Share News

పడినా... నిలిచి గెలిచారు

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:06 AM

గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో ఓటమి చవి చూసిన గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదుగురు తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఈ దఫా సత్తా చాటారు.

పడినా... నిలిచి గెలిచారు

నరేంద్ర, శ్రావణ్‌, నసీర్‌, లోకేశ్‌ల, మనోహర్‌ల భారీ విజయం

వైసీపీ కుట్రలను ధీటుగా ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడటమే కారణమా !

గుంటూరు, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో ఓటమి చవి చూసిన గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదుగురు తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఈ దఫా సత్తా చాటారు. అలా... ఇలా కాదు. భారీ మెజార్టీలతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను మట్టికరిపించారు. మాజీ సీఎం జగన్‌ నివాసం ఉన్న మంగళగిరిలో 91వేల పైచిలుకు మెజార్టీ సాధించడం గాలివాటంగా రాలేదు. అలానే ముస్లిం మైనార్టీలు బలంగా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనూ 31వేల పైచిలుకు మెజార్టీ సాధించ గలగడం ఆషామాషీ కాదు. పొన్నూరులో అయితే టీడీపీ నేతలు కార్యకర్తలు వీరోచితంగా పోరాడి ఈ విజయాన్ని దక్కించుకున్నారు.

గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర వేధింపులకు గురయ్యారు. అనేక అక్రమ కేసులను ఆయనపై వైసీపీ ప్రభుత్వం బనాయించి జైలులో పెట్టింది. చివరికి సంగం డెయిరీనీ ఆక్రమించుకొనే ప్రయత్నం చేసింది. ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ని కూడా నియమించింది. ఇక కార్యకర్తలపై ప్రతీ గ్రామంలోనూ వేధింపులు జరిగాయి. వాటన్నిం టిని ధీటుగా ఎదుర్కొంటూ నరేంద్ర నిలబడగలిగారు. తనపై పెట్టిన కేసుని న్యాయస్థానంలో ఎదుర్కొని గెలిచి జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు వైసీపీ నేతలు చేబ్రోలు మండలంలో దోచేసిన సహజ వనరులపై అలుపెరగని పోరాటమే చేశారు. కార్యకర్తలకు కష్టం వస్తే వెళ్లి అండగా నిలిచారు. ఇవన్ని ఆయనకు సానుకూలంగా మారి ఎన్నికల్లో 32,915 ఓట్ల భారీ మెజార్టీని సాధించి పెట్టాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన షేక్‌ నసీర్‌ అహ్మద్‌ గడిచిన ఐదేళ్లలో వీరోచితంగా పోరాడారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుటుంబ సభ్యులు చేసిన దోపిడీలు, కబ్జాలను ధైర్యంగా బహిర్గతం చేశారు. కేసులకు బెదరకుండా పోరాటాలు, ఆందోళనలు నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెళ్లి అండగా నిలిచేశారు. ఎప్పుడైతే నగరపాలకసంస్థలో కొత్తపేటలోని ఒక డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నసీర్‌ గెలిపించు కొన్నారో అప్పుడే ఆయన విజయానికి తొలి మెట్టు పడింది. అది మొదలుకొని ఆయనకు ప్రజల ఆదరణ పెరిగిపోవడంతో ఎన్నికల్లో 31,962 ఓట్ల మెజార్టీని దక్కించుకొన్నారు.

మంగళగిరి నుంచి పోటీ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గత ఎన్నికల్లో సుమారు ఐదే వేల ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యారు. దాంతో వైసీపీ నేతలు ఆయన్ని తీవ్రంగా అవమానించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన గెలవలేరని తూలనాడారు. లోకేష్‌ కుటుంబంపై బురదజల్లారు. ఆయనపై రాజధాని భూములకు సంబంధించి అక్రమ కేసులు కూడా సీఐడీ బనాయించింది. వీటన్నింటిని తట్టుకొని ఆయన నిలబడ్డారు. మరోవైపు తన స్వంత నిధులు వెచ్చించి మంగళగిరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతోమందికి ఉపాధి కల్పించారు. పరికరాలు పంపిణీ చేశారు. ఏ కార్యక్రమానికి ప్రజలు పిలిచినా వెళ్లి ఆశీర్వదించారు. జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించారు. ఇవన్ని ఆయనకు ప్లస్‌ పాయింట్‌లుగా మారాయి. ఎన్నికల నాటికే ఆయన గెలుపు ఖరారు కాగా మెజార్టీ 60 వేలా... 80 వేలా అని లెక్కించారు. అయితే ఆ అంచనాలనఉ కూడా దాటి 91,413 ఓట్ల మెజార్టీని లోకేశ్‌ పొందడం గుంటూరు జిల్లా చరిత్ర లోనే రికార్డుగా మారింది.

సాదాసీదాగా అందరితో కలిసిమెలిసి ఉండే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ గత 15 ఏళ్లుగా తాడికొండని అంటిపెట్టుకొని ఉన్నారు. 2009లో ఓటమి పాలైనా ప్రజలకు అండగానిలిచి వారి సమస్యలపై పోరాటం చేసి 2014లో గెలుపొందారు. ఆ తర్వాత అమరావతి రాజధానిని తాడికొండ నియోజకవర్గంపరిధిలోనే సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. శ్రావణ్‌కుమార్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ గన్‌మెన్‌ లను నియమించుకోరు. ఎక్కడికెళ్లినా ఒంటరిగానే వెళతారు. నియోజకవర్గానికి ఎంతో మేలు చేసినా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటంచేసి 39,606 ఓట్ల మెజార్టీని ఈ దఫా సాధించారు.

తెనాలిలో గత ఎన్నికలలో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయడం వలన అక్కడ జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఆయన జనసేనలో కీలక భూమిక పోషిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తెనాలిని గతంలో అభివృద్ధి చేసిన ప్రజాప్రతినిధిగా మంచి పేరు ఉండటం ఈఎన్నికల్లో ప్లస్‌ పాయింట్‌ అయింది. మరోవైపు వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ అరాచకాలను అక్కడి ప్రజలు జీర్ణించు కోలేకపోయారు. టీడీపీ క్యాడర్‌ అంతా కష్టపడటంతో మనోహర్‌ 48,112 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Updated Date - Jun 06 , 2024 | 01:06 AM