Share News

ప్రచార రథాల దహనంపై కేసు నమోదు

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:20 PM

భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) ప్రచార వాహనాల దహనం, ధ్వంసం ఘటనపై ఐపీసీ 307 కింద కేసు నమోదు చేసినట్లు రాయచోటి డీఎస్పీ సయ్యద్‌ మహబూబ్‌బాషా తెలిపారు.

ప్రచార రథాల దహనంపై కేసు నమోదు
సంఘటనా స్థలానికి సమీపంలో నిలిచి ఉన్న వైసీపీ నాయకుడి వాహనం

ఏడుగురు వైసీపీ నాయకుల అరెస్టు కేసును స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ కృష్ణారావు వివరాలు వెల్లడించిన రాయచోటి డీఎస్పీ మహబూబ్‌ బాషా

పలేరు, ఏప్రిల్‌ 30: భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) ప్రచార వాహనాల దహనం, ధ్వంసం ఘటనపై ఐపీసీ 307 కింద కేసు నమోదు చేసినట్లు రాయచోటి డీఎస్పీ సయ్యద్‌ మహబూబ్‌బాషా తెలిపారు. పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ వరంపాటివారిపల్లె వద్ద బీసీవై పార్టీకి చెందిన రెండు ప్రచార రథాలను దహనం చేయడంతో పాటు మరో రెండు రథాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై మంగళవారం పీలేరు అర్బన సీఐ కార్యాలయంలో రాయచోటి డీఎస్పీ విలేకరులతో మాట్లాడారు. వేపులబైలు ఘటనలో ప్రైవేటు వ్యక్తులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, పీలేరు నియోజకవర్గ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ (ఎంసీసీ) అమలు నోడల్‌ అధికారి, పీలేరు ఎంపీడీవో ఉపేంద్రరెడ్డి ఎన్నికల విధుల్లో భాగంగా ఫిర్యాదు చేశారన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పీలేరు అర్బన స్టేషనలో క్రైమ్‌ నెం.121/2024గా ఐపీసీ సెక్షన్లు 307, 341, 427, 435 కింద కేసు నమోదు చేశామన్నారు. ఎస్పీ కృష్ణారావు స్వయంగా కేసు నమోదు ప్రక్రియను పర్యవేక్షించారని డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు పీలేరు మండలం కాకులారంపల్లెకు చెందిన వైసీపీ నాయకుడు కొత్తపల్లె సురేశ కుమార్‌రెడ్డి (కాకులారంపల్లె సర్పంచ హరిణి భర్త), పీలేరు పట్టణం యల్లమంద క్రాసుకు చెందిన సునీల్‌కుమార్‌ రెడ్డి (పీలేరు పట్టణ సచివాలయం-2 కన్వీనర్‌), దీపు, కరీం, మధు, వెంకటరమణ, సాయి అనే ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనలో మరికొంతమంది పాల్గొన్నట్లు సమాచారం ఉందని, వారందరినీ త్వరలోనే పట్టుకుంటామన్నారు. సంఘటన జరిగినప్పుడు సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న పీలేరు పట్టణానికి చెందిన ఓ మైనారిటీ వైసీపీ నేత వాహనం ఆ తరువాత కనిపించకపోవడంపై పోలీసుల ప్రమేయం ఉందని పాత్రికేయులు ప్రశ్నించగా దాని గురించి తనకు తెలియదన్నారు.

పీలేరులో ఎస్పీ కృష్ణారావు మకాం

బీసీవై పార్టీ ప్రచార వాహనాల సంఘటన గురించి తెలుసుకున్న ఎస్పీ కృష్ణారావు పీలేరులోనే మకాం వేసి సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో వారిలో కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకుని మంగళవారం ఉదయం అరెస్టు చేశారు.

వైసిపీ నేత వాహనం మాయంపై మండిపాటు

వేపులబైలు వద్ద బీసీవై పార్టీ ప్రచార రథాలపై దాడికి వచ్చిన వారు ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్న ఓ మహీంద్రా బొలెరో వాహనం సంఘటనా స్థలం నుంచి మాయం కావడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. సంఘటనా స్థలాన్ని సోమవారం సాయంత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి సందర్శించారు. ఆ సమయంలో ఆ స్థలానికి కేవలం 20 అడుగుల దూరంలో చీకటిలో పీలేరుకు చెందిన అధికార పార్టీ మైనారిటీ నేతకు చెందిన వాహనం గమనించిన స్థానికులు ఆ విషయాన్ని కిశోర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆ విషయాన్ని ఆ సమయంలో అక్కడున్న పోలీసులకు తెలిపారు. వాహనాన్ని సీజ్‌ చేయాలని, కేసు దర్యాప్తుకు ఆ వాహనం ఉపయోగపడుతుందని కిశోర్‌ పోలీసులకు తెలిపారు. అయితే సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆ వాహనాన్ని అక్కడి నుంచి ఎవరో తీసుకెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఆ వాహనం అక్కడి నుంచి మాయం కావడంపై మంగళవారం కిశోర్‌ కుమార్‌ రెడ్డి ఆశ్ఛర్యం వ్యక్తం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రాణాంతక దాడులు జరిగిన సమయంలో కూడా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగిపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. వాహనం మాయం కావడంపై ఉన్నతాధికారులతోపాటు ఎన్నికల కమిషనకు ఫిర్యాదు చేస్తామన్నారు.

అజ్ఞాతంలోకి అధికార పార్టీ నేతలు

వేపులబైలు వద్ద బీసీవై పార్టీ ప్రచార వాహనాలపై దాడిలో పాల్గొన్న చాలా మంది అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు సోమవారం రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాడి ఘటనను పోలీసులు సీరియ్‌సగా తీసుకున్న విషయాన్ని పసిగట్టిన వైసీపీ అగ్రనాయకులు అందులో పాల్గొన్న వారికి ఫోన్లు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు సమాచారం. తాము చెప్పే వరకు బయటకు రావొద్దని సూచించినట్లు తెలిసింది.

వాహనాల దాడిపై మరో ఫిర్యాదు

పీలేరు, ఏప్రిల్‌ 30: బీసీవైపీ ప్రచార వాహ నాలపై దాడికి పాల్పడిన వారు తనపై దౌర్జన్యం చేయడమే కాకుండా తన సెల్‌ఫోనను లాక్కు న్నారంటూ వేపుల బైలుకు చెందిన టీడీపీ నేత గాయం వెంకటరెడ్డి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో పీలేరుకు చెం దిన వైసీపీ నాయకులు సురేశ కుమార్‌ రెడ్డి, ఆనంద, ఉదయ, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ సర్పంచ హబీబ్‌, పవన కుమార్‌ రెడ్డి, గాయం నాగభూషణం రెడ్డి సుమారు 100 మందికిపైగా తమ అనుచరులతో వాహనాలను దహనం చేయ డం చూశాననిభావించి తనపై దౌర్జన్యం చేసి సెల్‌ఫోనను లెక్కెళ్లిపోయారని పీలేరు ఎస్‌ఐ నరసింహుడుకు ఫిర్యాదు అందజేశాడు.

Updated Date - Apr 30 , 2024 | 11:21 PM