Share News

అర్చకులపై అమానుషం

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:56 AM

అధికార మదం తలకెక్కిన కొందరు వైసీపీ నేతలకు కన్నూమిన్నూ కనిపించడం లేదు. భక్తితో మొక్కాల్సిన దేవుడన్నా, ఆయనకు సేవ చేసేవారన్నా అమితమైన ద్వేషం పెంచుకొని వారిపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.

అర్చకులపై  అమానుషం

విచక్షణ లేకుండా ఆలయాల్లోనే దాడులు

భక్తుల ఎదుటే దుర్భాషలు, బూతుపురాణం.. జంధ్యం తెంచేసి.. చెంప దెబ్బలు కొడుతూ

కర్రలు, చెర్నాకోలాతో వాతలు పడేలా దాడి.. పూజారులపై వైసీపీ నాయకుల రాక్షసత్వం

దాడులను ఏనాడూ ఖండించని సీఎం జగన్‌.. బాధ్యులపై చర్యలు లేకపోగా కాపాడే యత్నం

‘ధూపదీప నైవేద్యం’ అమలులో భారీ కోతలు.. వేతన పెంపు రూ.3,125తో సరిపెట్టిన సర్కారు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అధికార మదం తలకెక్కిన కొందరు వైసీపీ నేతలకు కన్నూమిన్నూ కనిపించడం లేదు. భక్తితో మొక్కాల్సిన దేవుడన్నా, ఆయనకు సేవ చేసేవారన్నా అమితమైన ద్వేషం పెంచుకొని వారిపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.

దైవ సన్నిధిలో విజ్ఞతతో మెలగాలన్న కనీసం జ్ఞానం కూడా లేకుండా భక్తుల ఎదుటే బూతుపురాణం ఎత్తుకుంటూ, అర్చకులు, పురోహితులపై విచక్షణ మరిచి రౌడీల్లా దాడులకు తెగబడి, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచీ ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతునే ఉన్నాయి. ఆయా సందర్భాల్లో అర్చకులు, పురోహితులు, హిందూ సంఘాలు రోడ్డెక్కి నిరసనలు తెలిపినా అధికార పార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.

ప్రభుత్వం కూడా ఉదాశీనంగా వ్యవహరిస్తుండటంతో పాటు తమ పార్టీ నేతలను కాపాడే ప్రయత్నాలు చేయడం... బాధ్యులపై చర్యలు తీసుకొనే నాథుడు లేకపోవడంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు.

గత ఐదేళ్లలో వందల మంది అర్చకులపై దాడులు జరిగాయి. సీఎం జగన్‌ ఒక్కసారి కూడా ఈ ఘటనలను ఖండించలేదు. పైగా తమ పార్టీ నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కేసులు పెట్టకుండా అడ్డుకుంటూ, పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆలయాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా పూజారులనే బాధ్యుల్ని చేస్తున్నారు. దీంతో వారంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.


అర్చకులపై జరిగిన దాడుల్లో కొన్ని ...

పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం సోమేశ్వరాలయంలో సహాయ అర్చకుడిపై ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ భర్త దాడి చేశాడు. అంతరాలయంలో అడ్డుగా నిలబడిన ఆయన్ను పక్కకు జరగాలని చెప్పినందుకు అమానుషంగా దాడి చేయడంతో పాటు అర్చకుడి మెడలోని జంధ్యాన్ని తెంచేశాడు. రాజమహేంద్రవరంలోని ప్రముఖ ఆలయంలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

కాకినాడ వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుడిగా ఉన్న రాధాకృష్ణపై అదే ఆలయ వాచ్‌మన్‌ నూకరాజు గతేడాది దీపావళి రోజున దాడి చేశారు. ఆలయంలో శాస్త్రవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న నూకరాజును రాధాకృష్ణ మందలించారు. ఇది మనసులో పెట్టుకుని రాధాకృష్ణ కుటుంబ సభ్యులపై బాణసంచా విసురుతూ, అసభ్య పదజాలంతో నూకరాజు దూషించారు. ప్రశ్నించడానికి వెళ్లిన రాధాకృష్ణపై తీవ్రంగా దాడి చేశారు.

బూటకపు హామీలతో బురిడీ!

అర్చకుల రిటైర్మెంట్‌ విధానాన్ని రద్దుచేస్తామని, 6సీ ఆలయాల్లో అర్చకులకు 25 శాతం జీతాలు పెంచుతామని గత ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ అధినేత జగన్‌ హామీ ఇచ్చారు. దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యాలు, అర్చకుల వేతనాలకు నెలకు రూ.10వేల నుంచి రూ.35వేల వరకూ ఇస్తామని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని హామీలు ఇచ్చారు.

కానీ మేనిపెస్టోలో పొందుపరిచిన వాటినే పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. అర్చకుల రిటైర్మెంట్‌ విషయం పక్కన పెడితే జీతాల పెంపులో పూర్తిగా మోసం చేశారు.

6సీ ఆలయాల్లో విధులు నిర్వహించే అర్చకులకు గత టీడీపీ ప్రభుత్వంలోనే రూ.12,500 వరకూ వేతనం ఇచ్చేవారు. తామొస్తే అర్చకుల్ని ఉద్ధరిస్తామని ప్రగల్భాలు పలికిన జగనన్న అర్చకులకు పెంచింది కేవలం రూ.3,125 మాత్రమే. అదీ మొదటి నాలుగేళ్లు గాలికి వదిలేసి, అర్చకులు పోరాటం చేస్తే ఎన్నికల ఏడాది కావడంతో అమలు చేశారు. మరోవైపు ధూప దీప నైవేద్యం కిందకు ఇప్పటికీ చాలా ఆలయాలు రాలేదు.

ఇదో బూటకకు హామీగా మిగిలిపోయింది. గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 7 ఆలయాలు ఉంటేనే ఆయా గ్రామాల్లో ఉన్న అర్చకులకు రూ.35 వేల వరకూ ఈ పథకం కింద వస్తాయి. పంచాయతీ పరిధిలో ఒకటి, రెండు ఆలయాలుంటే రూ.5వేల నుంచి రూ.10 వేలు మాత్రమే వస్తుంది.

ఆలయం దేవదాయ శాఖ సూచించిన నిబంధనల ప్రకారం ఉంటేనే ధూప దీప నైవేధ్యం పథకంలోకి వస్తుంది. లేకుంటే ఆ రూ.5వేలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు.

ఈ మొత్తం అర్చకుల జీవోనోపాధికి ఏమాత్రం సరిపోవడంలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అదే స్థలంలో వారికి ఇళ్లు కట్టిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది అర్చకులుంటే కేవలం 1,150 మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించారు. మరోవైపు ఆర్చకులకు ఇళ్ల కోసం ప్రభుత్వం ఎప్పుడు దరఖాస్తులు ఆహ్వానించిందో కూడా ఎవరికీ తెలియదు.

తమకు కేవలం 1,400 దరఖాస్తులే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అందులో 1,150 మందిని అర్హులుగా గుర్తించగా, కేవలం 750 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ మాత్రానికే అర్చకులందరికీ ఇళ్లు ఇచ్చేసినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. దీనిపై అర్చకులు, అర్చక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.


అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు నుంచి కొంతమంది అర్చకులు ఆరు నెలల క్రితం కమిషనర్‌ను కలిసి ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన ఇనాం భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. వారికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కమిషనర్‌కు చూపించారు. జిల్లా అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారి ఒకరు ఆగ్రహంతో ఊగిపోయారు. అర్చకులకు ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేశారు. అర్చకులు భూముల్లోకి ప్రవేశించకుండా.. స్థానికులను వారిపై దాడులకు ఊసిగొల్పారు.

నంద్యాల జిల్లాలో కొత్తూరు సుబ్బరాయుడి ఆలయానికి ఆనుకొని శివాలయం ఉంది. నాలుగు నెలల కిందట ఈ ఆలయానికి మహానంది ఈవో వచ్చారు. సుబ్రహ్మణ్యస్వామి దర్శనం అనంతరం శివాలయంలోకి ప్రవేశించారు. స్వామికి నైవేద్యం పెడుతున్నామని, కాసేపు ఆగాలని అక్కడున్న పూజారి చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే ఆపుతావా.. నీ అంతు చూస్తానంటూ వెళ్లిపోయారు. తర్వాత 24 గంటల్లోనే సదరు పూజారిని విధుల నుంచి తొలగించారు. మళ్లీ విధుల్లోకి తీసుకోలేదు.

కాకినాడ బాలాత్రిపురసుందరి సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి మార్చి 25న ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మాజీ కార్పొరేటర్‌ గర్భగుడిలోకి వచ్చారు. ఆయన ఇచ్చిన పూజా సామగ్రిని తీసుకుని అర్చకుడు పూజ చేశారు. అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని, దేవుడి ముందే చెంపపై కొట్టారు. తనేం తప్పు చేశానని ప్రశ్నించిన అర్చకుడిని ‘నాకే ఎదురు సమాధానం చెబుతావా’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ కాలుతో తన్నారు. బండబూతులు తిడుతూ రెచ్చిపోయారు. మీ అంతు చూస్తానని బెదిరించారు. దీనిపై అర్చకులు ఫిర్యాదు చేసినా ఈవో పట్టించుకోలేదు. పైగా అర్చకుడిపై దాడి జరిగే సమయంలో ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు ఆపేశారు. వైసీపీ నాయకుడికి కొమ్ముకాసేలా అధికారులు వ్యవహరించారు. బాధిత అర్చకులకు న్యాయం జరగకుండానే... వివాదం ఏమీ లేదని, అంతా చక్కబడినట్లేనని వైసీపీ నేతలు వారితోనే బలవంతంగా చెప్పించారు. చివరికి పోలీసు కేసు పెట్టినా బలహీనమైన సెక్షన్లతో దాడిచేసిన వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు.

Updated Date - Apr 27 , 2024 | 04:56 AM