పని ఒకరిది.. బిల్లు మరొకరికి
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:06 AM
అధికారం ఉంది.. వచ్చేదీ తమ ప్రభుత్వమే అనే ధీమాతో ఐదేళ్లుగా పల్నాడులో ఆర్థిక అరాచకాలకు పాల్పడిన వారు తాజా పరిణామాలతో హతాశులవుతున్నారు.

నగదు ఇవ్వకుంటే ఏఈపై కేసు పెడతానన్న కాంట్రాక్టర్
పల్నాడులో వెలుగులోకి వస్తున్న వైసీపీ ఆర్థిక అరాచకాలు
నరసరావుపేట, జూన్ 6: అధికారం ఉంది.. వచ్చేదీ తమ ప్రభుత్వమే అనే ధీమాతో ఐదేళ్లుగా పల్నాడులో ఆర్థిక అరాచకాలకు పాల్పడిన వారు తాజా పరిణామాలతో హతాశులవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ తిమింగలాలపై బాధితులు తిరుగుబాటు చేస్తున్నారు. వైసీపీ ఆర్థిక అరాచకాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. తమ నుంచి రూ.లక్షలు వసూలు చేశారు.. వాటిని కక్కాల్సిందేనంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో అటు అధికారులు, ఇటు నాయకులు అడిగినంత ముట్టచెప్పుకున్న వారు రెండు రోజులుగా తిరుగుబాట చేస్తున్నారు. పూడా వైఎస్ చైర్మన తమను బెదిరించి రూ.లక్షలకు లక్షలు వసూలు తీసుకున్నాడు.. ఆ డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ రియాల్టర్లు కొందరు గురువారం పూడా కార్యాలయానికి వెళ్లి ఏకంగా వైఎస్ చైర్మన గజ్జల శ్రీనివాసరెడ్డిని నిలదీయడం ఆయన అప్పటికప్పుడు రూ.50 లక్షలు తెచ్చి ఇవ్వడం తెలిసిందే. శుక్రవారం కూడా మరికొందరు రియల్టర్లు పూడా కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం నరసరావుపేటకు చెందిన బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు కూడా తమ నుంచి వైసీపీ నాయకులు లక్షలు వసూలు చేశారని ఆ మొత్తాలను వడ్డీతో సహా కక్కాల్సిందేనని లేదంటే వదలమంటూ వారికి ఫోన్లు చేసి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పంచాయతీ ఏఈ చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రొంపిచర్ల మండలం గోగులపాడులో టీడీపీ హయాంలో ఓ కాంట్రాక్టర్ ఉపాధి హామీ పథకం కింద ఓ భవనం నిర్మించారు. వైసీపీ అఽధికారంలోకి రాగానే ఆ కాంట్రాక్టర్‌కు బిల్లును నిలిపివేశారు. ఆ తర్వాత బిల్లు చెల్లింపు ప్రక్రియ మొదలుపెట్టిన ఏఈ గోగులపాడుకు చెందిన ఓ వైసీపీ నేతకు రూ.10 లక్షలు మంజూరు చేశారు. తాను పని చేస్తే వైసీపీకి చెందిన వ్యక్తికి బిల్లు చేయడంపై సంబంధిత టీడీపీ కాంట్రాక్టర్ ఇంతకాలం మౌనంగా ఉన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో సదరు ఏఈని బాఽధిత కాంట్రాక్టర్ గురువారం నిలదీసి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏఈతో టీడీపీ నేతలు పంచాయితీ చేశారు. రెండు రోజుల్లో రూ.10 లక్షలు చెల్లిస్తానని ఏఈ జగన్‌మోహనరెడ్డి అంగీకరించారని, అలా చెల్లించకపోతే ఏఈపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు.
వైసీపీ నేతలకు బార్ల నిర్వహకుల హెచ్చరిక
వైసీపీ హయాంలో తమను బెదిరించి వైసీపీ నేతలు కొట్టేసిన డబ్బు కక్కించేందుకు టీడీపీ, జనసేనలకు చెందిన బార్ల నిర్వహకులు సిద్ధమయ్యారు. దాదాపు రూ.1.25 కోట్లు వైసీపీ నేతలు వసూలు చేశారని, ఎవరైతే తమ వద్ద డబ్బు తీసుకువెళ్లారో సదరు నేతలు ఆ సొమ్ములను వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తనను బెదిరించి రూ.20 లక్షలు తీసుకున్న ఓ వైసీపీ నేతకు ఓ బార్ నిర్వాహకుడు ఫోన చేసి ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తెచ్చి ఇవ్వాలని కోరాడు. తాను ఒక్కడ్నే నగదు తీసుకోలేదని ఆ నేత సమాధానం ఇవ్వడంతో తన దగ్గర డబ్బు తీసుకు వెళ్లింది నువ్యే కాబట్టి ఆ మొత్తం నువ్వే ఇవ్వాలని లేకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఓ బార్ నిర్వహకుడి వద్ద రూ.40 లక్షలు, మరో వ్యాపారి వద్ద రూ.25 లక్షలు, మరో వ్యక్తి వద్ద రూ.15 లక్షలు వైసీపీ నేతలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. వీరందరూ కొట్టేసిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.