Share News

Nagul Meera: జెడ్ ప్లస్ భ‌ద్రత ఎవ‌రికి ఇస్తారో తెలియ‌ని వ్యక్తి జ‌గ‌న్

ABN , Publish Date - Aug 07 , 2024 | 01:21 PM

ముఖ్యమంత్రి హోదాలో తనకు కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Nagul Meera: జెడ్ ప్లస్ భ‌ద్రత ఎవ‌రికి ఇస్తారో తెలియ‌ని వ్యక్తి జ‌గ‌న్

విజయవాడ: ముఖ్యమంత్రి హోదాలో తనకు కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధికార కూటమి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా.. జగన్ వ్యవహారంపై మాట్లాడారు. జెడ్ ప్లస్ భ‌ద్రత ఎవ‌రికి ఇస్తారో తెలియ‌ని వ్యక్తి జ‌గ‌న్ అని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లు జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు రాష్ట్రంలో ప్రజ‌లు బాధపడుతున్నారని పేర్కొన్నారు. జెడ్ ప్లస్ భ‌ద్రత అడ‌గ‌టంతో జ‌గ‌న్ పిచ్చి ప‌రాకాష్టకి వెళ్లిపోయిందని విమర్శించారు.


‘జెడ్ ప్లస్ ఏ ప‌రిస్థితుల్లో కేటాయిస్తారు.. ముఖ్యమంత్రికి ఎటువంటి భ‌ద‌త్ర ఉందటుంది? అలాగే ప్రతిప‌క్ష హోదా నాయ‌కుడికి ఏ భ‌ద్రత ఉంటుందో జ‌గ‌న్ తెలుసుకుని మాట్లాడాలి’ అని నాగుల్ మీరా పేర్కొన్నారు. గుల‌క‌రాయి, కోడి క‌త్తి డ్రామా ఆడితే జెడ్ ప్లస్ కేటాయిస్తారా? అని ప్రశ్నించారు. జెడ్ ప్లస్ భ‌ద్రత దేశంలో ఎంత మందికి ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబుకి జెడ్ ప్లస్ భ‌ద్రత ఎవ‌రు కేటాయించారో జ‌గ‌న్ తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రిగా వుండే భ‌ద్రత కంటే జెడ్ ప్లస్ కింద‌ ఇచ్చే భ‌ద్రత ఎక్కువన్నారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు ... జ‌గ‌న్ హ‌యాంలో భద్రత విషయంలో త‌గిన గౌర‌వం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులుగా చేసిన వైఎస్ఆర్, రోశ‌య్య, కిర‌ణ్ కుమార్ రెడ్డిలు జెడ్ ప్లస్ భ‌ద్రత వున్న చంద్రబాబుకి త‌గిన గౌర‌వం ఇవ్వటం జ‌రిగిందని నాగుల్ మీరా తెలిపారు.


ప్రస్తుతం జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఇటువంటి తరుణంలో ఆయన తనకు ముఖ్యమంత్రి హోదాలో కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. జగన్‌కు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్రయాణించడానికి అనుకూలంగా లేదని కోర్టుకు ఆయన తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ తెలిపారు. జామర్ వెహికల్ కూడా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. మంచి బీపీ వెహికల్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ బీపీ వెహికల్, జామర్ వెహికల్ ఇచ్చే విషయంలో అధికారులను అడిగి వివరాలు సమర్పిస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసింది.

Updated Date - Aug 07 , 2024 | 01:21 PM