Share News

ఆ ఖాకీల్లో.. కలవరం

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:15 AM

ఐదేళ్ల ఖాకీరాజ్యానికి.. ఐపీసీకి బదులు అమలైన వైసీపీ చట్టానికి చెక్‌ పడింది. ఐదేళ్ల అరాచక పర్వానికి తరపడింది. టీడీపీ, జనసేన కార్యకర్తలకే గాక సామాన్య ప్రజలకు కూడా ేస్వచ్ఛ, స్వాతంత్ర్యాలు లభించాయి. వైసీపీ పాలనలో ఐదేళ్లు చట్టం, న్యాయంతో పని లేకుండా అధికార పార్టీ నేతలు ఏది చెప్తే అదే అమలు చేసిన పోలీసుల్లో కలవరం మొదలైంది.

ఆ ఖాకీల్లో.. కలవరం

వైసీపీ చట్టం అమలు చేయడంలో పలువురు పోటీ

కోడ్‌ ముందు వరకు వారు ఆడిందే ఆట.. పాడిందే పాట

టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు

నాడు ఇబ్బందులు ఎదుర్కొన్న పోలీసులకు సముచిత స్థానం దక్కేనా?

పోలీసులమనే విషయం మరిచారు. వైసీపీ నేతలకంటే ఎక్కువగా బరితెగించారు. రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం.. కోర్టులను పట్టించుకోలేదు. ఐపీసీ కాదు.. వైసీపీ ముఖ్యమన్నట్లుగా చెలరేగారు. వైసీపీ నేతలు చెప్పడమే ఆలస్యమన్నట్లుగా కేసులు.. అరెస్టులతో చిత్రహింసలకు పాల్పడ్డారు. అన్యాయం జరిగింది అన్నా కూడా ప్రతిపక్షాలతో ముడిపెట్టి వారికి న్యాయం చేయలేదు. వైసీపీ శ్రేణులు చంపేస్తున్నాయి.. రక్షించండి అంటూ పోలీసుస్టేషన్లకు వెళ్లినా పట్టించుకోకపోగా ఊర్లు వదిలి వెళ్లింపోండనే సలహాలతో సరిపెట్టారు. మరికొందరు పోలీసులైతే వైసీపీ వారిపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ఎదురు కేసులతో హింసించారు. ఐదేళ్ల ఖాకీరాజ్యంలో సామాన్యుల నుంచి ప్రతిపక్షా నేతల వరకు కనీసం మాట్లాడే ేస్వచ్ఛ కూడా లేకుండా పోయింది. కొందరు ఎస్‌ఐలు, సీఐలే కాదు డీఎస్పీలు, ఐపీఎస్‌ల వరకు అధికార పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా వైసీపీ చట్టం అమలు చేసేందుకు పోటీలు పడ్డారు. సామాన్యులు పోలీస్‌ స్టేషన్లకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ధీమాతో బరితెగించిన పోలీసుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో కలవరం మొదలైంది.

గుంటూరు, జూన్‌ 6: ఐదేళ్ల ఖాకీరాజ్యానికి.. ఐపీసీకి బదులు అమలైన వైసీపీ చట్టానికి చెక్‌ పడింది. ఐదేళ్ల అరాచక పర్వానికి తరపడింది. టీడీపీ, జనసేన కార్యకర్తలకే గాక సామాన్య ప్రజలకు కూడా ేస్వచ్ఛ, స్వాతంత్ర్యాలు లభించాయి. వైసీపీ పాలనలో ఐదేళ్లు చట్టం, న్యాయంతో పని లేకుండా అధికార పార్టీ నేతలు ఏది చెప్తే అదే అమలు చేసిన పోలీసుల్లో కలవరం మొదలైంది. బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేసిన వారు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలా అన్న మీమాంశలో పడిపోయారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అధికార పార్టీ నేతల ఆదేశాలతో కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తలు లాగా వేధింపులకు పాల్పడ్డారు. మరికొందరు అధికార పార్టీ నేతల మెప్పుకోసం అతిగా వ్యవహరించారు. అనేకమంది పోలీస్‌ అధికారులు మూడు సింహాలు సిగ్గుపడేలా ఐపీసీని వైసీపీగా మార్చి అరాచకాలకు పాల్పడ్డారు. ఈ జాబితాలో అనేకమంది ఎస్పీల నుంచి సీఐలు, ఎస్‌ఐలు, డీఎస్పీలు ఉన్నారు. అయితే వారంతా ఇప్పుడు టీడీపీ నాయకులు భావిస్తున్నట్లు భయపడటం లేదు. టీడీపీలో తమకు తెలిసిన నాయకుల ద్వారా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దారుణంగా అరాచకానికి పాల్పడి హిట్‌ లిస్టులో ఉన్న వారిలో మాత్రం కొంతవరకు కలవరం కనపడుతుంది. దీంతో వారు రాబోయే ప్రభుత్వం ఈ దఫా ఎలా వ్యవహరించబోతుందోననే ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. వైసీపీ హయాంలో కీలకమైన స్థానాల్లో ఉన్నవారు టీడీపీ, వైసీపీ వారి ఫోన్లు కూడా తీయకుండా, పలు సందర్భాల్లో కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఏకవచనంతో పిలుస్తూ దారుణంగా వ్యవహరించారు.

కార్యకర్తల్లో పెల్లుబికుతున్న ఆగ్రహం

గడిచిన ఐదేళ్లలో నెలకొన్న దారుణ పరిస్థితులను తలుచుకుని టీడీపీ, వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధిస్తూ కౌంటింగ్‌ సందర్భంగా ట్రెండ్‌ కొనసాగుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు అటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, విడదల రజిని కార్యాలయాలపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ సందర్భంగా కార్యకర్తలు వ్యవహరించిన తీరు గడిచిన 5 ఏళ్లలో వారు ఎదుర్కొన్న అణచివేత ప్రస్ఫుటంగా కనిపించింది. పోలీసులు లాఠీచార్జి చేస్తామన్న కార్యకర్తలు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఐదేళ్లు ఈ లాఠీలు ఏమయ్యాయని, ఎక్కడ దాచి పెట్టారంటూ అధికారులను సైతం నిలదీశారు. గడచిన ఐదేళ్లు తమకు నరకం చూపించారని ఇప్పుడు కూడా తమను వేధిస్తామంటే సహించేది లేదంటూ ఎదురు తిరిగారు. తమను, సామాన్య ప్రజలను గడిచిన ఐదేళ్లలో వేధించిన ఏ పోలీస్‌ అధికారిని సహించేది లేదని వారికి ఎక్కడ పోస్టింగ్‌ ఇవ్వకపోవడమే కాక వారి వేధింపులపై సమగ్ర విచారణ జరిపి చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది రోజుల్లో ప్రభుత్వ పాలనలో కీలకంగా మారిన పోలీస్‌ శాఖలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుందనే దానిపై అటు పోలీసు వర్గాల్లోను, ఇటు టీడీపీ, జనసేన కార్యకర్తల్లోనూ ఆసక్తి నెలకొంది.

ప్రశ్నిస్తే కేసులు.. అరెస్టులు

అధికార పార్టీని కానీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గాని ప్రశ్నించినా, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా సీఐడీ అధికారులు రాత్రి, పగలు తేడా లేకుండా ఆడ, మగ చూడకుండా, వయసుతో సంబంధం లేకుండా అరెస్టులు, విచారణల పేరుతో వేధింపులకు గురి చేశారు. వెంగళరావు, దారపునేని నరేంద్ర లాంటి టీడీపీ కార్యకర్తల నుంచి రంగనాయకమ్మ అనే కామన్‌ మ్యాన్‌ వరకు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్బంధాలు... వేధింపులకు గురయ్యారు. అధికార పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు అరెస్టు నుంచి తప్పుడు కేసులలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్నపాత్రుడు వంటి వారందరి విచారణకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వేదికగా నిలిచింది. రాజధానిలో దళిత రైతులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి వారాల తరబడి జైళ్లలో నిర్బంధించారు. అనేక మంది వృద్ధులైన రాజధాని రైతులపై కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపారు. రాజధాని మహిళా రైతులపై అత్యంత కర్కశంగా లాఠీలతో విరుచుకుపడ్డారు.

వైసీపీ కార్యాలయాల్లా పోలీస్‌స్టేషన్లు

ఐదేళ్లుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్లు వైసీపీ కార్యాలయాల మారాయంటే ఆశ్చర్యం కాదు. అధికార పార్టీ బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అప్పటికే వారు అక్కడ ఉండటం.. వారే పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం వాటిని ఆయా అధికారులు అమలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఇక ప్రైవేటు పంచాయతీలు చేసే కేంద్రాలుగా పోలీసు స్టేషన్లను మార్చారనే అభియోగాలు వచ్చాయి. అధికార పార్టీ ల్యాండ్‌ మాఫియా చెప్పిందే ఖాకీలు తూచా తప్పకుండా పాటించారు. ఇదే అదునుగా పోలీస్‌ స్టేషన్లలో అవినీతి తాండవించింది. కేసు నమోదు చేయాలన్నా డబ్బులు, చేయకుండా ఉండాలన్నా డబ్బులు ఉండాల్సిందే. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలన్నా, కోర్టులో హాజరు పరచాలన్నా డబ్బులే. పోలీసు గడప తొక్కాలంటే జేబులో డబ్బులు కట్టలైనా ఉండాలి లేదంటే అధికార పార్టీ నేతల సిఫార్సు అయినా ఉండాలి. ఐదేళ్లు ఇలా ఖాకీ రాజ్యం సాగింది.

ఖాకీరాజ్యంలో అరాచకం

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఖాకీరాజ్యం కొనసాగింది. పల్నాడులో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. టీడీపీలో చురుగ్గా తిరుగుతుంటే చాలు ఎస్‌ఐలు, సీఐలు వారిని ేస్టషన్లకు పిలిపించి వైసీపీ కండువా అయినా కప్పుకోండి లేదంటే ఊరు వదిలిపెట్టి వెళ్లిపోండి అంటూ నేరుగా బెదిరింపులకు దిగారు. లేదంటే అక్రమ మద్యం, హత్యాయత్నం వంటి కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని, రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాక వారి మాట వినని వారిపై హెచ్చరించినట్లుగానే తప్పుడు కేసులు బనాయించి స్టేషన్లో లాఠీ కౌన్సెలింగ్‌ ఇచ్చి వేధింపులకు గురి చేశారు. నెలలు తరబడి జైళ్లలో మగ్గిపోయేలా చేశారు. అంతేకాక అనేక గ్రామాల్లో టీడీపీలో చురుగ్గా పనిచేసే నాయకులు, కార్యకర్తల హత్యల వెనుక పోలీసుల ఉదాశీన వైఖరి కూడా స్పష్టంగా కనిపించింది. ఏ కారణం లేకుండానే పార్టీ నాయకులను, కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురి చేశారు. అనేక గ్రామాల్లో వైసీపీ గుండాల అరాచకాలకు టీడీపీ వర్గీయులు ఊళ్లు వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎక్కడా వారిని కట్టడి చేయకపోగా టీడీపీ వారిపైనే వేధింపులకు పాల్పడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైనా, టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా ఒక రోజు ముందే హెచ్చరించి యదేఛ్చగా దాడులకు పాల్పడ్డారు. రాజధానిలో చంద్రబాబు బస్సు యాత్ర చేస్తుంటే పోలీసుల సహకారంతోనే ఆయనపై దాడికి యత్నించడం, రాళ్ళు, కర్రలతో బస్సుపై దాడి చేయడం, మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, న్యాయవాది పారా కిశోర్‌లపై హత్యాయత్నం, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతల మాదిరిగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటి దుర్మార్గ చర్యల్లో పోలీసులే కీలకంగా వ్యవహరించారు. పల్నాడులో వైసీపీ నాయకుల కంటే కూడా పోలీసులను చూస్తేనే టీడీపీ కార్యకర్తలు భయాందోళనకు గురయ్యారంటే వారి పని తీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పోలీసుల్లోనూ ఐదేళ్లుగా కొందరు నరకం

గడిచిన ఐదేళ్లు అధికార పార్టీ నేతల వేధింపులు, పోస్టింగుల్లో వివక్షతో కొందరు పోలీసులు నరకం చూశారు. కొంతమంది స్వచ్ఛందంగా వలంటరీ రిటైర్మెంట్‌ ఇచ్చి వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చారు. పలువురిపై తప్పుడు కేసులు బనాయించారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించే వారిని కూడా వదలకుండా పోస్టింగ్స్‌ ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచుతూ జీతం కూడా రానివ్వకుండా వేధింపులకు గురి చేశారు. చివరకు ఎన్నికలు విధులే కాకుండా సాధారణ బందోబస్తుల్లోనూ కీలక బాధ్యతలు అప్పగించకుండా ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేశారు. ఒకరిద్దరూ నిష్పక్షపాతంగా పనిచేసే వారు ఉన్నతాధికారుల మెప్పు పొంది జీతం కోసం లూప్‌లైన్‌ పోస్టింగ్‌ తెచ్చుకున్నప్పటికీ విషయం తెలుసుకుని వారిని అక్కడ కూడా ఉండనివ్వకుండా తరిమేశారు. ఈ పరిణామాలతో ఆ వర్గం పోలీసులు తీవ్ర మానసిక ఒత్తిడికి, ఆందోళనకు, ఆవేదనకు లోనయ్యారు. అలాగే వారితో పాటు టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్న వారిని కూడా పోస్టింగ్‌కు దూరంగా ఉంచారు. ఈ విధంగా తమ సర్వీసులో ఎన్నడూ చూడని విధంగా గడిచిన ఐదేళ్లలో వారికి నరకం చూపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో ఈసారైనా తమకు సముచిత స్థానం వస్తుందనే ఆశతో వారు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 01:15 AM