Share News

మహిళా ఓటర్ల ప్రభంజనం

ABN , Publish Date - May 16 , 2024 | 01:04 AM

గుంటూరు లోక్‌సభ పరిధిలో మహిళా ఓటర్ల ప్రభంజనం కనిపించింది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 39969 మంది అధికంగా ఓటు వేశారు. ఓటర్లుగా ఎక్కువ సంఖ్యలో ఉన్న మహిళలు ఓటు హక్కు వినియోగంలోనూ తమదే పైచేయి అని నిరూపించుకున్నారు.

మహిళా ఓటర్ల ప్రభంజనం
ఓటేసేందుకు బారులు తీరిన మహిళలు

గుంటూరు, మే 15: గుంటూరు లోక్‌సభ పరిధిలో మహిళా ఓటర్ల ప్రభంజనం కనిపించింది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 39969 మంది అధికంగా ఓటు వేశారు. ఓటర్లుగా ఎక్కువ సంఖ్యలో ఉన్న మహిళలు ఓటు హక్కు వినియోగంలోనూ తమదే పైచేయి అని నిరూపించుకున్నారు. పోలింగ్‌ రోజున మండుటెండను లెక్క చేయకుండా వేకువజామున 6 గంటలకే పనులు ముగించుకుని బూతలకు పోటెత్తారు. కొంతమంది మధ్యాహ్నం తర్వాత పోలింగ్‌ బూతలకు వెళ్లి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల సమయంలోనూ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లిన వారు ఎంత రాత్రి అయినా అసంతృప్తికి గురి కాకుండా ఓటుహక్కుని వినియోగించుకున్నారు. ఈ కారణంగానే జిల్లాలో ఉన్న మహిళా ఓటర్లలో 81.63 శాతం ఓటుహక్కుని వినియోగించుకున్నట్లు తుది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై ఎవరికి వారు తమకే అనుకూలమని జిల్లాలో ప్రచారం చేసుకుంటున్నాయి.

జిల్లాలో 926007 మంది మహిళా ఓటర్లు ఉండగా వారిలో 725955 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే పురుషు విషయానికి వస్తే 865377 మందికి గాను 685986 మాత్రమే ఓటేశారు. గత ఎన్నికల్లో పురుషులు, మహిళలు ఇంచుమించుగా సమానంగా ఓటుహక్కుని వినియోగించుకున్నారు. ఈ దఫా మాత్రం ఓటు వేయాలన్న పట్టుదల మహిళల్లో మరింత ఎక్కువగా కనిపించింది. అదే వారిని పోలింగ్‌ కేంద్రాల బాట పట్టేలా చేసింది. పోలింగ్‌ బూతలలో అరకొరగా షామియానాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. కచ్చితంగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్న తాపత్రయం ప్రతీ ఒక్కరిలో స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించింది. మహిళల్లో వృద్ధులు కూడా ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. కొత్తగా ఓటుహక్కు పొందిన యువతులు తమకు ఏ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయో అటువైపే మొగ్గుచూపారు. టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఆర్‌టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు వచ్చేవరకు నెలకు రూ.1,500, అమ్మకు వందనం పేరుతో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే వారందరికి ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థికసాయం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం తదితర హామీలను ప్రకటించింది. ఈ నాలుగు హామీలే మహిళలను పోలింగ్‌ బూతలకు నడిపించాయని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 16 , 2024 | 01:04 AM