టీడీపీలో చేరాడని దళితుడిపై దాష్టీకం
ABN , Publish Date - May 12 , 2024 | 01:21 AM
మండలంలోని గణపవరం పంచాయతీ లంకమాలపల్లికి చెందిన దళిత నేత కత్తి రాజేశ్వరరావు(రాజేష్) శనివారం ఉదయం బాపట్ల అసెంబ్లీ కూటమి అభ్యర్థి నరేంద్రవర్మ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

ఎస్‌ఐ, కోన వెంకట్‌పై కేసు నమోదు చేయాలని స్టేషన్ చుట్టుముట్టిన దళితులు
దళితుడికి న్యాయం చేయాలని తెన్నేటి, వేగేశన, అన్నం డిమాండ్
కర్లపాలెం, మే 11: మండలంలోని గణపవరం పంచాయతీ లంకమాలపల్లికి చెందిన దళిత నేత కత్తి రాజేశ్వరరావు(రాజేష్) శనివారం ఉదయం బాపట్ల అసెంబ్లీ కూటమి అభ్యర్థి నరేంద్రవర్మ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. దీంతో బాపట్ల వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి బంధువు అయిన సినీ రచయత, నిర్మాత కోన వెంకట్ ఫోన ఆదేశాలతో ఇంట్లో నిద్రిస్తున్న రాజేష్‌ను పోలీసులు స్టేషనకు తీసుకెళ్లారు. ఆ వెంటనే స్టేషనకు చేరుకున్న కోన వెంకట్ ఎస్‌ఐ జనార్థన ఎదుటే దళితుడిపై చేయిచేసుకున్నారు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులు, టీడీపీ నేతలు స్టేషనను చుట్టిముట్టి ఐదు గంటల సేపు ఆందోళన చేశారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీరాల గోవర్థనరెడ్డి, నాయకులు సలగల రాజశేఖర్, డాక్టర్ చార్వాక, న్యాయవాదులు కళ్ళం హరినాథరెడ్డి,
గవిని శ్రీనివాసరావు, భోగిరెడ్డి రమేష్‌రెడ్డి, బెజ్జం వెంకటేశ్వర్లు స్టేషన వద్దకు చేరుకుని దళితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా కోన వెంకట్ చెప్పారని దళితుడ్ని ఎస్‌ఐ స్టేషనకు పిలిపించడంపై డీఎస్పీ మురళీకృష్ణ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు.
కులం పేరుతో దూషించి దాడి
కోన వెంకట్, అతడి అనుచరులు మార్పు బెనర్జి, మార్పు రత్నం, కాగిత మోషె, నక్కా సంతోష్‌లు ఎస్‌ఐ సమక్షంలోనే కులం పేరుతో దూషించి, కాలుతో తన్నారని రాజేష్ డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. పార్టీ మారటం నీ ఇష్టమా, ఎంతకు అమ్ముడు పోయావు.. నిన్ను చంపితే దిక్కు ఎవరు, మా బాబాయి కాబోయే ఎమ్మెల్యే అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టారన్నారు. ఎస్‌ఐ కూడా చెంపలపై కొట్టి, పెద్దవారితో నీకేందుకురా అని తిట్టాడన్నారు.
ఎస్‌ఐపై వేటు
రాజేశపై దాడి చేసిన కోన వెంకట్‌తో పాటు ఆయన అనుచరులు, ఎస్‌ఐ జనార్థనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్‌ఐను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.