర్కిళ్ల పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:55 PM