Share News

High Court : దర్యాప్తునకు సహకరించండి

ABN , Publish Date - Oct 25 , 2024 | 04:23 AM

High Court : Kethi Reddy Peddareddy, his sons Harshavardhan Reddy, Sai Pratap Reddy and others to cooperate in the Investigation

High Court : దర్యాప్తునకు సహకరించండి

  • పెద్దారెడ్డి, ఆయన కుమారులకు హైకోర్టు ఆదేశం

  • వివరాలు సమర్పించాలని పోలీసులకు నిర్దేశం

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, సాయిప్రతా్‌పరెడ్డి తదితరులను హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై వివరాలు సమర్పించాలని పోలీసులను నిర్దేశించింది. తదుపరి విచారణ వరకు వారిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. విచారణను నవంబరు 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన కుమారులు, వైసీపీ నాయకులు ఈ ఏడాది మే 14న తమపై రాళ్లతో, మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారని తాడిపత్రి పట్టణం రాగితోటపాలెంకు చెందిన కోర్నపల్లి చిన్న సంజన్న ఈ నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదే రోజు తమపైనా పెద్దారెడ్డి, ఆయన కుమారులు దాడి చేశారంటూ కానాల రవీంద్రరెడ్డి, షేక్‌ సాదక్‌ వలీ రిజిస్టర్‌ పోస్టులో ఫిర్యాదు పంపారు. వీటి ఆధారంగా పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పెద్దారెడ్డి బృందం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఇవే కేసుల్లో నిందితులుగా ఉన్న మరికొందరిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ వరకు పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.

Updated Date - Oct 25 , 2024 | 04:24 AM