Share News

Power Corruption : ‘పవర్‌’ ఫుల్‌ దోపిడీ!

ABN , Publish Date - May 27 , 2024 | 04:30 AM

ఏదైనా ఒక వస్తువు కొనాలంటే మంచి నాణ్యత ఉండి, తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో చూసి కొంటారు.

Power Corruption : ‘పవర్‌’ ఫుల్‌ దోపిడీ!

విద్యుత్‌ పరికరాల కొనుగోళ్లలో అవినీతి!

తెలంగాణతో పోలిస్తే 2 రెట్ల అధిక ధర

ధరల పెంపుతో రూ.4,500 కోట్లు జేబులోకి

ఇన్‌స్టలేషన్‌ పేరిటా ప్రైవేటుకు సమర్పణ

ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలు

చక్రం తిప్పిన సర్కారు పెద్దలు, అధికారులు

7 నుంచి 10 శాతానికి పెరిగిన కమీషన్‌

జగన్‌ అస్మదీయ కంపెనీ షిరిడీసాయికి లబ్ధి

ట్రాన్స్‌ఫార్మర్‌, పోల్స్‌ సరఫరా ఆ సంస్థకే

అటు నుంచి పెద్దల జేబుల్లోకి సొమ్ములు!

జగన్మోహన్‌రెడ్డి పాలనలో విశృంఖలంగా సాగిన అవినీతి, అక్రమ వ్యవహారాలకు ఇదొక మచ్చుతునక. ఇసుక నుంచి మద్యం దాకా దేన్నీ వదలకుండా అడ్డగోలు రేట్లతో దోపిడీ చేసిన సర్కారు పెద్దలు.. విద్యుత్‌ పరికరాల కొనుగోళ్లలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం సాక్ష్యాధారాలతో సహా వెలుగు చూసింది. మొత్తం 4500 కోట్ల రూపాయలను సర్కారు పెద్దలు ‘పవర్‌’ ఫుల్‌గా దోచుకున్నట్టు స్పష్టమైంది.

'

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏదైనా ఒక వస్తువు కొనాలంటే మంచి నాణ్యత ఉండి, తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో చూసి కొంటారు. కానీ, ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం తనకు ఎక్కడ ఎక్కువ ‘గిట్టుబాటు’ అవుతుందో అక్కడే విద్యుత్‌ పరికరాలు కొనుగోలు చేయించారు. గత ఐదేళ్ల కాలంలో జగన్‌ సర్కారు కొనుగోలు చేసిన విద్యుత్‌ పరికరాలు, తెలంగాణలో కొనుగోలు చేసిన వివరాలను పోల్చి చూస్తే రూ.4,500 కోట్ల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ప్రాథమిక పరిశీలనే. లోతుల్లోకి వెళ్తే అవినీతి రూ.6 వేల కోట్లపైనే ఉంటుందని విద్యుత్‌ ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. విద్యుత్‌ స్తంభాలు (సిమెంట్‌, ఐరన్‌), విద్యుత్‌ సరఫరా తీగ(కేబుల్‌)లు, పాలిమర్‌పిన్‌, డిస్క్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలు, వ్యాక్యూమ్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌ (వీసీబీ)ల కొనుగోళ్లలో రెండు రకాల దోపిడీలు సాగించినట్టు తెలుస్తోంది. ఒక్కో పరికరం రేటును దాదాపు మూడింతలు పెంచి కొనడం ఒక ఎత్తయితే, ఆ పరికరాన్ని ఒకే కంపెనీ నుంచి కొనడం మరో ఎత్తు. ధరల మాయాజాలం, కొనుగోళ్లలో అక్రమాలు రికార్డుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ స్థాయిలో ఎవరూ ప్రశ్నించేవారులేరు. ఎందుకింత ధరలు పెట్టి కొన్నారని నిలదీసేవారే లేరు. ‘‘కొనండి.. మన కంపెనీల నుంచే ఎక్కువ ధర పెట్టయినా కొనండి’’ అని పెద్దలు ప్రోత్సహించారు. ఈ క్రమంలో భారీ ఎత్తున కమీషన్లు దండుకున్నారు. ఫలితంగా ఇటు సర్కారు ఖజానాకు, అటు వినియోగదారుడి జేబుకు కూడా భారీ చిల్లుపెట్టారు. ప్రభుత్వ పెద్దలే తెరవెనక ఉండటంతో కొందరు అధికారులు రెచ్చిపొయారు. కమీషన్లు, రెగ్యులర్‌ వసూళ్లతో అక్రమాలు సాగించారు.


గడిచిన ఐదేళ్లలో

జగన్‌ సర్కారు గత ఐదేళ్ల కాలంలో విద్యుత్‌ డిస్కమ్‌ల ద్వారా భారీగా పనులు చేయించింది. కొత్త లైన్లు, పాత లైన్ల పునరుద్ధరణ, మెయుంటెనెన్స్‌ పనులు చేపట్టింది. ఈ పనులకు ప్రధానంగా స్తంభాలు, విద్యుత్‌ సరఫరా చేసే కేబుల్స్‌, విద్యుత్‌ నియంత్రణకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్స్‌ కొనుగోలు చేశారు. వీటికిగాను గత ఐదేళ్ల కాలంలో రూ.13 వేల కోట్లపైనే డిస్కమ్‌ల ద్వారా ఖర్చు చేశారు. అయితే, ఇక్కడ అవినీతికి తెరలేపారు. రూ.210 ఖరీదైన 11 కేవీ-5 కేఎన్‌ పాలిమర్‌ పిన్‌ను రూ.411 రూపాయలకు కొనుగోలు చేశారు. దాన్ని సర్వీస్‌ కాంట్రాక్ట్‌లో భాగంగా అమర్చే అవకాశం ఉన్నా, దానికి కూడా మరో రూ.23 బిల్లు వేశారు. మొత్తంగా రూ.434 రూపాయలు చూపించారు. రూ.వందల ధరలున్న పరికరాల్లోనే ఇంత రెట్టింపు చెల్లింపులు చేస్తే, ఇక రూ.వేలు, లక్షల ధరలున్న పరికరాలకు మరింత వెచ్చించారు. చిత్రం ఏమంటే, ఎక్కువగా జగన్‌కు సన్నిహిత, అస్మదీయ కంపెనీ అయిన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ నుంచే కొనుగోళ్లు జరిగాయి. అంటే, జగన్‌ కోసమే జరిగిన కొనుగోల్‌మాల్‌లా ఈ వ్యవహారం సాగిందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

పద్ధతిగా దోచారు!

విద్యుత్‌ పరికరాల కొనుగోళ్లలో చాలా పద్ధతిగా జేబులు నింపుకొన్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలో కొందరు బడా అధికారులకు 7 శాతం కమీషన్‌ ఉండేది. చివరి మూడేళ్లలో దాన్ని 10 శాతానికి పెంచేశారు. కమీషన్‌ పెరిగినట్లే, పరికరాల ధరలను(ఎస్కలే షన్‌) భారీగా పెంచారు. అంటే ఏ కోశానా కాంట్రాక్టర్‌కు, ఏజెన్సీకి నష్టం కలగకుండా రేట్లలో సర్దుబాటు చేసకుంటూ వ్యూహాత్మకంగా ఎస్కలేట్‌ చేశారు. 33 కేవీ వీసీబీ ధర మార్కెట్‌లో రూ.5 లక్షలుగా ఉంది. తెలంగాణ సర్కారు ఈ పరికరాన్ని రూ.4.95 లక్షలకే కొనుగోలు చేసింది. కానీ, ఏపీ డిస్కమ్‌లు సగటున ఒక్కో దానికి రూ.7,81,160 చెల్లించాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీ అదనంగా రూ.2,86,160 దోచిపెట్టింది. ఇలా వెయ్యికిపైనే పరికరాలు కొన్నారని తెలిసింది. వీటికి రూ.117.17 కోట్లు ఖర్చుపెడితే, అదనంగా చెల్లించింది రూ.42.92 కోట్లు. దీనిలో ఇన్‌స్టలేషన్‌ పేరిట మరో రూ.4.11 కోట్లు ఖర్చు చూపించారు. తెలంగాణలో ఉచితంగా ఇన్‌స్టలేషన్‌ జరిగితే, ఏపీలో మాత్రం దానికి ప్రత్యేక చార్జీలను చెల్లించారు. ఇదే కేటగిరీలోని 11కేవీ వీసీబీలకు మార్కెట్‌లో రూ.3.50 లక్షల ధర ఉంది. తెలంగాణ సర్కారు రూ.3.45 లక్షలకే కొనుగోలు చేసింది. ఏపీ ఆ పరికరాన్ని రూ.6,23,040కు కొనుగోలు చేసింది. అంటే, మార్కెట్‌ ధరపై అదనంగా రూ.2,78,040 చెల్లించింది. దీనికి ఇన్‌స్టలేషన్‌ చార్జీగా రూ.22,869 చెల్లించారు. ఈ పరికరాలను దాదాపు 2500 యూనిట్ల మేర కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ కొనుగోళ్లలో అదనంగా రూ.69.51 కోట్ల మేరకు చెల్లింపులు చేశారు. ఇన్‌స్టలేషన్‌ చార్జీల కింద రూ.5.71 కోట్లు చెల్లించారు. సిమెంటు, ఇనుముతో తయారు చేసే విద్యుత్‌ స్తంభాలు, కేబుళ్ల కొనుగోళ్లలోనూ భారీ ఎత్తున ధర లు చెల్లించినట్టు తెలిసింది.

పోటీ ఉన్నా!

విద్యుత్‌ పరికరాల కొనుగోలు ధరలు డిమాండ్‌ను మారుతుంటాయి. కంపెనీల మధ్య పోటీ ఎక్కువైనప్పుడు ధరలు దిగివస్తాయి. డిస్కమ్‌లు భారీగా కొనుగోలు చేయాలనుకుంటే కంపెనీలను పిలిచి మాట్లాడి ధరలు తగ్గించాలని కోరవచ్చు. కానీ, డిస్కమ్‌లు పరికరాల కొనుగోళ్లలో భారీగా ధరల పెంపునకే మొగ్గుచూపినట్టు తెలిసింది. ఒక్కో పరికరంపై దాని రేటు ఆధారంగా ధరలను అమాంతం రెండింతలు పెంచుకుంటూ పోయారు. సగటున ఒక్కో 11 కేవీ వీసీబీకి తెలంగాణతో పోలిస్తే రూ.3 లక్షలు అధిక ధర పెట్టి కొన్నారు. ఇలా అందినకాడికి దోపిడీ చేశారు.

రెండు రకాలుగా

విద్యుత్‌ పరికరాల కొనుగోళ్లు రెండు రకాలుగా సాగాయి. నేరుగా డిస్కమ్‌లు కొనడం ఒకటయితే, వర్క్‌లు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థలతో కొనిపించడం మరో విధానం. డిస్కమ్‌లు ఏదైనా పనిని ప్రైవే టు కాంట్రాక్ట్‌ ఏజె న్సీకి అప్పగిస్తే, విద్యుత్‌ పరికరాలను షిరిడీసాయి నుంచే కొనాలని కొందరు అధికారులు ఒత్తిళ్లు చేశారని తెలిసింది. ఇక డిస్కమ్‌లు కొనుగోలుచేసే పక్షంలో ఆ సంస్థకే ప్రొక్యూర్‌మెంట్‌ టె ండర్‌ దక్కేలా కొందరు అధికారులు పావులు కదిపారు. ఒక్కొక్క విద్యుత్‌ పరికరం కొనుగోలులో ఏపీకి, తెలంగాణకు ఎంత తేడా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఇలా, సగటున ఒక్కొక్క పరికరాన్ని వందలు, వేల సంఖ్యలో కొనుగోలు చేశారు. రెట్టింపు చెల్లింపులు చేసి ప్రైవేటు కంపెనీల గల్లాపెట్టెలు నింపారు. అవి ఆ రూటు ఈ రూటు మారి పెద్దల చేతికి రూ.4500 కోట్లు అందేలా తెరవెనుక పావులు కదిపారు.

Updated Date - May 27 , 2024 | 05:10 AM